భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Stock market indices trade lower
close

Published : 03/05/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈవారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో పాటు కొవిడ్‌ భయాలు సూచీలపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయి. సోమవారం ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 501 పాయింట్లు నష్టపోయి 48,280 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 129 పాయింట్లు దిగజారి 14,502 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద ట్రేడవుతోంది. 

అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. కొవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో పాటు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించడం మదుపర్లను ప్రభావితం చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగానూ లాక్‌డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. పైగా ఇప్పటికే విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్లతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని.. దీంతో పునరుత్తేజం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. మరోవైపు శనివారం ప్రారంభమైన మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం టీకాల కొరత కారణంగా మందకొడిగా సాగుతుండడం మదుపర్లను నిరాశకు గురిచేస్తోంది. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలూ సూచీలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు భారీ నష్టాల దిశగా పయనిస్తున్నాయి. 

దాదాపు అన్ని కీలక రంగాల సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.  సిప్లా, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ భారత్ పెట్రోలియం, బజాజ్‌ ఆటో స్వల్ప లాభాల్లో పయనిస్తుండగా.. ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని