బడ్జెట్..రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం! - The Government is committed to the welfare of farmers says Nirmala Sitharaman
close

Published : 01/02/2021 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్..రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పునరుద్ఘాటించారు. కనీస మద్దతుధర ఎప్పటికప్పుడు పెరుగుతుందన్నారు. పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతామని భరోసా ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతబద్ధీకరణ ఉంటుందని చెప్పారు. 

గతంతో పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి  కేటాయింపులు పెరిగాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో గోదుమ రైతులకు రూ.33,874 కోట్లు చెల్లించగా.. 2019-20లో రూ.62,802 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.75,060 కోట్లు చెల్లించామన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ మరింత పెరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్ల వల్ల 2019-20లో 35.57 లక్షల మంది, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 43.36 లక్షల మంది గోదుమ రైతులు లబ్ధి పొందారన్నారు.

వరి రైతుల విషయంలో ఉదారత

వరి సాగు చేస్తున్న రైతుల విషయంలోనూ కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోందన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సంలో వరి రైతులకు రూ.63,928 కోట్లు చెల్లించగా.. 2019-20లో 1,41,930 కోట్లు చెల్లించామన్నారు. రానున్న అర్థిక సంవత్సరంలో దీని విలువను రూ. 1,72,752 కోట్లకు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించిన నిధుల వల్ల లబ్ధి పొందిన వరి రైతుల సంఖ్య  1.24 కోట్ల నుంచి 1.54 కోట్లకు పెరిగిందని నిర్మలమ్మ గుర్తు చేశారు.

పప్పుధాన్యాలపై 40 రెట్లు

పప్పు ధాన్యాలపైనా గతంలో కంటే ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. 2013-14  ఆర్థిక సంవత్సరంలో రూ.236 కోట్లు ఖర్చు చేస్తే 2019-20లో రూ.8,285 కోట్లు, 2020-21లో రూ.10,530 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2013-14తో పోల్చుకుంటే దీని విలువ దాదాపు 40 రెట్లు పెరిగిందని ఆమె వివరించారు. పత్తి రైతులకు కూడా సరైన ప్రోత్సాహకాలు అందించామని, వీరికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 90 కోట్లు చెల్లిస్తే.. 27జనవరి 2021 వరకు రూ.25,974 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సర్వే ఆఫ్‌ విలేజెస్‌, మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్‌డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌ (స్వామిత్వ) పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,241 గ్రామాల్లోని 1.80 లక్షల మంది యజమానులు భూ హక్కు కార్డులను పొందారని, రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు.

16.5 లక్షల కోట్లు రుణాలిస్తాం

రైతులకు సరైన సమయంలో రుణాలు అందించేందుకు అవసరమైన చర్యలను కేంద్రం చేపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ 16.5 లక్షల కోట్లు రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధిని కూడా రూ.30 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచినట్లు ఆమె వివరించారు. నాబార్డ్‌ కింద విడుదలవుతున్న రూ.5000 కోట్ల మైక్రో ఇరిగేషన్‌ నిధులను రూ.10,000 కోట్లకు పెంచుతున్నట్లు వివరించారు. వ్యవసాయ మార్కెట్‌లోకి ఈనామ్‌ తీసుకొచ్చిన పారదర్శకతను దృష్టిలో ఉంచుకొని 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం చేస్తామన్నారు. తేయాకు తోటల కార్మికుల కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి

రైతన్నల ఆదాయం పెంపే మా లక్ష్యం: మోదీ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని