వాహన ధరలు మరోసారి పెంపు? - Vehicle prices to rise again
close

Published : 28/07/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాహన ధరలు మరోసారి పెంపు?

ముడి పదార్థాల వ్యయాల భారం వల్లే

దిల్లీ: ఇటీవలి నెలల్లోనే రెండు సార్లు ధరలు పెంచిన వాహన తయారీ కంపెనీలు, మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడం ఇందుకు నేపథ్యం. గత 9 నెలల్లోనే ఉక్కు ధరలు 50 శాతం మేర పెరిగాయి. దీంతో స్కూటర్ల నుంచి భారీ ట్రక్కుల వరకు తయారు చేసే కంపెనీలు ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు ధరలను పెంచాయి. జూన్‌ త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయన్న అంచనాలు తల్లకిందులవ్వడంతో, ధరలను మళ్లీ పెంచక తప్పదని పేర్కొంటున్నాయి.

గిరాకీ తక్కువగా ఉన్నా..: టాటా మోటార్స్‌ అన్ని వాణిజ్య వాహనాల ధరలను ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.5 శాతం, జులైలో 1-2.5 శాతం పెంచింది. ప్రయాణికుల వాహన ధరలను మేలో 1.8 శాతం పెంచింది. రెండోసారి పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మారుతీ సుజుకీ కూడా జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ధరల పెంపు అమల్లోకి వస్తుందని జూన్‌లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. బజాజ్‌ ఆటో కూడా తొలి, రెండో త్రైమాసికాల మధ్య 5 శాతం వరకు ధరలను పెంచింది. మళ్లీ పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. గిరాకీ ధోరణిని బట్టి ద్విచక్ర వాహన కంపెనీలు.. ధరలపై ఒక నిర్ణయానికి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘గతంలో కంపెనీలు వివిధ సందర్భాల్లో ధరలు పెంచాయి. ముడి పదార్థాల ధరలు పెరిగినపుడు, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినపుడు, జీఎస్‌టీ పెరిగినపుడు.. ఇలా గిరాకీతో సంబంధం లేకుండా పెంచాయి. ఇపుడు కూడా అంతే. గిరాకీ తక్కువగా ఉన్నా అదే పనిచేయొచ్చు. ఎందుకంటే కారు అవసరం ఉన్నవారు తప్పక కొంటారు. ఇపుడు బ్యాంకు రుణ రేట్లు అత్యంత కనిష్ఠ స్థాయిల్లో ఉండడం వారికి కలిసిరావొచ్చ’ని ఒక బ్రోకరేజీ సంస్థ అంటోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని