Tesla: టాటా కార్లు టెస్లా కార్లకు ఏమాత్రం తీసిపోవు: గడ్కరీ - Tata Motor EV Cars are not less good than Tesla cars says Gadkari
close

Published : 08/10/2021 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tesla: టాటా కార్లు టెస్లా కార్లకు ఏమాత్రం తీసిపోవు: గడ్కరీ

దిల్లీ: భారత్‌లో తయారీ చేపట్టాలని ప్రముఖ అంతర్జాతీయ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లాను పలుసార్లు కోరినట్లు కేంద్ర రహదారులు, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తయారీ ప్రారంభిస్తే ప్రభుత్వం తరఫున కావాల్సిన సాయం అందిస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. ‘ఇండియా టుడే కాంక్లేవ్‌-2021’లో మాట్లాడుతూ శుక్రవారం ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

భారత్‌కు చెందిన టాటా మోటార్స్‌ తయారు చేస్తున్న విద్యుత్తు కార్లు టెస్లా కార్లకు ఏమాత్రం తీసిపోవని గడ్కరీ అభిప్రాయపడ్డారు. చైనాలో తయారైన కార్లను భారత్‌లో విక్రయించొద్దని టెస్లాకు చెప్పామన్నారు. భారత్‌లో తయారు చేసి.. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలని సూచించామన్నారు. అందుకు కావాల్సిన సాయం ప్రభుత్వం అందిస్తుందని చెప్పామన్నారు. విద్యుత్తు కార్లపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని టెస్లా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ముందు భారత్‌లో తయారీ ప్రారంభించాలని.. ఆ తర్వాతే సుంకాల తగ్గింపు విషయాన్ని పరిశీలిస్తామని టెస్లాకు గడ్కరీ గత నెల తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఏ కంపెనీకీ ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని గడ్కరీ తెలిపారు. టెస్లాకు మాత్రమే మినహాయింపులు ఇవ్వడం వల్ల తప్పుడు సందేశం వెళుతుందని వివరించారు. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌.. భారత్‌లో కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు టెస్లాకు చెందిన కొన్ని మోడళ్లు భారత్‌లో నడపడానికి అనువైనవిగా కేంద్రం ఇటీవలే ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

పూర్తిస్థాయిలో విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం 60-100 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. ఇంజిన్‌ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుపుకొని రూ.40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తిస్తుంది. అయితే, దీన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరింది. అలాగే, విద్యుత్తు కార్లపై 10 శాతం సమాజ సంక్షేమ సర్‌ఛార్జిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనివల్ల విద్యుత్తు వాహనాల విక్రయానికి భారత్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. అనంతరం కార్ల విక్రయాలు, సేవలు, ఛార్జింగ్‌ మౌలిక వసతుల రంగాల్లో టెస్లా నేరుగా పెట్టుబడులు పెడుతుందని పేర్కొంది. అలాగే భారత్‌ నుంచి ముడిసరకు కొనుగోలును కూడా పెంచుతామని తెలిపింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని