పీపీఎఫ్ పెట్టుబ‌డులు..మెచ్యూరిటీ పిరియ‌డ్ త‌రువాత కొన‌సాగించ‌వ‌చ్చా?  - Three-Options-for-PPF-account-holders-after-maturity-period
close

Updated : 31/05/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీపీఎఫ్ పెట్టుబ‌డులు..మెచ్యూరిటీ పిరియ‌డ్ త‌రువాత కొన‌సాగించ‌వ‌చ్చా? 

ప్రజా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌) ఖాతా.. దీర్ఘ‌కాలిక రిస్క్ ఫ్రీ పెట్టుబ‌డి మార్గాల‌లో అధిక ప్రాధాన్య‌త, ప్ర‌జాద‌ర‌ణ ఉన్న మార్గంగా చెప్పుకోవ‌చ్చు. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 7.1 శాతం. ప్ర‌భుత్వ మ‌ద్దుతు ఉన్న.. అధిక రాబ‌డిని ఇచ్చే, చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో ఇదీ ఒక‌టి. రిస్క్ తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు.. పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు, పెళ్లిళ్లు వంటి దీర్ఘ‌కాలిక‌ ల‌క్ష్యాల కోసం పొదుపు చేసేవారికి పీపీఎఫ్ ఒక మంచి పెట్టుబ‌డి మార్గం.  అందువ‌ల్ల మెచ్యూరిటీ పిరియ‌డ్ పూర్తైన త‌రువాత ల‌క్ష్యాలు కోసం ఖ‌ర్చు చేసేందుకు ఇంకా స‌మ‌యం ఉంటే.. ఈమొత్తాన్ని పెట్ట‌బ‌డి పెట్టేందుకు ఉన్న మార్గాల‌ను చందాదారులు తెలుసుకోవాలి. 

ఈ ప‌థకంలో గ‌రిష్టంగా సంవ‌త్స‌రానికి రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఖాతా నిర్వ‌హ‌ణ కోసం వార్షికంగా క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.  15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉంటుంది. కాల‌ప‌రిమితి ముగిసిన అనంత‌రం త‌ప్ప‌నిస‌రిగా ఖాతాను మూసివేయాల్సిన ప‌నిలేదు. 5 సంవ‌త్స‌రాల చొప్పున ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. అదేవిధంగా కాల‌ప‌రిమితికంటే ముందే డ‌బ్బు అవ‌స‌రం అయితే ఖాతా తెరిచిన 7వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. అలాగే ఖాతా ప్రారంభించిన మూడ‌వ సంవ‌త్స‌రం నుంచి ఆర‌వ సంవ‌త్స‌రం వ‌ర‌కు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది 

ప‌న్ను, పెట్టుబ‌డి నిపుణులు చెబుతున్న ప్రకారం మెచ్యూరిటీ పూర్తైన త‌రువాత పీపీఎఫ్‌ ఖాతాదారులు ఈ కింది తెలిపిన మూడు విధానాల‌ను అనుస‌రించ‌వ‌చ్చు. 
1. మెచ్యూరిటీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌డం. 
2. పీపీఎఫ్ మొత్తాన్ని ఎటువంటి పెట్టుబ‌డులు లేకుండా కొన‌సాగించ‌డం.
3. పీపీఎఫ్ మొత్తాన్ని పెట్టుబ‌డులు పెడుతూ కొన‌సాగించ‌డం. 
ఖాతాదారుడు జీవించి ఉన్నంత వ‌ర‌కు ఎన్ని సార్లైనా ఖాతాను పొడిగించుకోవ‌చ్చు. 

పీపీఎఫ్ ఖాతా పొడిగింపుపై సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, "15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ పూర్తైన అనంత‌రం కాల‌వ్య‌వ‌ధిని పొడిగించేందుకు, పీపీఎఫ్ ఎక్స్‌టెన్ష‌న్ ఫార‌మ్‌ను నింపి బ్యాంకులో గానీ పోస్టాఫీసులో గానీ.. ఎక్క‌డైతే పీపీఎఫ్ ఖాతా తెరిచారో అక్క‌డ స‌మ‌ర్పించాలి. పీపీఎఫ్ ఖాతా తెరిచిన 15 సంవ‌త్స‌రం ఈ కొన‌సాగింపు ఫారంను చందాదారులు ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబ‌డులు అనుమ‌తిస్తూ కొన‌సాగింపు కోరుకునే వారు మాత్ర‌మే ఎక్స్‌టేన్ష‌న్ పార‌మ్‌ను స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది." 

మెచ్యూరిటీ అనంత‌రం పెట్టుబ‌డులు చేయ‌కుండా ఖాతాను కొన‌సాగించేవారు ఎటువంటి ఫారంని ఇవ్వాల్సిన అవ‌సరం లేదని సోలంకి తెలిపారు. ఇటువంటి వారు పీపీఎఫ్ మొత్తంపై కొన‌సాగింపు కాలంలోనూ వ‌డ్డీ మొత్తాన్ని పొంద‌వ‌చ్చు. పీపీఎఫ్ పెట్ట‌బడుల‌పై 'ఈఈఈ' ప‌న్ను ప్ర‌యోజ‌నం ఉంటుంది. వ‌డ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై 100 శాతం ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని