సుప్రీంలో వొడాఫోన్‌ రివ్యూ పిటిషన్‌ - Vodafone Review Petition in the Supreme Court
close

Updated : 13/08/2021 06:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుప్రీంలో వొడాఫోన్‌ రివ్యూ పిటిషన్‌

దిల్లీ: వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) సుప్రీం కోర్టులో ఒక రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల(ఏజీఆర్‌) సంబంధిత బకాయిల లెక్కింపులో తప్పులు చోటుచేసుకున్నాయని.. వాటిని సరిదిద్దాలంటూ కంపెనీ ఇటీవల చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడం ఇందుకు నేపథ్యం. లెక్కల్లో జరిగిన పొరబాటును ప్రశ్నించకపోతే ‘న్యాయాన్ని అవహేళన’ చేసినట్లు అవుతుందని ఈ వారం మొదట్లో దాఖలు చేసిన పిటిషన్‌లో వీఐఎల్‌ పేర్కొంది. తప్పుడు లెక్కల వల్ల ఏజీఆర్‌ బకాయిల కింద రూ.25,000 కోట్లను (రూ.5931 కోట్ల అసలు, వడ్డీ; అపరాధ రుసుము, దానిపై వడ్డీ) అదనంగా కట్టాల్సి వస్తోందన్నది కంపెనీ వాదన. ఇందువల్ల వ్యాపార పెట్టుబడులకు నష్టం వాటిల్లడంతో పాటు ఉద్యోగులు, పంపిణీదార్లు, రిటైలర్లు, స్టోర్‌ సిబ్బంది జీవితాలపై ప్రభావం పడుతుందని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే కంపెనీ నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడుతోందని కోర్టుకు విన్నవించింది.  


స్టేపుల్‌ ఫైబర్‌ సరఫరాలో పోటీ నిబంధనల ఉల్లంఘన
అలాంటివి మానుకోవాలని  గ్రాసిమ్‌కు సీసీఐ ఆదేశాలు

దిల్లీ: కొన్ని రకాల స్టేపుల్‌ ఫైబర్‌ సరఫరాకు సంబంధించి తన గుత్తాధిపత్యాన్ని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ దుర్వినియోగం చేస్తోందని తేలిందని పేర్కొంటూ, అలాంటి అనైతిక వ్యాపార కార్యకలాపాలు ఆపేయాల్సిందిగా కంపెనీకి కాంపిటీషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 6న జారీ చేసిన ఆదేశాల ప్రకారం. కాంపిటీషన్‌ చట్టంలోని కొన్ని నిబంధనలను గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఉల్లంఘించినట్లు సీసీఐ పేర్కొంది. ‘వినియోగదారుల నుంచి తనకు నచ్చినట్లుగా ధర వసూలు చేయడం, ఇతర మార్కెట్లకు వెళ్లకుండా నిరోధించడం, తప్పనిసరిగా అనుబంధ ఉత్పత్తులను అంటగట్టడం లాంటి వాటి ద్వారా భారత్‌లో వీఎస్‌ఎఫ్‌ (విస్కస్‌ స్టేబుల్‌ ఫైబర్‌) సరఫరాకు సంబంధించి విపణిలో తన గుత్తాధిపత్యాన్ని గ్రాసిమ్‌ దుర్వినియోగం చేసింద’ని సీసీఐ పేర్కొంది. అయితే సీసీఐ ఆదేశాలు తమకు ఇంతవరకు రాలేదని, దీనిపై తమకు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఎక్స్ఛేంజీలకు గ్రాసిమ్‌ తెలియజేసింది. 2020 మార్చిలోనూ ఈ తరహా నిబంధనల ఉల్లంఘనలపైనే గ్రాసిమ్‌కు ఆదేశాలు జారీ చేస్తూ రూ.301.61 కోట్ల జరిమానాను సీసీఐ విధించింది. దీనిని పరిగణనలోకి తీసుకొని ఈసారి ఎలాంటి జరిమానాను కంపెనీకి సీసీఐ విధించలేదు.  


కృత్రిమ మేధ, క్లౌడ్‌ సాంకేతికతలపై 62000 మంది మహిళలకు నైపుణ్యాలు
ఎస్‌ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ సంయుక్త కార్యక్రమం

దిల్లీ: పేద యువ విద్యార్థినుల కోసం ‘టెక్‌సక్షం’ పేరిట సంయుక్త నైపుణ్యాల కల్పనా కార్యక్రమాన్ని ఎస్‌ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్‌ సంయుక్తంగా ప్రకటించాయి. కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, వెబ్‌ డిజైన్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ల్లో 62,000 మందికి పైగా విద్యార్థినులకు నైపుణ్యాలు నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఏఐసీటీఈ ట్రైనింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ అకాడమీ (ఏటీఏఎల్‌), రాష్ట్ర విద్యా శాఖల భాగస్వామ్యంలో దీన్ని నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరంలో 1500 మంది ఉపాధ్యాయులు నైపుణ్యాలు అందిస్తారు. ఏడాదికి ఒక్కో ఉపాధ్యాయుడు 50 మంది విద్యార్థినులకు చొప్పున మొత్తంగా 60000- 75000 మంది శిక్షణ ఇవ్వనున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని