భారత్‌పై అమెరికా అనవసర ప్రతీకారం! - USTR proposes retaliatory trade actions against India
close

Published : 27/03/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌పై అమెరికా అనవసర ప్రతీకారం!

దిల్లీ/వాషింగ్టన్‌: భారత్‌లో డిజిటల్‌ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలపై ప్రభుత్వం విధిస్తున్న ‘ఈక్వలైజేషన్‌ లెవీ’కి ప్రతీకారంగా వాణిజ్యపరమైన చర్యలు తీసుకునే దిశగా అమెరికా సాగుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం.. దీనిపై తమ అభిప్రాయాలు తెలపాలంటూ ప్రజలను కోరింది. భారత్‌తో పాటు టర్కీ, ఇటలీ, యూకే, స్పెయిన్‌, ఆస్ట్రియాపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

దీనిపై ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కేథరీన్‌ టాయ్ మాట్లాడుతూ.. తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలతో డిజిటల్‌ పన్నుల అంశంపై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, అంతర్జాతీయంగా దీనికి ఓ పరిష్కారం కనుక్కునే వరకు సెక్షన్‌ 301 ప్రకారం తమకు ఉన్న ప్రత్యామ్నాయాలను వినియోగించుకుంటామని తెలిపారు. భారత్‌ విధిస్తున్న ‘ఈక్వలైజేషన్‌ లెవీ’కి ప్రతీకారంగా ఇక్కడి నుంచి వెళ్లే సీ ఫుడ్‌, వెదురు ఉత్పత్తులు, విలువైన రత్నాలు, ఫర్నిచర్‌, కోర్క్‌, సిగరెట్‌ పేపర్లపై అదనపు ‘యాడ్‌ వాలరెమ్‌ టారిఫ్‌’(వస్తువు విలువ ఆధారంగా విధించే కచ్చితమైన దిగుమతి సుంకం) విధించనున్నట్లు సమాచారం. ఈక్వలైజేషన్‌ లెవీ కింద భారత్‌ ఎంతైతే వసూలు చేస్తుందో అమెరికా కూడా అదే స్థాయిలో అదనపు సుంకాల కింద రాబట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భారత్‌ ఏడాదికి 55 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.    

భారత్‌లో డిజిటల్‌ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలు వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆర్జిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు ఏడాదికి లక్ష రూపాయల విలువ దాటి ఇచ్చే వాణిజ్య ప్రకటనలపై భారత ప్రభుత్వం 2016-17లో ‘ఈక్వలైజేషన్‌ లెవీ’ పేరిట పన్ను విధించింది. ఆయా సంస్థలకు ఇచ్చే వాణిజ్య ప్రకటనల విలువపై ఆరు శాతం పన్ను తగ్గించి వినియోగదారుడే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ-కామర్స్‌’ సంస్థలు భారత్‌లో వేళ్లూనుకుని చిరు వ్యాపారుల వాటాను లాక్కోవడంతో దేశీయ వర్తకుల నుంచి వచ్చే పన్నులు తగ్గాయి. దీంతో ప్రభుత్వం ‘ఈ-కామర్స్‌’ వ్యాపార విలువ ఆధారంగా పన్ను విధించింది. రెండు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసే సంస్థలపై ఏప్రిల్‌ నుంచి రెండు శాతం పన్ను వేసింది. దీన్ని అమెరికా వివక్షాపూరితమైన వాణిజ్య ప్రక్రియలుగా అభివర్ణించింది. ఇలా డిజిటల్‌ పన్ను విధిస్తున్న దేశాలపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు భారత్‌ విధిస్తున్న ఈక్వలైజేషన్‌ పన్ను వివక్షాపూరితమైందేనని తేల్చింది. దీన్ని భారత్‌ కొట్టిపారేసింది. నిబంధనలకు అనుగుణంగానే పన్ను వసూలు చేస్తున్నామని స్పష్టం చేసింది. అయినా అమెరికా మొండిగా ముందుకు వెళుతుండడం గమనార్హం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని