క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ అంటే ఏంటి..ఎందుకు? - What-is-a-critical-illness-insurance-plan
close

Published : 30/03/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌ర్ అంటే ఏంటి..ఎందుకు?

భారతీయులు జీవన-శైలి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది గుండె సంబంధిత అనారోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అది కూడా చాలా చిన్న వయసులోనే ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక స‌ర్వే ప్ర‌కారం ప్ర‌తీ న‌లుగురిలో ఒకరు తీవ్ర వ్యాదుల కార‌ణంగా 70 సంవ‌త్స‌రాల‌కు ముందే మ‌ర‌ణిస్తున్నార‌ని తేలింది. అందువ‌ల్ల‌ జీవిత, ఆరోగ్య బీమా పాలసీలతో పాటు ఒక క్రిటికల్ ఇల్‌నెస్ క‌వ‌ర్‌ను తీసుకోవ‌డం మంచిది.  ఒకవేళ మీరు ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీని (వ్యక్తిగత లేదా కుటుంబ ఫ్లోటర్ పాలసీ) తీసుకున్న‌ట్ల‌యితే, దానికి ఒక క్రిటికల్ ఇల్నెస్ రైడర్ను జోడించడం లేదా ప్రత్యేకంగా రైడర్ ను కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. 

క్రిటికల్ ఇల్నెస్ పాలసీ / రైడర్ ఎలా పనిచేస్తుంది? 
సాధారణ ఆరోగ్య బీమా పథకంతో పోలిస్తే, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ లేదా ప్లాన్ భిన్నంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా తీవ్రమైన అనారోగ్యంతో (క్యాన్సర్ లేదా గుండెపోటు) బాధపడుతున్నట్లయితే, పాల‌సీ తాలూకు హామీ మొత్తాన్ని ఆరోగ్య బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బుతో మీ వైద్యానికి సంబంధించిన ఖర్చులను, అలాగే వైద్యం కోసం ఏదైనా రుణం తీసుకున్నట్లయితే వాటిని చెల్లించవచ్చు.

క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ లో వైద్య ఖర్చులతో నిమిత్తం లేకుండా, మీ పాలసీ ప్రకారం హామీ మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. గుండెపోటు, క్యాన్సర్, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం లేదా పక్షవాతం వంటి మొదలైన వ్యాధులు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ లేదా పాలసీ కింద కవర్ అవుతాయి.

ప్రతి బీమా సంస్థ స్వంతంగా ప్రత్యేక క్రిటికల్ ఇల్నెస్ జాబితాను కలిగి ఉంటుంది, అవి ఒకేలా ఉండచ్చు లేదా ఉండకపోవచ్చు. అందువల్ల‌, ఏదైనా ఒక నిర్దిష్ట సంస్థకు సంబంధించిన పాలసీని కొనుగోలు చేసే ముందు దానిలో కవర్ అయ్యే క్రిటికల్ ఇల్నెస్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. 

క్రిటికల్ ఇల్నెస్ పాలసీ v/s క్రిటికల్ ఇల్నెస్ రైడర్..

క్రిటికల్ ఇల్నెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిర్ణయించుకుంటే, మీరు ఒక కొత్త క్రిటికల్ ఇల్నెస్ పాలసీని తీసుకోవడం లేదా మీ సాధారణ ఆరోగ్య బీమా లేదా టర్మ్ జీవిత బీమా పథకానికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ను జత చేసే ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీకు రైడర్ చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడంతో పాటు స్వతంత్ర పాలసీ ఇచ్చే ప్రయోజనాలను అందిస్తుంది.

రైడర్ కు సంబంధించిన పరిమితులు, ఫ్లెక్సిబిలిటీ గురించి మీరు అవగాహన కలిగి ఉండాలి.  రైడర్ తీసుకోవడం ఇష్టం లేనివారు,  స్వతంత్ర క్రిటికల్ ఇల్నెస్ పాలసీని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీని లేదా రైడర్ ను తీసుకోవడం ద్వారా అనుకోకుండా సంభవించే అనారోగ్యానికి అయ్యే ఖర్చుకు మీ పొదుపు మొత్తాన్ని వెచ్చించనవసరం లేదు.

ఒకవేళ మీరు 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారైతే ప్రత్యేకించి, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ ను అందించే ఒక పాలసీని కలిగి ఉండటం మంచిది. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ ను కొనుగోలు చేయడం ఏంతో ముఖ్యమైనప్పటికీ, ఇది సాధారణ ఆరోగ్య బీమా పాలసీని భర్తీ చేయదు. అందువల్ల‌, మీకు, మీ కుటుంబ సభ్యులకు తగినంత ఆరోగ్య బీమా కవర్ ఉన్నప్పుడు మాత్రమే క్రిటికల్ ఇల్నెస్ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

క్యాన్సర్‌, బైపాస్‌ సర్జరీ, అవయవ మార్పిడి, పక్షవాతం లాంటి తీవ్రమైన అనారోగ్యాలకు వైద్యఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఇవి వ్యక్తికి తీవ్ర క్షోభను కలిగించడమే కాక కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేస్తాయి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలున్నా కొంత మేరకు పరిమితి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ ఉంటే పూర్తి భరోసా ఉంటుంది.

ఎప్పుడు ఉపయోగ పడుతుందంటే..

సాధారణ ఆరోగ్య బీమా పాలసీలలో వైద్యానికైన‌ ఖర్చు మాత్రం చెల్లిస్తారు. అదే క్రిటికల్ ఇల్‌నెస్‌ పాలసీలలో.. పాలసీ దారుడు ఒక సారి తీవ్ర వ్యాధికి గురయినట్టు తెలిపితే బీమా హామీ మొత్తాన్ని అందిస్తారు.

ఆరోగ్య బీమా పాలసీ ఉంది కదా మరి ఈ పాలసీ అవసరం ఏంటి.. అనుకోవచ్చు. సాధారణంగా ఒక సారి ఈ తీవ్ర వ్యాధులను ఉన్నట్టు గుర్తిస్తే అందుకు చికిత్స దీర్ఘ కాలం పాటు ఉంటుంది. పైగా ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. ఆరోగ్య బీమా పాలసీలు ఆసుపత్రి ఖర్చులు, ఇంటి వద్ద వైద్యం, ఇతర ప్రయాణ ఖర్చులు పరిమితుల ప్రకారం చెల్లిస్తాయి. కానీ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బెనిఫిట్‌ పాలసీలో వైద్యానికి అయ్యే ఖర్చు, చేయించుకునే సమయం, ఆసుపత్రి వంటి ఎలాంటి విషయాలను చూడకుండా వ్యాధి ఉన్నట్టు నిర్ధారించగానే హామీ మొత్తం చెల్లిస్తారు. ఈ మొత్తం కేవలం వైద్యానికే కాకుండా, చికిత్స అనంతరం, కోలుకునే సమయంలో ఇతర ఖర్చులు, కుటుంబ పోషణకూ ఉపయోగ పడుతుంది.

ఎలా తీసుకోవాలి..

ఈ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ జీవిత బీమా పాలసీతోపాటు రైడర్‌గా తీసుకునే వీలుంది లేదా ఆరోగ్య బీమా కంపెనీల నుంచి ప్రత్యేకంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకోవచ్చు. జీవిత బీమాతో పాటు తీసుకునే రైడర్లు ఒకటి నుంచి పదేళ్ల వరకు బీమా హామీ ఇస్తాయి. అదే ఆరోగ్య బీమాతో తీసుకునే వాటికైతే 1నుంచి 5ఏళ్ల పాటు కవరేజీ ఇస్తారు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులందరికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌గాను తీసుకోవచ్చు. ఆరేళ్ల వారి నుంచి 75ఏళ్ల వ‌య‌సు ఉన్నవారికి ఈ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

క‌వ‌రేజ్‌..

బీమా సంస్థ ఇచ్చిన జాబితాలోని వ్యాధులకు బీమా అందిస్తాయి. 10 నుంచి 20 వ్యాధులను కవర్‌ చేసే పాలసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీలు రూ.లక్ష నుంచి రూ.50లక్షల వ‌ర‌కు క‌వ‌ర్ చేస్తాయి. 

మినహాయింపులు..

పాలసీ తీసుకునే ముందు ఉన్న వ్యాధులకు (ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజెస్‌) ఈ పాలసీ వర్తించదు. పాలసీ తీసుకున్న 90 రోజుల లోగా ఏదైనా వ్యాధి గుర్తించినట్ల‌యితే దానికి బీమా కంపెనీలు ఎటువంటి బీమా చెల్లించవు. బీమా పరిభాషలో దీన్నే వెయిటింగ్‌ పీరియడ్‌ అని అంటారు.

సర్వైవల్‌ పీరియడ్‌..

వ్యాధి గుర్తించిన తర్వాత 30 రోజుల్లోపు మృతి చెందితే బీమా వర్తించదు. కొన్ని రకాల తీవ్ర అనార్యోగాలకు పాలసీ చెల్లించే సొమ్ముకు పరిమితులు ఉంటాయి. దీన్నే ఉపపరిమితి (సబ్‌ లిమిట్‌) అంటారు. తీసుకునే పాలసీని బట్టి ఇది మారుతుంది.

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకునేటప్పుడు గుర్తించుకోవాల్సిన‌ విషయాలు..

* ఈ పాలసీని ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. సాధారణ ఆరోగ్య బీమా అన్ని ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటుంది. అదే క్రిటికల్‌ పాలసీ అయితే కేవలం తీవ్ర అనారోగ్యాలకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే దీన్ని అదనపు భరోసానిచ్చే పాలసీగానే చూడాలి. 
* పాలసీదారుడు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకునేటప్పుడే తన ఆరోగ్య చరిత్ర, అలవాట్లు, ముందుగా గుర్తించగలిగే అవకాశమున్న వ్యాధులను బట్టి సరైన పాలసీ ఎంచుకుంటే ఉపయోగకరం.
* ఏయే వ్యాధులకు ఉపపరిమితులు ఎంత మేరకు ఉన్నాయో గమనించి పాలసీని ఎంచుకోవడం మేలు.
* ఎక్కువ వయసు వరకు పునరుద్ధరించుకునే వీలున్న పాలసీ ఎంచుకోవటం మంచిది.
* ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్‌ 80(డి) ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.
 


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని