10% వార్షిక వృద్ధితో నిఫ్టీ రాణిస్తుంది - The Nifty excels with an annual growth of 10 percent
close

Published : 08/01/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10% వార్షిక వృద్ధితో నిఫ్టీ రాణిస్తుంది

షేర్ల విలువలు సరైన స్థాయిలోనే ఉన్నాయ్‌
రాబోయే మూడేళ్లపై ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌

దిల్లీ: రాబోయే మూడేళ్లలో ఎన్‌ఎస్‌ఈ ప్రామాణిక సూచీ నిఫ్టీ 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో రాణించే అవకాశం ఉందని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఏబీఎస్‌ఎల్‌ఎమ్‌ఎఫ్‌) పేర్కొంది. ప్రస్తుతం షేర్ల విలువలు తగు స్థాయుల్లోనే ఉన్నాయని అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి అనంతరం 2020 మార్చిలో నిఫ్టీ ఏళ్ల కనిష్ఠానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఆ నెలలోని కనిష్ఠ స్థాయి నుంచి ఇప్పటికే 80 శాతానికి పైగా సూచీ పెరగడం గమనార్హం. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రదర్శనతో సంబంధం లేకుండా సూచీ ఈ స్థాయిలో పెరగడంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం క్షీణించవచ్చని అంచనాలు వ్యక్తమవుతుండటాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘ఈక్విటీ మార్కెట్‌ అసాధారణ రీతిలో పెరిగినట్లు కొంత మంది భావిస్తున్నారు. వాస్తవానికి కంపెనీల ఆదాయాలపై తాత్కాలికంగానే ప్రభావం పడిందనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందువల్ల విలువపరంగా సరైన స్థాయిల్లోనే షేర్లు ఉన్నాయ’ని ఏబీఎస్‌ఎల్‌ఎమ్‌ఎఫ్‌ కో-చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధికారి మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌ కొత్త చక్రీయ గమనానికి ప్రారంభం దశలో ఉందని, ఈ సమయంలో కంపెనీల ఆర్జన సామర్థ్యాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు మార్కెట్‌ రాణించడంలో విదేశీ సంస్థాగత మదుపర్లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. కొత్త సంవత్సరంలోనూ వీళ్ల పెట్టుబడులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్వల్పకాలంలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ.. 10 శాతానికి మించి మార్కెట్‌ దిద్దుబాటు అయ్యే అవకాశాలు లేవని ఆయన అంచనా వేశారు. వ్యాక్సిన్‌ రాక వార్తలతో, కరోనా రెండో దశ వ్యాప్తి భయాలు పక్కకు పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2020-21లో దేశ వృద్ధి రేటు 5 శాతమే క్షీణించవచ్చనేది తమ అంచనాగా తెలిపారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని