టీవీల ధరలు పెరగనున్నాయ్‌! - TV prices to go up from April as open-cell panels get costlier in global markets
close

Updated : 11/03/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీల ధరలు పెరగనున్నాయ్‌!

దిల్లీ: కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ నెలలోనే తీసుకోండి. ఏప్రిల్‌ నుంచి ఎల్‌ఈడీ టీవీలు మరింత ప్రియం కానున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా టీవీల ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే ఎల్‌జీ తమ ఉత్పత్తులపై ధరలను పెంచగా.. పానసోనిక్‌, హయర్‌, థామ్సన్‌ వంటి సంస్థలు కూడా ఇదే యోచనలో ఉన్నాయి. 

‘‘గత నెల రోజులుగా ప్యానెల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఏప్రిల్‌ నుంచి టీవీల ధరలు కూడా పెరిగే అవకాశముంది. ప్రస్తుతమున్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తుంటే ధర 5-7 శాతం పెరగొచ్చు’’అని పానసోనిక్‌ ఇండియా - దక్షిణాసియా ప్రెసిడెంట్‌, సీఈవో మనీశ్‌ శర్మ వెల్లడించారు. అటు హయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగాంజా కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ధరల పెంపు మినహా మరో మార్గం లేదని ఆయన అన్నారు. 

టీవీల తయారీలో ఓపెన్‌ సెల్‌ ప్యానెల్‌ అత్యంత ముఖ్యమైన భాగం. మొత్తం టీవీలో ఇదే 60శాతం ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు దాదాపు 35శాతం వరకు పెరిగాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్‌ సెల్‌ ప్యానెల్‌ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటికి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని సూపర్‌ ప్లాస్ట్రోనిక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సీఈవో అవనీత్‌ సింగ్‌ మర్వా వెల్లడించారు. దీంతో ఏప్రిల్‌ నుంచి టీవీల ధరలు కూడా రూ. 2000 నుంచి రూ. 3000 వరకు పెరగొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే 32 అంగుళాల టీవీలు రూ. 5000 నుంచి రూ. 6000 వరకు పెరిగే అవకాశముందని వీడియోటెక్స్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అర్జున్‌ బజాజ్‌ అంటున్నారు. 

ఇప్పటికే దక్షిణకొరియా సంస్థ ఎల్‌జీ గత రెండు నెలల్లో రెండు సార్లు టీవీల ధరలు పెంచేసింది. మరోవైపు ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్లపై ప్రభుత్వం గతేడాది దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించింది. అంతకుముందు ఏడాదిపాటు వీటిపై ఎలాంటి సుంకాలు లేవు. 2020 అక్టోబరు 1 నుంచి వీటిపై 5శాతం దిగుమతి సుంకం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ధరలు మరింత పెరుగుతున్నాయి. కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో అతిపెద్ద మార్కెట్‌ కలిగిన టీవీల తయారీని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కిందకు తీసుకురావాలని ఈ సందర్భంగా తయారీదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పథకం కిందకు వస్తే దేశీయంగా ఓపెన్‌ సెల్స్‌ ప్యానళ్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కలుగుతుందని తద్వారా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తారని వెల్లడించారు. దీంతో అటు దేశీయంగా తయారీ ధరలు తగ్గడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మన టీవీ పరిశ్రమ పోటీపడే అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

పెరిగిన వంటగ్యాస్‌ వినియోగం

ఏమైంది బంగారం.. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని