ఏ పెట్టుబ‌డుల‌పై ఎంత ప‌న్ను మినహాయింపు పొందొచ్చు? - Tax-deductions-under-7-schemes-section-80C
close

Published : 25/12/2020 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏ పెట్టుబ‌డుల‌పై ఎంత ప‌న్ను మినహాయింపు పొందొచ్చు?

పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఎన్ఎస్‌సీ, పీఎఫ్‌, ఈఎల్‌సీసీ, బీమా ప‌థ‌కాలు వంటి వాటిపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల ద్వారా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డ‌మే కాక త‌క్ష‌ణ రాబ‌డిని పొంద‌వ‌చ్చు. ప్ర‌భుత్వం సెక్ష‌న్‌ 80సీ, మ‌రికొన్ని ఇత‌ర చ‌ట్టాల ద్వారా ప‌న్ను మిన‌హాయింపు క‌ల్పిస్తూ, దీర్ఘ‌కాల‌పు పెట్టుబ‌డులను ప్రోత్స‌హిస్తుంది. ప్ర‌జ‌లు త‌మ‌ పెట్టుబ‌డుల‌పై త‌క్ష‌ణ‌ రాబ‌డిని, ప‌న్ను మిన‌హాయింపు రూపంలో పొంద‌డాన‌కి ఇవి స‌హాయ‌ప‌డుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కి ఒక వ్య‌క్తి 5 శాతం ప‌న్ను ప‌రిదిలో ఉన్నాడ‌నుకుందాం. అత‌డు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ వర్తించే ప‌థ‌కాల‌లో రూ.1,50,000 పెట్టుబ‌డి పెడితే 10 శాతం ప‌న్నుమిన‌హాయింపు వ‌ర్తించి రూ. 7,500 వ‌ర‌కు త‌క్ష‌ణ రాబ‌డి వ‌స్తుంది. అదే పెట్టుబ‌డి 20 శాతం ప‌రిధిలో ఉన్న వ్య‌క్తి పెడితే 20 శాతం రాబ‌డి, 30 శాతం ప‌రిధిలో వ్య‌క్తి పెడితే 30 శాతం రాబ‌డి పొంద‌వ‌చ్చు.

ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధిలోనికి వ‌చ్చే కొన్ని పెట్టుబ‌డులు
పీపీఎఫ్‌:ప్ర‌జా భ‌విష్య నిధి చాలా సుర‌క్షిత‌మైన, ప‌న్ను ఆదా చేసుకోగ‌ల పెట్ట‌బ‌డుల‌లో ఒక‌టి. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు వుంటుంది. దీని ద్వారా ల‌భించే వ‌డ్డీ పైన కూడా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై ప్ర‌భుత్వ హామీ ఉంది. ఏడాదికి రూ. 1.50 లక్ష వరకు ఇందులో జమ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఇందులో నుంచి లభించే వడ్డీ పై ఎటువంటి పన్ను వర్తించదు. ప్రస్తుతం దీని వడ్డీ రేటు 7.9 శాతం.

ఎన్‌పీఎస్‌:జాతీయ పింఛ‌ను ప‌థ‌కం ముఖ్యంగా వేత‌న జీవుల‌కు భ‌రోసాను అందించ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టింది. డిసెంబ‌ర్ 31,2003 త‌ర్వాత ఉద్యోగంలో చేరిన వారు, అసంఘ‌టిత రంగం ఉద్యోగులు, స్వ‌యం ఉపాది క‌లిగిన‌వారికి ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తుంది. ఎన్‌పీఎస్ మొద‌టగా ప్ర‌భుత్వ‌ రంగం ఉద్యోగుల‌కు మాత్ర‌మే ఏర్పాటు చేసారు. 2009 సంవ‌త్స‌రం నుండి సాధార‌ణ పౌరుల‌కు కూడా అందుబాటులో ఉంచారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు సెక్ష‌న్ 80సీ కింద సూచించిన ప‌రిమితి వ‌ర‌కు ఎన్‌పీఎస్‌లో మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) కింద అద‌నంగా రూ.50,000 వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఎన్‌పీఎస్ ఖాతాలో జ‌మ‌చేసే సొమ్ము మొత్తంలో 25 శాతం దాకా రిటైర్‌మెంట్‌కు ముందు తీసుకోవ‌చ్చు. దీనిపై ఎటువంటి ప‌న్ను ఉండ‌దు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన త‌ర్వాత ఎన్‌పీఎస్ లో జ‌మ‌య్యే నిధిలో 60 శాతం మేర‌కు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. మ‌రో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి.

ఎన్ఎస్‌సీ:పెట్టుబడి పై ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా, పన్ను మినహాయింపుతో ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల అవసరాలను దృష్టిలోఉంచుకుని రూపొందించిన పథ‌కం. చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునేవారి కోసం పోస్టాఫీసులు, అన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, యాక్సిస్‌, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించింది. కచ్చితమైన రాబడి ఆశించేవారికి సురక్షితమైన పెట్టుబడి మార్గం ఇది. ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌తో జాతీయ పొదుపు ప‌త్రాల పథకం అందుబాటులో ఉంది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1.5లక్ష‌ల వరకు చేసే డిపాజిట్లకు సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు లేదు. జాతీయ పొదుపు పత్రాలు పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గంలా ఉపయోగపడతాయి. నెలనెలా క్రమంగా వీటిలో పెట్టుబడి పెడితే మరో ఐదేళ్లకో/ పదేళ్లకో అవి వృద్ధి చెంది నెలనెలా వడ్డీతో సహా పదవీ విరమణ కాలంలో ఆదాయం వస్తుంది.

పీఎఫ్‌:ప్ర‌వేట్ రంగంలో ప్రాథ‌మిక‌ వేత‌నం రూ. 15 వేల కంటే త‌క్కువ ఉన్న ఉద్యోగులకు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం ఉద్యోగ భ‌విష్య నిధి. ప్రాథ‌మిక వేత‌నం రూ. 15 వేల కంటే ఎక్కువ ఉన్న‌వారు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 20 మంది ఉద్యోగులు క‌లిగిన సంస్థ‌ల‌కు, పీఎస్‌యులు కూడా ఈపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఫీఎఫ్ నియ‌మాల ప్ర‌కారం ఉద్యోగి జీతంలో 12 శాతం విలువైన మొత్తాన్ని సంస్థ వాటాతో క‌లిపి పీఎఫ్ కోసం చెల్లించాలి. ఉద్యోగి, సంస్థ వాటాతో క‌లిపి రూ.15,000 లేదా ఉద్యోగి ప్రాథ‌మిక వేత‌నంలో 12 శాతం, రెండింటిలో ఏది త‌క్కువ వుంటే దాని ప్ర‌కారం సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. పీఎఫ్ ఖాతా ఉప‌సంహ‌ర‌ణ కొన్ని ప‌రిమితులకు లోబ‌డి ఉంటుంది.

ఈఎల్ఎస్ఎస్: ఈఎల్ఎస్ఎస్ లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ … ఇదీ ఒక ర‌క‌మైన మ్యూచువ‌ల్ ఫండే. ఇవి ఎక్కువ‌గా ఈక్విటీ ఓరియెంటెడ్ ప‌థ‌కాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. త‌ద్వారా మ‌దుప‌రుల‌కు సంప‌ద‌ను సృష్టిస్తాయి. ఈ ఫండ్ల‌తో అన్నింటికంటే అతి పెద్ద ప్ర‌యోజ‌నం ఏమిటంటే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద గ‌రిష్టంగా రూ.1.5ల‌క్ష‌ల దాకా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.ఐతే వీటిలో పెట్టే పెట్టుబ‌డికి 3ఏళ్ల లాకిన్ పీరియ‌డ్ ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌దుప‌రులు గ‌మ‌నించాలి. ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డి రూ. 1 ల‌క్ష మించి వుంటే 10 శాతం కాపిట‌ల్ గెయిన్ ప‌న్ను చెల్లించాలి.

బీమా ప‌థ‌కాలు: జీవిత బీమా ప‌థ‌కాల‌లో పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వార్షిక ప్ర‌మీయం కంటే క‌నీసం 10 రెట్లు హామీ ల‌భిస్తుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ కింద(రూ. 1.50 లక్ష వరకు) మిన‌హాయింపు ఉంటుంది. వాటి మీద వ‌చ్చే బోన‌స్‌, డెత్ మెచ్యూరిటీ క్ల‌యిమ్‌, మ‌నీ బ్యాక్ మీద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అయితే యాన్యూటీ ప‌థ‌కాల‌పై వ‌చ్చే పెన్ష‌నుకు ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌దు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వారు అందించే బీమా హామీ, బోన‌స్‌ల‌పై ప్ర‌భుత్వ హామీ ఉంది. ఇవి పూర్తి పెట్టుబ‌డి ప‌థ‌కాలు కావు.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న: సుకన్య సమృద్ధి యోజన ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడ పిల్లల తరఫున ఒక చట్టపరమైన సంరక్షకుడు తెరవవచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు వ‌ర‌కు చేయ‌చ్చు. సంవత్సరానికి కనీస డిపాజిట్ రూ. 250, అలాగే గరిష్ట డిపాజిట్ రూ. 1,50,000. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఖాతాను తెరిచిన తేదీ నుంచి గరిష్టంగా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తరవాత ఆమె ఉన్నత చదువుల కోసం లేదా వివాహం కోసం ఖాతాలోని మొత్తం నుంచి 50 శాతం నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా మూడు రకాల పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో పెట్టిన పెట్టుబడిపై పన్ను మినహాయింపు, వడ్డీ రూపంలో సంపాదించిన మొత్తం, ఉపసంహరించిన మొత్తం.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని