చైనా సహనానికి బైడెన్‌ ‘తొలి పరీక్ష’..! - US sanctions Chinese computer makers in widening tech fight
close

Updated : 09/04/2021 12:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా సహనానికి బైడెన్‌ ‘తొలి పరీక్ష’..!

అమెరికా బ్లాక్‌లిస్ట్‌లోకి మరో ఏడు సంస్థలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ దిగిపోతుంటే చైనా ఆనందానికి హద్దేలేకుండా పోయింది.. ఆ దేశ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వెక్కిరిస్తూ కథనాలు రాసింది.. బైడెన్‌ రావడంతోనే ‘హ్యాపీడేస్‌’ వస్తాయని ఆశించింది.. కానీ, ట్రంప్‌ చైనాపై పెంచిన వాణిజ్య ఒత్తిడిని తొలగించే ప్రయత్నం బైడెన్‌ ఏమాత్రం చేయడంలేదు. పైగా దానిని మెల్లగా పెంచే యత్నం చేస్తున్నారు.

తాజాగా బైడన్‌ కార్యవర్గం మరో ఏడు సంస్థలను ‘బ్లాక్‌లిస్ట్‌’లోకి నెట్టింది. చైనా సైన్యానికి ఆ సంస్థలు సాయం చేయడమే కారణమని పేర్కొంది. చైనా సంస్థలు అమెరికా టెక్నాలజీ పొందకుండా బైడెన్‌ ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి. వీటిల్లో మూడు సంస్థలతోపాటు నాలుగు చైనా నేషనల్‌ కంప్యూటర్‌ సెంటర్‌కు చెందిన మూడు బ్రాంచీలు ఉన్నాయి.

ఈ ఆంక్షల దెబ్బకు ఆయా సంస్థలకు అమెరికా నుంచి ఎటువంటి సాంకేతికత అయినా వెళ్లాలంటే కఠినమైన అనుమతుల ప్రక్రియను దాటాల్సి ఉంది. దీనిపై అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పందిస్తూ.. ఆయా సంస్థలు చైనా సైన్యం సామూహిక విధ్వంస ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సూపర్‌ కంప్యూటర్లను సమకూరుస్తున్నాయి’’ అని పేర్కొంది. అమెరికా వాణిజ్య విభాగ కార్యదర్శి జినా రెయిమాండో మాట్లాడుతూ ‘ అమెరికా టెక్నాలజీని వాడుకొని సైన్యాన్ని ఆదునీకరించాలన్న చైనా వ్యూహాన్ని సర్వశక్తులు ఒడ్డి అస్థిరపరుస్తాము’’ అని పేర్కొన్నారు.

ప్రభావం ఇలా..

బైడెన్‌ చర్యతో ఈ కంపెనీలు మొత్తం అమెరికా టెక్నాలజీ పొందడానికి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఇంటెల్‌ వంటి సంస్థలు తయారు చేసే చిప్‌లు కూడా ఉన్నాయి. ఈ సంస్థలకు అమెరికాలోని కంపెనీలు ఎటువంటి వస్తువులు, సర్వీస్‌ను అందజేయవు. అమెరికా బయట నిర్మించిన కర్మాగారాల నుంచి మాత్రం కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంది. టీఎస్‌ఎంసీ నుంచి చైనా కొనుగోలు చేసుకొనే అవకాశం సజీవంగా ఉంది.

సూపర్‌ కంప్యూటర్‌ ఏమిటీ..?

సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే సూపర్‌ కంప్యూటర్‌ కొన్ని వేల రెట్లు శక్తిమంతమైంది. ఇది క్షణకాలంలో వందల కోట్ల లెక్కలను పరిష్కరించగలదు. కొన్ని వేల ప్రాసెసర్లను అనుసంధానించి తయారు చేస్తారు. ఇది వాతవరణం పరిశోధనలకు, అణుపరీక్షల నకళ్లను కృత్రిమంగా కంప్యూటర్లలో సృష్టించడం, ఔషధాల పరిశోధనలకు వాడుతుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అత్యాధునిక ఆయుధాలు, జాతీయ భద్రతా వ్యవస్థల తయారీలో సూపర్‌ కంప్యూటర్లు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. న్యూక్లియర్‌, హైపర్‌సానిక్‌ ఆయుధాలు కూడా చేయవచ్చు.  ఇలాంటి వాటిని వాడుకొని చైనా ఆయుధాలను తయారు చేస్తోంది. దీంతో ఆయుధ శక్తిలో అమెరికా, చైనా మధ్య ఉన్న అంతరం గణనీయంగా తగ్గిపోయింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని