Stock market: ఆరంభ లాభాలు ఆవిరి.. వరుసగా నాలుగో రోజూ నష్టాలే! - Stock markets enda in red
close

Updated : 22/10/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆరంభ లాభాలు ఆవిరి.. వరుసగా నాలుగో రోజూ నష్టాలే!

ముంబయి: కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీల్లో వరుసగా నాలుగో రోజైన శుక్రవారమూ నష్టాలు తప్పలేదు. ఉదయం సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు అదే బాటలో పయనించాయి. అక్కడి నుంచి క్రమంగా పడుతూ ఒంటిగంట తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాలను నమోదు చేశాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడగా.. ఐరోపా మార్కెట్లు బలంగా ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా మార్కెట్‌ సూచీలు గరిష్ఠాల వద్ద నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు కీలక రంగాల్లో లాభాలకు మొగ్గుచూపుతుండడమే వరుస నష్టాలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉదయం సెన్సెక్స్‌ 61,044 వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. 60,551 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 101 పాయింట్ల నష్టంతో 60,821 వద్ద ముగిసింది. నిఫ్టీ రోజులో 18,314 - 18,034 మధ్య కదలాడింది. చివరకు 63 పాయింట్ల నష్టంతో 18,114 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 12 షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు రాణించాయి. ఐటీసీ, మారుతీ, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని