చదువుల ఖర్చులు తట్టుకునేలా.. - To bear the costs of children education
close

Updated : 12/03/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చదువుల ఖర్చులు తట్టుకునేలా..

ఒకప్పటితో పోలిస్తే ప్రపంచం ఇప్పుడు చాలా మారిపోయింది. పాత రోజుల్లో అవకాశాలు పరిమితంగా ఉండేవి. వాటిని అందుకునేందుకు కాస్త కష్టమైనా సాధించేందుకు వీలుండేది. కానీ, ఇప్పుడు పోటీ పెరిగింది. ప్రపంచీకరణ నేపథ్యంలో.. ఎన్నో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. అవకాశాలూ ఇబ్బడిముబ్బడిగానే ఉన్నాయి. ఇప్పుడున్న పిల్లలుగా ఉన్నవారికి ఇవి మరింత పెరిగే వీలుంది. దీనికి తగ్గట్టుగా వారిని సిద్ధం చేయాలంటే.. తల్లిదండ్రులు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే..

కొన్నేళ్ల క్రితం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం చూస్తే.. ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వరకూ చదువులు ఖర్చులు దాదాపు 175శాతం వరకూ పెరిగాయి. అదే సమయంలో వృత్తి, సాంకేతిక విద్య ఖర్చు దాదాపు 96శాతం అధికం అయ్యింది. ఇక ఈ మధ్య కాలంలో చదువుల ఖర్చు ఏ స్థాయిలో పెరిగిందో ఊహించడం కష్టమే. సాధారణంగా మన దేశంలో విద్యా ద్రవ్యోల్బణ 10-12 శాతం వరకూ ఉంటుందని అంచనా. ఇంత అధికంగా కాకున్నా.. కనీసం 6-8 శాతం చొప్పున లెక్క వేసుకున్నా.. ప్రస్తుతం రూ.6లక్షలున్న ఎంబీఏ ఫీజు 15 ఏళ్ల తర్వాత రూ.15లక్షలకు చేరొచ్చు. రూ.10లక్షలున్న ఇంజినీరింగ్‌ ఫీజు 15 ఏళ్ల అనంతరం రూ.30లక్షల వరకూ అయ్యే ఆస్కారం ఉంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచం అంతా ఇదే రీతిలో ఉంది. కాబట్టి, తల్లిదండ్రులుగా మనం ఈ విషయాన్ని గమనిస్తూ.. పిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి.
త్వరగా ప్రారంభించాలి..
జీవితంలో ఎలాంటి ఆర్థిక లక్ష్యం అయినా ఉండనీయండి.. దాన్ని తొందరగా గుర్తించి.. అవసరమైన పెట్టుబడులను సాధ్యమైనంత వెంటనే ప్రారంభించాలి. అప్పుడే భవిష్యత్తుకు భద్రత ఏర్పడుతుంది. పిల్లల చదువుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. పిల్లలు తమ లక్ష్యాలను మాత్రమే చెబుతారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సింది తల్లిదండ్రులే కదా.. వారు అనుకుంటున్న విద్యను పూర్తి చేసేందుకు ఎంతమొత్తం కావాలనేది ఒక లెక్క వేసుకోండి. ప్రస్తుతం ఉన్న ఖర్చు.. దానికి ద్రవ్యోల్బణాన్ని జత చేసి, సరైన మొత్తాన్ని గణించండి. ఆ తర్వాత దీని గురించి మదుపు చేయడం ప్రారంభించండి. చాలామంది చేసే పొరపాటేమిటంటే.. పిల్లలు పదో తరగతి పూర్తయ్యే వరకూ.. ఉన్నత చదువులకు సంబంధించిన ప్రణాళిక వేసుకోరు. దీనివల్ల కాలేజీలో చేర్పించేటప్పుడు సమయానికి తగిన మొత్తం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి కోసం కొంత మొత్తాన్ని పెట్టుబడులుగా మార్చాలి. దీర్ఘకాలంలో అవి మంచి రాబడినివ్వడంతోపాటు, అవసరమైన సందర్భంలో ఆదుకుంటాయి.

ప్రభుత్వ హామీతో..

మీకు అమ్మాయి ఉండి, తను పదేళ్లలోపు ఉంటే.. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎంచుకోండి. పెట్టుబడి విషయంలో ఎంతో అనుకూలంగా ఉండటంతోపాటు, ప్రభుత్వ హామీ ఉండటం ఈ పథకం ప్రత్యేకత. కేవలం రూ.250తోనూ ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రూ.50 గుణిజాల్లో జమ చేస్తూ వెళ్లవచ్చు. మీ ఖాతా రద్దు కాకుండా ఉండేందుకు ఏడాదికి రూ.250 జమ చేస్తే చాలు. ఇందులో ఉన్న మరో ప్రత్యేకతేమిటంటే.. మీ అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేవరకూ ఇందులో నుంచి సొమ్ము వెనక్కి తీసుకునే వీలుండదు. దీనివల్ల ఈ ఖాతాలో జమైన డబ్బును ఎప్పటికప్పుడు వెనక్కి తీసుకోవాలనే ఆలోచన రాదు. అమ్మాయి వయసు 21 ఏళ్లకు చేరేదాకా ఈ పథకంలో మదుపు చేయొచ్చు. ఖాతాను ప్రారంభించిన 5 ఏళ్ల తర్వాత కొన్ని ప్రత్యేక అత్యవసర  పరిస్థితుల్లో మాత్రమే పాక్షికంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. దీనికి వడ్డీ రేటు సాధారణంగా పీపీఎఫ్‌ కన్నా కాస్త ఎక్కువే ఉంటుంది. వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్నూ ఉండదు. సుకన్య సమృద్ధి యోజనలో జమ చేసిన మొత్తానికి సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపూ లభిస్తుంది.

బీమా మర్చిపోవద్దు..

పిల్లల చదువులు పూర్తయ్యేలోపు దురదృష్టవశాత్తూ తల్లిదండ్రులకు ఏదైనా జరిగితే.... చిన్నారుల భవిష్యత్తుకు చిక్కులు రావచ్చు. కొన్నిసార్లు వారు అనుకున్న లక్ష్యానికి భిన్నంగా చదువులు కొనసాగించాల్సి వస్తుంది. పిల్లలు ఆర్థికంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటారు. కాబట్టి, వారికి భవితకు తగిన ఆర్థిక భరోసా కల్పించాలి. ఆర్జించే కుటుంబ పెద్ద తన వార్షికాదాయానికి కనీసం 15 రెట్ల వరకూ జీవిత బీమాను తీసుకోవాలి. కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చినప్పుడు.. ఆదాయం పెరిగినా.. ఈ బీమా అవసరాలను ఒకసారి సమీక్షించుకోవాలి.

విదేశాలకు పంపించాలంటే..
అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభ్యాసం ఇప్పుడు సాధారణ అంశం అయ్యింది. ఎంతోమందికి ఈ కోరిక ఉంటుంది. మరో 10-15 ఏళ్ల తర్వాత విదేశాలకు వెళ్తారనుకుంటే.. ఇప్పుడే దానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉదాహరణకు విదేశాల్లో చదువుకునేందుకు ఇప్పుడు రూ.20లక్షలు అవుతాయనుకుంటే.. 15 ఏళ్ల తర్వాత దీనికి రూ.50లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంచనా.
దీని కోసం మీరు డైవర్సిఫైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లను ఎంచుకోవాలి. పెట్టుబడి కొంత మేరకు సురక్షితంగా.. మరికొంత అధిక లాభాలను సంపాదించే పథకాలకు మళ్లించాలి. నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్లు, హామీతో కూడిన బీమా పాలసీలను ఇందుకు పరిశీలించవచ్చు. దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించినప్పుడే ఆర్థిక లక్ష్యానికి తగిన మొత్తాన్ని జమ చేసేందుకు వీలవుతుందని మర్చిపోవద్దు.
పొదుపు పాఠాలు నేర్పండి..
పిల్లలకు డబ్బు విలువను, దాన్ని పొదుపు, మదుపు చేయాల్సిన అవసరాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అప్పుడే, ఒక దశకు వచ్చిన తర్వాత వారు సొంతంగా డబ్బును సమర్థంగా నిర్వహించగలరు. నెలకు నిర్ణీత మొత్తం ఇచ్చి, దాన్ని సరిగ్గా బడ్జెట్‌ వేసుకొని, ఖర్చులు చేసుకునేలా ప్రోత్సహించాలి. ఆదాయపు పన్ను గురించీ పరిచయం చేయాలి. ఉద్యోగంలో చేరి, సంపాదిస్తూ..  మీకు దూరంగా ఉన్నప్పటికీ.. మీరు నేర్పించిన ఈ మంచి అలవాట్లు వారిని ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయి.

- అనుప్‌ సేథ్, చీఫ్‌ రిటైల్‌ ఆఫీసర్, ఎడెల్‌వీస్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌,


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని