జీవనకాల గరిష్ఠానికి ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో రిటైల్‌ మదుపర్ల వాటా - The share of retail investors in NSE companies for a lifetime high
close

Published : 10/08/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవనకాల గరిష్ఠానికి ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో రిటైల్‌ మదుపర్ల వాటా

జూన్‌ త్రైమాసికంపై ప్రైమ్‌ డేటాబేస్‌ నివేదిక

దిల్లీ: జూన్‌ త్రైమాసికంలో ఎన్‌ఎస్‌ఈలో నమోదైన కంపెనీల్లో రిటైల్‌ మదుపర్ల వాటా జీవనకాల గరిష్ఠానికి చేరింది. సెకండరీ మార్కెట్‌ దుమ్మురేపడం, వరుస ఐపీఓలు ఇందుకు కారణమని ప్రైమ్‌ డేటాబేస్‌ గ్రూప్‌ తమ నివేదికలో పేర్కొంది. ప్రైమ్‌ఇన్ఫోబేస్‌ డాట్‌కామ్‌ ప్రకారం..  ఎన్‌ఎస్‌ఈ నమోదిత కంపెనీల్లో రిటైల్‌ మదుపర్ల (రూ.2 లక్షల వరకు షేర్‌హోల్డింగ్‌ కలిగిన వ్యక్తులు) పెట్టుబడులు 7.18 శాతానికి చేరాయి. మార్చి త్రైమాసికంలో ఇది 6.96 శాతంగా ఉంది. విలువ పరంగా చూస్తే.. మార్చిలో రూ.13.94 లక్షల కోట్లుగా ఉన్న రిటైల్‌ మదుపర్ల పెట్టుబడులు, జూన్‌ త్రైమాసికానికి 16 శాతం పెరిగి రూ.16.18 లక్షల కోట్లకు చేరింది. ఈ సమయంలో సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా 6.01 శాతం, 7.02 శాతం చొప్పున రాణించాయి. జూన్‌ నాటికి ఎన్‌ఎస్‌ఈలో నమోదైన 1699 కంపెనీల్లో 1666 దాఖలు చేసిన షేర్‌హోల్డింగ్‌ వివరాల ప్రకారం ఈ గణాంకాలను రూపొందించారు. జులై 31కు ఇంకా 33 కంపెనీలు షేర్‌హోల్డింగ్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంది. మరిన్ని వివరాలు ఇలా..

* ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ల వాటా 7.26 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గింది. వరుసగా 24 త్రైమాసికాల వృద్ధి తర్వాత ఫండ్‌ల వాటా తగ్గడం ఇది వరుసగా అయిదో త్రైమాసికం కావడం గమనార్హం. 2014 మార్చి (2.80 శాతం) నుంచి 2020 మార్చి (7.96 శాతం) వరకు ఎంఎఫ్‌ పెట్టుబడులు దూసుకెళ్లాయి.

* 295 కంపెనీల్లో ఎల్‌ఐసీకి 1 శాతానికి పైగా వాటా ఉంది. 2012 జూన్‌లో 5 శాతంగా ఉన్న ఎల్‌ఐసీ వాటా, 2021 మార్చికి 3.83 శాతానికి, 2021 జూన్‌కు 3.74 శాతానికి తగ్గింది. విలువ పరంగా చూస్తే.. మార్చి త్రైమాసికంతో పోలిస్తే జూన్‌ ఆఖరుకు 9.88 శాతం వృద్ధితో రూ.8.43 లక్షల కోట్ల జీవనకాల గరిష్ఠానికి చేరింది.

* విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) షేర్‌హోల్డింగ్‌ 22.46 శాతం నుంచి 21.66 శాతానికి తగ్గింది.


ఆడి ఆర్‌ఎస్‌ 5 స్పోర్ట్‌బ్యాక్‌ జీ రూ.1.04 కోట్లు

దిల్లీ: జర్మనీ విలాసకార్ల సంస్థ ఆడి ఆర్‌ఎస్‌ 5 స్పోర్ట్‌బ్యాక్‌ మోడల్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. పరిచయ ఆఫర్‌ కింద     రూ.1.04 కోట్ల (ఎక్స్‌-షోరూమ్‌) ధరను నిర్ణయించింది. ఇందులో అమర్చిన 2.9 లీటర్‌ వీ6 ట్విన్‌-టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 450 హెచ్‌పీ శక్తిని అందిస్తుంది. పూర్తిగా నిర్మితమైన యూనిట్‌గా భారత్‌కు వీటిని దిగుమతి చేసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆర్‌ఎస్‌ 5 స్పోర్ట్‌బ్యాక్‌ గంటకు 0-100 కి.మీ వేగాన్ని 3.9 సెకన్లలోనే అందుకోగలదని, గరిష్ఠవేగం గంటకు 250 కి.మీ అని వెల్లడించింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని