బడ్జెట్‌ నుంచి ఏం కావాలంటే.. - What we need from budget
close

Published : 31/01/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ నుంచి ఏం కావాలంటే..

హైదరాబాద్‌:కొవిడ్‌-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇది త్వరగానే కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి దీనికి బలం చేకూర్చేలా ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌లో  ఏం చేయబోతున్నారు.. ఏం చేస్తే.. బాగుంటుంది అని కొన్ని రంగాలకు చెందిన  నిపుణులు తమ అభిప్రాయాలను ఇలా పంచుకుంటున్నారు.

సంస్కరణలపై దృష్టి పెట్టాలి..
మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం, ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకున్నాయి. ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఉన్న నిధులను చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంలో ఫలితాలను ఇచ్చే సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తూనే.. వినియోగాన్ని పెంచేలా ప్రోత్సహించాలి. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సమయం పడుతుంది. అంతవరకూ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాల్సిందే. కరోనా తర్వాత దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. మునుపెన్నడూ లేని విధంగా బడ్జెట్‌ను చూడబోతున్నారని ఇప్పటికే ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై  ప్రజలందరూ ఎంతో ఆశాభావంతో ఉన్నారు. - అమితాబ్‌ చౌదరి,
ఎండీ, సీఈఓ యాక్సిస్‌ బ్యాంక్‌

ఎండీఆర్‌ను రద్దు చేయాలి..
డిజిటల్‌ చెల్లింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ, ఇది మరింత సమర్థంగా జరగాలంటే.. రూపే, యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌)ను పూర్తిగా తొలగించాలి. పీఎంజేడీవై లావాదేవీలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలి. చిన్న, మధ్యతరగతి సంస్థలకు నగదు లభ్యత పెరిగేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలి. ఫిన్‌టెక్‌ సంస్థలకు ప్రభుత్వ బ్యాంకులు నిధులు సమకూర్చేలా లేదా భాగస్వామ్యంతో అప్పులిచ్చేలా ఏర్పాటు జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందిస్తోన్న బ్యాంకు మిత్రలు నగదును ఉపసంహరించినప్పుడు విధిస్తున్న టీడీఎస్‌ను రద్దు చేయాలి.
- కేతన్‌ దోషి, ఎండీ, పేపాయింట్‌ ఇండియా

తయారీ రంగానికి ప్రోత్సాహకాలు..
ఆర్థికాభివృద్ధిలో తయారీ రంగానిదే కీలక పాత్ర. కానీ, కొవిడ్‌-19 వల్ల ఈ రంగం కుంగిపోయింది. అందువల్ల దీనికి ప్రభుత్వం బడ్జెట్‌లో అండగా నిలవాలి. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలను చేరుకోవాలన్నా.. చైనా నుంచి తయారీ పరిశ్రమలను మన దేశానికి ఆకర్షించేందుకైనా తయారీ రంగానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తేనే సాధ్యం. ఎంఈఐఎస్‌ స్కీం, డ్యూటీ డ్రా బ్యాక్‌ రాయితీలను రెట్టింపు చేయాలి. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలి. అప్పుడు ఈ దేశాలకు మన గాజు ఉత్పత్తులను అధికంగా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. 
- రాజేశ్‌ ఖోస్లా, ప్రెసిడెంట్, సీఈఓ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌

చిన్న ఐటీ సంస్థలపై సానుకూలంగా..
కొవిడ్‌ తర్వాత ప్రజా జీవితంలో సాంకేతికత అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. అన్నీ డిజిటల్‌కు మారుతున్నాయి. సమాచార భద్రత, గోప్యత, క్లౌడ్‌ సెక్యూరిటీ అనేవి ప్రాధాన్యాంశాలుగా మారిపోయాయి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అందువల్ల ఈ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఐటీ కంపెనీలను ప్రోత్సహించే ప్రతిపాదనలు బడ్జెట్‌లో తీసుకురావాలి. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలను స్థితిగతులను పరిగణనలోనికి తీసుకొని, వాటిని ప్రోత్సహించాలి. మన దేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఐటీ రంగం పాత్ర కీలకం అని గుర్తించాలి.
- శ్రీకాంత్‌ చక్కిలం, 
సీఈఓ, సిగ్నిటీ టెక్నాలజీస్‌
ఇవీ చదవండి

పద్దు రోజున అజాగ్రత్త వద్దు
మన పద్దు పొడిచేనా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని