వారసత్వ ధ్రువీకరణ పత్రం తప్పనిసరా? - What-are-the-documents-required to-make-a-will
close

Updated : 06/07/2021 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారసత్వ ధ్రువీకరణ పత్రం తప్పనిసరా?

అనుకోని విధంగా కుటుంబ పెద్ద దూరమైతే.. వారసులుకు ఒక్కసారిగా అయోమయం ఏర్పడుతుంది. అతని పేరు మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లోని నగదు, ఇతరులకు ఇచ్చిన డబ్బు వసూలు ఇలా పలు విషయాల్లో ఎం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో అర్ధం కాని పరిస్థితి. ఇలాంటప్పుడే అందరికీ వచ్చే సందేహం వారసత్వ ధ్రువీకరణ పత్రం గురించి. అసలు ఇది ఎందుకు అవసరం? తప్పనిసరా?వేరే మార్గాలు ఉన్నాయా? 

ఒక వ్యక్తి మరణించినప్పుడు అతనికి రావాల్సిన బాకీలు, అతని దగ్గరున్న హామీ పత్రాల్లాంటి వాటి ద్వారా డబ్బు వసూలు చేసుకోవడానికి అర్హులైన వ్యక్తులకు కోర్టు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. అంటే, ఒక వ్యక్తి చనిపోతే.. అతని బ్యాంకు ఖాతాల తాలూకా డబ్బు కానీ, ప్రోనోట్ల మీద రావాల్సిన బాకీలు కానీ, అతని పేరు మీద ఉన్న షేర్లు, దాని మీద వచ్చే రాబడి పొందడం కోసం అతని/ఆమె జీవిత భాగస్వామికో, సంతానానికో కోర్టు ఇచ్చే ధ్రువీకరణ పత్రం. ఇది కేవలం ఈ తరహా ఆర్ధిక లావాదేవీల వెసులుబాటుకే అని గ్రహించాలి. అంటే, ధ్రువీకరణ పత్రం పొందిన వారికి డబ్బు ఇచ్చినా, వాటాలు, హామీ పత్రాల విషయంలో లావాదేవీలు జరిపినప్పుడు అలాంటి చెల్లింపులు, లావాదేవీలు అన్నీ చట్ట సమ్మతమే. చెల్లించిన వారు పూర్తిగా రుణ విముక్తులవుతారు. తర్వాత అలా ఇచ్చిన వారు ఇతర వారసులకు జవాబుదారీ కారు.

ఎందుకు?

కంపెనీ డిబెంచ‌ర్లు, షేర్లు, ప్రభుత్వాలు ఇచ్చే బాండ్లు, బ్యాంకు ఖాతాలు, తదితర విషయాల్లో లావాదేవీల కోసం వారసత్వ ధ్రువ పత్రం అవసరం. 
 ఇవ్వకూడని సందర్భాలు:
* స్థిరాస్తుల విషయంలో 
*వీలునామా ఉన్నప్పుడు
* చనిపోయిన వారి ఆస్తి నిర్వహణకు కోర్టు ఎవరినైనా నియమించినప్పుడు
* చనిపోయిన వారి ఆస్తులు కాకుండా అతని మరణం వల్ల వారసులకు వచ్చే హక్కుల విషయంలో. అంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చనిపోతే.. అతని వారసులకు రెండు రకాల హక్కులు ఉంటాయి.
 1.అతడు జీవించి ఉండగా ఉన్న ఆస్తులు అంటే, అతనికి అప్పటికే సంక్రమించి ఉన్న హక్కులు. పీఎఫ్, గ్రాట్యూయిటీ, జీత భత్యాలు, భరణాలు వగైరా.
 2. అతడు విధి నిర్వహణ లో మరణించడం వల్ల అతని వారసులకు ఇచ్చే నష్ట పరిహారాలు, పునరావాసం(కంపాషనేట్ అప్పాయింట్మెంట్).

పై వాటిలో మొదటి పేర్కొన్న సంద‌ర్భాల్లో వారసత్వ ధ్రువ పత్రం ఇవ్వవచ్చు. ఇత‌ర సంద‌ర్భాల్లో ఇవ్వరాదు. ఇచ్చినా చెల్లదని సుప్రీమ్ కోర్టు తీర్పులు చెబుతున్నాయి.

ధ్రువపత్రం ఎక్క‌డ అవ‌స‌రం లేదు ?

వారసత్వ ధ్రువ పత్రం అవసరాన్ని వీలైనంత తగ్గించడానికి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, సహకార సంస్థలు, 'నామినేషన్' విధానాన్ని ప్రవేశ పెట్టాయి. ఈ నామినేషన్ పధ్ధతికి చట్ట బద్ధత కూడా కల్పించారు. ఈ నామినేషన్ ఉంటే ధ్రువపత్రం అక్కర్లేదు. అలాగే రుణ సారూప్యం లేని విషయాల్లోనూ ధ్రువపత్రం అవ‌స‌రం లేదు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు తీసుకోవడానికి (నామినేషన్ లేకపోతే) కావాలి. కానీ, లాకర్లో పెట్టుకున్న దానికి అక్కర్లేదని అనేక కోర్టు తీర్పులున్నాయి. తాకట్టు పెట్టిన వస్తువులకు కూడా. వీలునామా ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ, వారసత్వ ధ్రువపత్రం చెల్లదు.

 ఎలా పొందాలి?

స్థానికంగా సంబంధిత సివిల్ కోర్టులో దావా పధ్ధతిలో అర్జీ పెట్టుకోవాలి. హైకోర్టు ఆవరణలో ఉన్న రాష్ట్ర అడ్మినిస్ట్రేటర్ జనరల్ కూడా రూ. 10 లక్షల పమితికి లోబడి ఈ తరహా ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.

అర్జీలో ఈ కింద వివరాలు విధిగా, సరిగ్గా పొందుపర్చాలి:

* వ్యక్తి మరణించిన సమయం, తేదీ తదితర వివరాలు.

* మరణించిన వ్యక్తి నివాసం, కోర్టు ప్రాంతీయ పరిధిలో నివసించకపోతే అక్కడ ఉన్న ఆస్తుల వివరాలు.

* కుటుంబ, సమీప బంధువుల వివరాలు

* అర్జీదారు హక్కులు

* చట్ట రీత్యా ఉన్న అనర్హత లేదా ఇబ్బందులు, ఉదాహరణకు విల్లు ఉండటం.

* ఏయే అప్పులు లేదా హామీ పత్రాల కోసం ధ్రువ పత్రం కోరుతున్నారో వాటి వివరాలు.

తప్పుడు సమాచారం ఇస్తే అది శిక్షార్హమైన నేరం. అసమగ్ర లేదా అసత్య సమాచారం ద్వారా పొందిన ధ్రువ పత్రాన్ని రద్దు చేయవచ్చు. అర్జీని తీసుకున్న కోర్టు, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, కోర్టు ఆవరణలో, నోటీసు అంటించడం ద్వారా, దినపత్రికల్లో ప్రకటన ద్వారా ఆసక్తి ఉన్న వ్యక్తులకు తెలిసే ఏర్పాటు చేస్తారు. వారసత్వ హక్కులున్న వ్యక్తులందరి పేర్లు, వారి హక్కులు, వాటాలతో పాటు వారిలో ఎక్కువ అధికారం, అర్హత ఉన్న వారికి ధ్రువ పత్రం జారీ చేస్తారు. ఆ పత్రం కోసం జరిగే విచారణ చాలా సంక్షిప్తమైనది. ఇతరులకున్న హక్కుల్ని హరించదు, లేని హక్కుల్ని కల్పించదు. వారసులకు, వసూలు చేసిన సొమ్మును పంచాల్సిన బాధ్యతను మాత్రం చట్టం ఆపాదిస్తుంది. వారసత్వ ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం, స్థిరాస్తి మార్పిడులు చేయడానికి వీలు లేదు. అలాంటి ఉత్తర్వులు చెల్లవు.

* వారసత్వ ధ్రువపత్రం తేలికైనది కాదు. సంక్షిప్త విచారణ వల్ల, కేవలం మీరిచ్చిన సమాచారం ఆధారంగా తక్షణావసరాల నిమిత్తం ఇచ్చే పత్రం. దానిలో ఇచ్చిన ఉత్తర్వులు, మీ హక్కుల పై ఆఖరి మాట కాదు. అంటే, తర్వాత వచ్చే దావాల్లో దాన్ని అస్త్రంగా వినియోగించే వీలు లేదు.

* పైగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పత్రికా ప్రకటనలకు ఖర్చు పెట్టాలి. మామూలు లావాదేవీల కంటే చాలా ఎక్కువగా కోర్టు ఫీజు చెల్లించాలి. షేర్లు, డిబెంచర్లు, ప్రోనోటు సొమ్ముల విలువ పై కోర్టు ఫీజు చెల్లించాలి. వివాదాస్పదమైతే విచారణకు రావడానికే చాలా సమయం పడుతుంది.

* ధ్రువపత్రం ఇచ్చినా, నిరాకరించినా అప్పీలు చేసుకోవచ్చు. లేదా హక్కుల ప్రకటనకో, ఆస్తుల విభజనకో దావా వేసుకోవచ్చు. తప్పనిసరి, అత్యవసరం, నిర్వివాదమైతేనే వారసత్వ ధ్రువపత్రం కోసం వెళ్లండి. లేకపోతే దావా వేసుకుంటేనే మంచిది. ఖర్చు కూడా తక్కువ. అనుభవజ్ఞుడైన లాయర్ని సంప్రదించి సరైన దావా వేయండి.     


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని