పేటీఎం యాప్‌లో టీకా బుకింగ్‌ - Vaccine booking in the Paytm app
close

Updated : 15/06/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేటీఎం యాప్‌లో టీకా బుకింగ్‌

దిల్లీ: పేటీఎం యాప్‌లో కొవిడ్‌ టీకా అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ‘పేటీఎం వినియోగదార్లు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల కోసం తమకు దగ్గర్లోని కేంద్రాల్లో సమయం బుక్‌ చేసుకునేందుకు యాప్‌ తోడ్పడుతుంద’ని పేటీఎం వెల్లడించింది. టీకా బుకింగ్‌లు ఆఫర్‌ చేసేందుకు పేటీఎం, మేక్‌మైట్రిప్‌, ఇన్ఫోసిస్‌ వంటి 12 సంస్థలు అనుమతులు కోరుతున్నాయని ఇటీవల కొవిన్‌ అధిపతి ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే. కొవిన్‌ యాప్‌ను థర్డ్‌-పార్టీ అప్లికేషన్స్‌తో సమ్మిళితం చేయడానికి గత నెలలో ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలు, హెల్తిఫైమి వంటి అంకురాలు ‘టీకాకు ఎక్కడ అవకాశం ఉందో తెలుసుకునే’ సదుపాయాన్ని కల్పించాయి. అండర్‌45, గెట్‌జాబ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లు అయితే ‘టీకా స్లాట్‌’ ఓపెన్‌ కాగానే తమ వినియోగదార్లకు అలర్ట్‌ పంపించి కొవిన్‌ యాప్‌లో అపాయింట్‌మెంట్‌ తీసుకునేలా చేస్తున్నాయి.
 

ఐఓబీ నికరలాభం రూ.350 కోట్లు

దిల్లీ: ప్రభుత్వరంగ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) మార్చి త్రైమాసికంలో రూ.349.77 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో సంస్థ ఆర్జించిన రూ.143.79 కోట్ల లాభంతో పోలిస్తే, ఇది రెట్టింపుకంటే అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.5484.06 కోట్ల నుంచి రూ.6073.80 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 14.78 శాతం (రూ.19912.70 కోట్ల) నుంచి 11.69 శాతానికి (రూ.16323.18 కోట్లు), నికర ఎన్‌పీఏలు 5.44 శాతం (6602.80 కోట్ల) నుంచి 3.58 శాతానికి (రూ.4577.59 కోట్లు) మెరుగు పడ్డాయి. అయితే ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ.1060.38 కోట్ల నుంచి రూ.1380.46 కోట్లకు పెంచింది. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ నికరలాభం రూ.831.47 కోట్లకు చేరింది. 2019-20లో బ్యాంక్‌ రూ.8527.40 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.20712.48 కోట్ల నుంచి రూ.22524.55 కోట్లకు పెరిగింది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌/రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.125 కోట్లు, బాండ్ల జారీ ద్వారా రూ.1000 కోట్ల వరకు సమీకరించేందుకు బోర్డు అంగీకారం తెలిపింది.
* బీఎస్‌ఈలో షేరు 2.18 శాతం లాభంతో రూ.21.10 వద్ద స్థిరపడింది.


పారదర్శకతే లక్ష్యంగా డీలిస్టింగ్‌ నిబంధనల్లో మార్పులు: సెబీ

దిల్లీ: స్టాక్‌ మార్కెట్ల నుంచి కంపెనీల డీలిస్టింగ్‌ ప్రక్రియలో పారదర్శకత, సమర్థత పెంచేందుకే నిబంధనల్లో మార్పులు చేసినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. డీలిస్టింగ్‌ ప్రతిపాదనపై స్వతంత్ర డైరెక్టర్లు సహేతుక సిఫారసు చేయాల్సి ఉంటుందని, ప్రమోటర్లు సంస్థను డీలిస్టింగ్‌ చేసే ఉద్దేశాన్ని తొలి బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయాల్సి ఉంటుందని సెబీ పేర్కొంది. డీలిస్టింగ్‌ ప్రక్రియలో వివిధ కార్యకలాపాలను పూర్తి చేయడానికి సమయపాలనను ప్రవేశపెట్టారు. ఫ్లోర్‌ ధర కంటే తక్కువ కాకుండా డీలిస్టింగ్‌ ఇండికేటివ్‌ ధరను ప్రమోటర్‌ లేదా కొనుగోలు సంస్థ ప్రతిపాదించేలా నిబంధన సవరించారు. ప్రమోటర్ల సత్తా, అటువంటి ధర చెల్లించడానికి వారి సుముఖతను మదుపర్లు అంచనా వేయడానికి ఇది సహాయపడుతుంది. రివర్స్‌ బుక్‌ బిల్డింగ్‌ విధానంలో గుర్తించిన ధర, ఫ్లోర్‌ ధర లేదా ఇండికేటివ్‌ ధరకు సమానంగా ఉంటే దాన్ని ప్రమోటర్‌ అంగీకరించాల్సి ఉంటుంది. డీలిస్టింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న మర్చంట్‌ బ్యాంకర్‌ పాత్రను కూడా విశదీకరించారు. చివరి బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు) లేదా ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు పూర్తయిన 6 నెలల వరకు తిరిగి కొనుగోలు, ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా వాలంటరీ డీలిస్టింగ్‌కు అనుమతించరు. విజయవంతమైన డీలిస్టింగ్‌ ప్రక్రియలో కొనుగోలుదారు 90 శాతం వాటా మూలధనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డీలిస్టింగ్‌ తరవాత తిరిగి లిస్టింగ్‌ చేసేందుకు గతంలో ఉన్న గడువు 5 ఏళ్లను 3 ఏళ్లకు తగ్గించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని