పేటీఎం ఐపీఓను నిలిపేయండి! - Stop Paytm IPO!
close

Updated : 13/08/2021 06:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేటీఎం ఐపీఓను నిలిపేయండి!

సెబీని కోరిన మాజీ డైరెక్టర్‌
ఇది వేధించడమే అంటున్న కంపెనీ

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) తొలి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా, ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ సక్సేనా (71) ఐపీఓను నిలిపివేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరారు. తాను పేటీఎం సహ వ్యవస్థాపకుడినని, రెండు దశాబ్దాల క్రితమే 27,500 డాలర్లు పెట్టుబడి పెట్టానని, అయితే తనకు ఇంత వరకు ఎలాంటి షేర్లు కేటాయించలేదని ఆరోపించారు. పేటీఎం తనను మోసం చేసిందని ఆరోపిస్తూ అశోక్‌ కుమార్‌ న్యూదిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఐపీఓను నిలిపివేయాలని సెబీని కోరడం కంపెనీని వేధించడమేనని పేటీఎం పేర్కొంది. ఆయన సహ వ్యవస్థాపకుడు కాదని తెలిపింది. తనలాంటి ఒక ప్రైవేటు వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్న పేటీఎం సంస్థను ఎలా వేధించగలడని సక్సేనా ప్రశ్నిస్తున్నారు. తన క్లెయిమ్‌ నిజమని తేలితే, ఐపీఓలో షేర్లు పొందే మదుపర్లు నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ఐపీఓను నిలిపివేయమంటూ ఆయన సెబీని సంప్రదించారు. దీనిపై సెబీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.


భారతీయ రైల్వేతో గోద్రేజ్‌ జట్టు
రైలు కోచ్‌ల అసెంబ్లింగ్‌ ఇక వేగంగా

ముంబయి: భారతీయ రైల్వేలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గోద్రేజ్‌ ప్రకటించింది. తద్వారా ఒక్కో కోచ్‌ అసెంబ్లింగ్‌కు పట్టే సమాయాన్ని సగం చేసి 12 గంటలకు పరిమితం చేయడానికి సహాయం చేస్తామని తెలిపింది. అదే సమయంలో వచ్చే మూడేళ్లలో పారిశ్రామిక యంత్రాల ద్వారా రూ.100 కోట్ల ఆదాయాన్ని పొందడంపై దృష్టి సారించినట్లు వివరించింది. మహారాష్ట్రలోని మరఠ్‌వాటా రైల్‌రోచ్‌ ఫ్యాక్టరీలో కోచ్‌ అసెంబ్లీ ఫాబ్రికేషన్‌ కోసం ఒక యూనివర్సల్‌ కోచ్‌ అసెంబ్లీ స్టేషన్‌ను గోద్రేజ్‌ అండ్‌ బాయ్స్‌ గ్రూప్‌నకు చెందిన గోద్రేజ్‌ టూల్స్‌ డిజైన్‌ చేసి అభివృద్ధి చేస్తుంది. ఈ స్టేషన్‌లో ఒక కోచ్‌ అసెంబ్లింగ్‌కు పట్టే సమయాన్ని 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది.


ప్రయాణికుల వాహనాల టోకు అమ్మకాల్లో 45% వృద్ధి

దిల్లీ: జులైలో ప్రయాణికుల వాహనాల (కార్లు, వినియోగ వాహనాలు, వ్యాన్లు లాంటివి) టోకు అమ్మకాలు ఏడాదిక్రితంతో పోలిస్తే 45 శాతం పెరిగాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) వెల్లడించింది. కొవిడ్‌-19 ఆంక్షలు సడలడం, పండగ సీజనును దృష్టిలో ఉంచుకుని నిల్వలు పెంచుకునేలా డీలర్లను కంపెనీలు సిద్ధం చేయడం ఇందుకు కారణంగా పేర్కొంది. తయారీ కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా (టోకు విక్రయాలు) అయిన మొత్తం ప్రయాణికుల వాహనాల సంఖ్య జులైలో 2,64,442 కు చేరింది. 2020 జులైలో 1,82,779 వాహనాలే సరఫరా అయ్యాయి. ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు 12,81,354 వాహనాల నుంచి 2 శాతం తగ్గి 12,53,937కు పరిమితమయ్యాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని