Diversified Equity Fund: తక్కువ నష్టభయంతో ఎక్కవ రాబడి కావాలా..? - What is an equity diversified fund and how its beneficial
close

Updated : 12/10/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Diversified Equity Fund: తక్కువ నష్టభయంతో ఎక్కవ రాబడి కావాలా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు వంటి సురక్షితమైన పథకాలపై 5 - 6.5 శాతం వరకూ వడ్డీ వస్తోంది. అసలు ఏమాత్రం నష్టభయం ఉండొద్దనుకుంటే.. వచ్చే రాబడి 5 - 6.5 శాతం మధ్యే ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాబడి మన భవిష్యత్తు అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను ఏమాత్రం తీర్చలేదు. తక్కువలో తక్కువ 12 శాతం రాబడి ఉంటే.. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి కొంతమేర కూడబెట్టుకోగలం. ఇది కొంత నష్టభయంతో ఉన్న పెట్టుబడి పథకాలతోనే సాధ్యం అవుతుంది. దీనికి మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటి ద్వారా దీర్ఘకాలంలో 12% - 13% రాబడి వచ్చే అవకాశం ఉంది. మీరు నెలకు రూ.15 వేలను 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 13 శాతం రాబడి అంచనాతో.. రూ.33,15,554 అయ్యేందుకు వీలుంది! మరి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లు అంటే ఏంటి? వాటి ప్రయోజనాలేంటో చూద్దాం!

సాధారణంగా మనం మ్యూచువల్‌ ఫండ్లలో అధిక రాబడి కోసం ఈక్విటీ ఆధారిత ఫండ్లలో మదుపు చేస్తుంటాం. ఫండ్‌ ఫీచర్లను బట్టి మార్కెట్లో ఉన్న ఓ 40-60 స్టాక్స్‌లలో ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ, సూచీలు కిందకు వచ్చినప్పుడు సాధారణంగా మెజారిటీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబడి తగ్గొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసిన సొమ్మును వివిధ రంగాలకు చెందిన స్టాక్‌లలోకి మళ్లిస్తారు. ఔషధ, వాహన, ఇంజినీరింగ్‌, ఇంధనం, సాంకేతిక, ఆయిల్‌అండ్‌గ్యాస్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ.. వంటి రంగాల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. దీని వల్ల ఓ రంగం కుదేలైనా.. మరిన్ని రంగాల్లో వచ్చే లాభాలతో రాబడిపై పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు.

ఈ డైవర్సిఫైడ్‌ ఫండ్లను సాధారణంగా మూడు భాగాలుగా విభజిస్తారు..

స్మాల్‌ క్యాప్‌ డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌: ఈ కేటగిరీలో రూ.4,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీలు ఉంటాయి. ఈ కేటగిరీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్లను అధిక నష్టభయం, అధిక రాబడి ఉన్న ఫండ్లుగా పేర్కొంటారు. 35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి వీటిని సూచిస్తుంటారు. అయితే, వీటిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు. లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫండ్‌ ఎంచుకునేటప్పుడు గత కొన్నేళ్లలో దాని పనితీరు, ఫండ్‌ మేనేజింగ్‌ కంపెనీ విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. 

మిడ్‌ క్యాప్‌ డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌: మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4,000-20,000 కోట్ల మధ్య ఉన్న కంపెనీలు ఈ కేటగిరీలోకి వస్తాయి. మనం చేసే మదుపును వివిధ రంగాల్లో ఈ కేటగిరీలోకి వచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. స్మాల్‌ క్యాప్‌తో పోలిస్తే వీటిలో నష్టభయం కాస్త తక్కువ. సరైన మిడ్ క్యాప్‌ ఫండ్‌ని ఎంచుకోగలిగితే.. అధిక రాబడిని ఆర్జించే అవకాశం ఉంది. 

లార్జ్ క్యాప్‌ డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌: మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.20,000 కోట్ల కంటే ఎక్కువ ఉన్న కంపెనీలు ఈ కేటగిరీలోకి వస్తాయి. సాధారణంగా బ్లూచిప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. నిఫ్టీ సూచీని ప్రమాణికంగా తీసుకొని మదుపు చేస్తారు. పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న కారణంగా నష్టభయం మిగిలిన రెండు కేటగిరీలతో పోలిస్తే తక్కవగానే ఉంటుంది.

వీటితో పాటు ఈ స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌, మిడ్ అండ్‌ లార్జ్‌ క్యాప్‌, మల్టీక్యాప్‌.. ఇలా పై మూడింటి కాంబినేషన్‌లో కూడా పథకాలు ఉంటాయి. 

ఎవరు తీసుకోవాలి...

ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలని ఉండి.. వాటిపై పెద్దగా అవగాహనలేని వారికి ఈ పథకాలు సరిపోతాయి. అలాగే రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌, పిల్లల చదువులు, పెళ్లి లక్ష్యంతో మదుపు చేసేవారు కూడా ఈ పథకాల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటికే స్టాక్స్‌ లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నవారు.. వివిధీకరణ కోసం తమ పోర్ట్‌ఫోలియోలో ఈ పథకాలను చేర్చుకోవడం ఉత్తమం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని