ఈ మూడు అంశాలు రాబ‌డిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతాయ‌ని మీకు తెలుసా?  - Three-scenarios-when-power-of-compounding-can-hurt-your-investments
close

Updated : 29/01/2021 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ మూడు అంశాలు రాబ‌డిపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతాయ‌ని మీకు తెలుసా? 

 

పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే ఆదాయంపై చ‌క్ర‌వ‌డ్డీ ద్వారా వ‌చ్చే రాబ‌డి గురించి తెలిసే ఉంటుంది. అదే చ‌క్ర‌వ‌డ్డీ మ‌నం చెల్లించాల్సి వ‌స్తే సంపాదించిన డ‌బ్బు మొత్తం ఆవిరైపోతుంది. మ‌రి ఎటువంటి సంద‌ర్భాల్లో మ‌నం తిరిగి చ‌క్ర‌వ‌డ్డీ రూపంలో చెల్లించాలో తెలుసుకుందాం

1. రుణాల‌పై వ‌డ్డీ చెల్లింపులు:
వ‌డ్డీపై చ‌క్ర‌వ‌డ్డీ ల‌భిస్తే రాబ‌డి మ‌రింత పెరుగుతుంది. పెట్టుబ‌డులపై, మీరు ఇప్పటికే సంపాదించిన వడ్డీ ఆదాయాన్ని ఎక్కువ రాబడిని సంపాదించడానికి కొన‌సాగించ‌డం ద్వారా ఈ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు. అయితే రుణాల‌పై వ‌డ్డీ చెల్లిస్తున్న‌ప్పుడు ఇదే సూత్రం మీపై ప్ర‌తికూల‌ ప్ర‌భావం చూపిస్తుంది.

ఈఎమ్ఐ త‌గ్గించుకునేందుకు ఎక్కువ కాల‌ప‌రిమితో రుణాల‌ను తీసుకుంటే ఎక్కువ వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. స‌మ‌యానికి చెల్లింపులు చేయ‌క‌పోతే, ఆ వ‌డ్డీతో పాటు దానిపై కూడా వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. క్రెడిట్ కార్డు రుణాల‌పై లేదా ఈఎమ్ఐ చెల్లించ‌న‌ప్పుడు ఈ విధమైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

చాలామందికి క్రెడిట్ కార్డు బిల్లు స‌మ‌యానికి చెల్లించ‌క‌పోతే ఎక్కువ వ‌డ్డీ ప‌డుతుంద‌ని తెలుసు. కానీ ఈఎమ్ఐల విష‌యానికొస్తే ఎక్కువ కాలం కాల‌ప‌రిమితితో త‌క్కువ చెల్లించేందుకే చూస్తారు. ఎక్కువ వ‌డ్డీ ప‌డుతుంద‌న్న విష‌యం గురించి ఆలోచించరని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వ‌డ్డీ రేటు ఆధారంగా చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. 

2. ద్ర‌వ్యోల్బ‌ణం:
సంపాదించిన డ‌బ్బును ద్ర‌వ్యోల్బ‌ణం ఆవిరి చేస్తుంది. ప్ర‌స్తుతం వెయ్యి రూపాయ‌ల‌కు ఉన్న‌ విలువ భ‌విష్య‌త్తులో ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా త‌గ్గుతుంది. ఇప్పుడు ఒక వెయ్యి రూపాల‌య‌తో కొనుగోలు చేయ‌గలిగే ఒక వ‌స్తువును కొన్ని రోజుల త‌ర్వాత కొనుగోలు చేయ‌లేం. ఎందుకంటే ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా ధ‌ర పెరుగుతుంది. ఒక వ‌స్తువుకు ఇప్పుడు చెల్లించే డ‌బ్బు, 15 ఏళ్ల త‌ర్వాత 5 శాతం ద్ర‌వ్యోల్బ‌ణం ఉంటే 107 శాతం ఎక్కువ‌గా చెల్లించాలి. ద్ర‌వ్యోల్బ‌ణం అదిగ‌మించే ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తే రాబ‌డిని కాపాడుకోవ‌చ్చు.

3. పెట్టుబ‌డి ఖ‌ర్చులు:
కాంపౌండింగ్ మ‌రొక కోణాన్ని పెట్టుబడుల‌పై చేసే అధిక ఖ‌ర్చులు, ఫీజులు లేదా ప‌న్నులు చూపుతాయి.  ఇది రాబ‌డిని త‌గ్గిస్తుంది… ముఖ్యంగా దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల్లో వ్య‌యాలు పెరిగితే రాబ‌డి త‌గ్గుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు పెట్టుబ‌డుల‌పై వార్షిక వ్య‌యం 2 శాతం ఉంటే, 15 సంవ‌త్స‌రాల‌కు వ‌చ్చే కార్ప‌స్‌ 12 శాతం త‌గ్గుతుంది.

మెచ్యూరిటీ స‌మ‌యం వ‌ర‌కు ప‌న్ను వ‌ర్తించ‌ని పెట్టుబ‌డులు మ‌రింత ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటాయి. ఎందుకంటే పెట్టుబ‌డులు మొత్తంపై వ‌చ్చే వ‌డ్డీపై వ‌డ్డీని సంపాదించేందుకు వీలుంటుంది. క్ర‌మానుగ‌తంగా ప‌న్ను డిడ‌క్ట్ చేసే బ్యాంక్ డిపాజిట్లు వంటి పెట్టుబ‌డుల‌లో కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నం ఉండ‌దు కాబ‌ట్టి రాబ‌డి త‌గ్గుతుంది. 

చివ‌ర‌గా…
ఆర్ధిక విష‌యాల‌పై కాంపౌండింగ్ ఏ మేర‌కు ప్ర‌భావం చూపిస్తుంది అనేది స‌మ‌యం నిర్ణ‌యిస్తుంది.  రుణ చెల్లింపుల కోసం ఎంత ఎక్కువ స‌మ‌యం తీసుకుంటే అంత ఎక్కువ‌గా న‌ష్ట‌పోతారు. అందుకే స్వ‌ల్పకాలిక రుణాల‌ను తీసుకొని స‌మ‌యానికి చెల్లించండి ఎక్కువ వ‌డ్డీ భారం ప‌డ‌కుండా ఉండాలంటే ముంద‌స్తు చెల్లింపుల‌ను ప‌రిశీలించండి. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదిగ‌మించే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోండి. ఖ‌ర్చులు, ఫీజులు త‌క్కువ‌గా ఉండి, విత్‌డ్రా స‌మ‌యంలో మాత్ర‌మే ప‌న్ను వ‌ర్తించే విధంగా పెట్టుబ‌డులు ఉండాలి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని