సింగపూర్‌ కోర్టు తీర్పును పరిశీలిస్తున్నాం - We are considering a Singapore court ruling
close

Updated : 28/07/2021 06:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింగపూర్‌ కోర్టు తీర్పును పరిశీలిస్తున్నాం

చెల్లుబాటు అవుతుందో లేదో చెబుతాం
ఫ్యూచర్‌ రిటైల్‌ కేసులో సుప్రీం

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ కుదుర్చుకున్న విలీన ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ సింగపూర్‌ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌(ఈఏ) ఇచ్చిన తీర్పు భారత చట్టాల కింద చెల్లుబాటు అవుతుందా.. దానిని అమలు చేయొచ్చా.. అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వెల్లడించింది. రిలయన్స్‌తో ఫ్యూచర్‌ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.కామ్‌ న్యాయపోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘ఈఏ ఇచ్చిన తీర్పు ఆర్బిట్రేషన్‌ అండ్‌ కాన్సిలియేషన్‌ యాక్ట్‌ 17(1) కిందకు వస్తుందో లేదో మేం నిర్ణయిస్తాం. అదే సమయంలో 17(2) కింద దానిని అమలు చేయొచ్చో లేదో కూడా చెబుతామ’ని న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ తీర్పుల చెల్లుబాటు, అమలు విషయంలో వచ్చిన తీర్పులను ఉటంకిస్తూ ఫ్యూచర్‌ రిటైల్‌ తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే చేసిన వాదనలను దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం పైవిధంగా స్పందించింది.


ఆహార భద్రత, నాణ్యత కోసం కొత్త సాంకేతికతల వినియోగం
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ యోచన

దిల్లీ: ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలను కాపాడేందుకు బ్లాక్‌ చైన్‌, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. దేశీయంగా, సరిహద్దుల్లో తనిఖీలు, పర్యవేక్షణ వంటి వాటిపై కొవిడ్‌-19 పరిణామాలు ప్రభావం చూపుతున్నాయని, ఈ నేపథ్యంలో తాజా సాంకేతికతల ఆవశ్యకత ఏర్పడిందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ అరుణ్‌ సింఘాల్‌ తెలిపారు. ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో ఆహారం అందించేందుకు నియంత్రణ పరమైన తనిఖీలు తప్పనిసరని సీఐఐ సదస్సులో వివరించారు. నియంత్రణ సంస్థలు వినియోగించుకునేందుకు సులభమైన టూల్స్‌  సృష్టించాల్సిందిగా పరిశ్రమ, పరిశోధకులను కోరారు.


2020-21లో 78 విదేశీ కంపెనీల నమోదు

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీల చట్టం కింద భారత్‌లో 78 విదేశీ కంపెనీలు నమోదైనట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ లోక్‌సభకు తెలిపారు. 2019-20లో 124 విదేశీ కంపెనీలు, 2018-19లో 118 కంపెనీలు నమోదయ్యాయి. 

పన్ను వసూళ్లు పెరగడమే పునరుత్తేజానికి నిదర్శనం

జూన్‌ త్రైమాసికంలో పన్ను వసూళ్లు పెరగడం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సంకేతమేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధ్రీ తెలిపారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.46 లక్షల కోట్లను మించాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. నికర పరోక్ష పన్నుల (జీఎస్‌టీ, జీఎస్‌టీయేతర) వసూళ్లు రూ.3.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ఉద్దేశపూర్వక ఎగవేతదారులు పెరిగారు

ఈ ఏడాది మార్చికి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య 2,494కు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు తెలిపారు. ఈ సంఖ్య 2020 మార్చిలో 2208, 2019 మార్చిలో 2017గా వెల్లడించారు.ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.3,12,987 కోట్ల ఎన్‌పీఏలు, రైటాఫ్‌ రుణాల్లో రికవరీ సాధించాయని అన్నారు.

57% తగ్గిన ఆహార శుద్ధి రంగంలో ఎఫ్‌డీఏలు

2020-21లో ఆహార శుద్ధి రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) 57 శాతం తగ్గి 393.4 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2,926 కోట్లు)కు చేరినట్లు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ వెల్లడించారు. 2019-20లో 904.7 మిలియన్‌ డాలర్లు, 2018-19లో 628.24 మి.డాలర్లు ఈ రంగంలోకి వచ్చాయి.

ఇథనాల్‌ సరఫరాతో చక్కెర మిల్లులకు రూ.15000 కోట్ల ఆదాయం

నవంబరు ముగిసే 2020-21 మార్కెటింగ్‌ ఏడాదిలో, చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఇధనాల్‌ విక్రయించడం ద్వారా చక్కెర మిల్లులకు దాదాపు రూ.15000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతీ తెలిపారు. సాధారణ సీజన్‌ (అక్టోబరు- సెప్టెంబరు)లో దేశ చక్కెర ఉత్పత్తి దాదాపు 320-330 లక్షల టన్నులుగా ఉండగా.. దేశీయ వినియోగం 260 లక్షల టన్నులుగా ఉన్నట్లు వివరించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని