పంట ధరపై బెంగ నివారించే ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ - Trading options to avoid anxiety over crop prices
close

Updated : 03/06/2021 05:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంట ధరపై బెంగ నివారించే ఆప్షన్స్‌ ట్రేడింగ్‌

 అవగాహన పెంచుకుంటున్న రైతులు: సెబీ

దిల్లీ: విత్తనాలు వేసే సమయంలోనే పంట ధరను నిర్ణయించుకునేందుకు అవకాశం కలుగుతున్న ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ ప్రయోజనాలను రైతులు తెలుసుకుంటున్నారని సెబీ అధికారులు చెబుతున్నారు.  ధరపై భరోసాగా ఉంటూ, పంట దిగుబడిని పెంచుకునేందుకు మరింతగా శ్రద్ధ పెట్ట గలుగుతున్నారని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో డెరివేటివ్‌ ట్రేడింగ్‌ మరింతగా పెరిగేందుకు ఈ పరిణామాలు ఉపకరిస్తాయని తెలిపారు. ఇతర కమొడిటీల్లోనూ ఇదే తరహా కాంట్రాక్టుల్లో వాళ్లు ట్రేడ్‌ చేయగలిగే విశ్వాసం వస్తుందని వెల్లడించారు. 2020 నవంబరులో ఎన్‌సీడీఈఎక్స్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్‌సీడీఈఎక్స్‌ సభ్యుల వద్ద క్లయింట్లుగా నమోదైన ఎఫ్‌పీఓలు (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌) రెండు కమొడిటీల్లో (శెనగలు, ఆవాలు) పుట్‌ ఆప్షన్స్‌ కొనుగోలు చేసేందుకు అర్హత ఉంటుంది. ధరను లాక్‌ఇన్‌ కూడా చేసుకోవచ్చు. తద్వారా పంట ధర క్షీణత ముప్పును పరిమితం చేసుకోవచ్చు. సుమారు 40 ఎఫ్‌పీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. 1030 మెట్రిక్‌ టన్నుల శెనగలు, 1,980 మెట్రిక్‌ టన్నుల ఆవాల విక్రయానికి సంబంధించి రైతుల తరపున పంట ధరను లాక్‌-ఇన్‌ చేసుకున్నారని ఆ అధికారి వెల్లడించారు. పుట్‌ ఆప్షన్స్‌ ప్రీమియం కొనుగోలుకు వెచ్చించిన సుమారు రూ.80 లక్షలను ఈ  కార్యక్రమం కింద రైతులకు రాయితీగా ఇచ్చారని తెలిపారు.  
మదర్‌సన్‌ సుమీ లాభం ఎనిమిదింతలు
దిల్లీ: జనవరి- మార్చిలో వాహన విడిభాగాల సంస్థ మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,018.69 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.135.66 కోట్ల లాభంతో పోలిస్తే ఇది దాదాపు ఎనిమిదింతలు అధికం కావడం గమనార్హం. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.14,434.48 కోట్ల నుంచి రూ.16,971.91 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో ఆదాయాలు కొవిడ్‌ మునుపటి స్థాయుల కంటే అధికంగా నమోదయ్యాయని, చిప్‌ కొరత, అధిక కమొడిటీ ధరలు వంటి ప్రతికూలతలున్నా, అంతర్జాతీయ పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత నికర లాభం రూ.1,294.44 కోట్ల నుంచి రూ.1,569.37 కోట్లకు పెరిగింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.60,728.99 కోట్ల నుంచి రూ.57,369.91 కోట్లకు పరిమితమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖవిలువ కలిగిన ప్రతిషేరుపై రూ.1.50 (150 శాతం) డివిడెండును కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని