మార్చి వరకు రేట్ల పెంపు ఉండదేమో - Whether there will be a rate hike until March
close

Updated : 30/06/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చి వరకు రేట్ల పెంపు ఉండదేమో

బలహీన వృద్ధి, పెరుగుతున్న ద్రవ్యోల్బణమే కారణం
బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా

ముంబయి: ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధి బలహీనంగా ఉండటంతో ఇప్పట్లో రేట్ల పెంపు జోలికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను (ఆర్‌బీఐ) వెళ్లే అవకాశం లేదని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం వరకు ఇందుకోసం వేచి చూడొచ్చని తెలిపింది. అప్పటి వరకు సర్దుబాటు ధోరణి కొనసాగించొచ్చని బార్‌క్లేస్‌ ముఖ్య ఆర్థిక వేత్త రాహుల్‌ బజోరియా పేర్కొన్నారు. గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.3 శాతానికి చేరగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 5.4 శాతంగా నమోదు కావొచ్చని బార్‌క్లేస్‌ అంచనా వేసింది. అంతర్జాతీయంగా కమొడిటీ ధరల పెరుగుతున్నాయని, 2-3 త్రైమాసికాలుగా పప్పుధాన్యాలు, నూనెల ధరలు బాగా పెరిగాయని గుర్తు చేసింది. దుస్తులు, పాదరక్షలు, పరిశ్రమ ఉత్పత్తుల ధరలూ ఒత్తిడిని పెంచాయని వివరించింది. కొవిడ్‌ రెండోదశ వల్ల వృద్ధిరేటు అంచనాలు కూడా తగ్గిపోతున్నాయని పేర్కొంది.

ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు రుణాలు :నియోగ్రోత్‌ క్రెడిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)కు రుణాలను అందించే నియోగ్రోత్‌ క్రెడిట్‌ కొత్తగా రెండు రుణ పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నియోక్యాష్‌ ప్లస్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైలర్లు తమ ఇళ్లు, వాణిజ్య భవనాలు, గోదాములు, పరిశ్రమలకు రుణాన్ని తీసుకోవాలనుకుంటే.. కనీసం రూ.20లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు అందించనున్నట్లు పేర్కొంది. ఈ రుణ వ్యవధి 60 నెలలు ఉంటుంది. పెద్ద కార్పొరేట్లకు సేవలను అందించే ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, విక్రేతల కోసం వెండార్‌ ఫైనాన్స్‌ ప్లస్‌ ద్వారా రుణాలు లభిస్తాయని నియోగ్రోత్‌ క్రెడిట్‌ సీఈఓ అరుణ్‌ నాయర్‌ తెలిపారు.

రుచి సోయా లాభం రూ.314 కోట్లు

దిల్లీ: బాబా రామ్‌దేవ్‌ నేతృత్వంలోని రుచి సోయా ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసికంలో రూ.314.33 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.41.24 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.3,209.02 కోట్ల నుంచి రూ.4,859.5 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (2020-21)లో కంపెనీ రూ.680.77 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2019-20లో కంపెనీ లాభం రూ.7,673 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.13,175.36 కోట్ల నుంచి రూ.16,382.97 కోట్లకు పెరిగింది. 2019లో దివాలా ప్రక్రియ ద్వారా రుచిసోయాను పతంజలి గ్రూప్‌ కొనుగోలు చేసింది. మార్చి త్రైమాసికంలో రుచిసోయా బ్రాండెడ్‌ వ్యాపార విభాగ అమ్మకాలు రూ.3,455.96 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం అమ్మకాల్లో ఇవి 71.12 శాతానికి సమానం.

15 ఏళ్ల గరిష్ఠానికి అమెరికాలో ఇళ్ల ధరలు

వాషింగ్టన్‌: అమెరికాలో ఇళ్ల ధరలు ఏప్రిల్‌లో అత్యంత వేగంగా పెరిగాయి. అందుబాటులో ఉన్న ఇళ్లు పరిమితంగా ఉండడంతో 2005 తర్వాత అత్యధిక వృద్ధితో ధరలు పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 15 శాతం; మార్చితో పోలిస్తే 13.4 శాతం మేర పెరిగాయి. కరోనా మొదలయ్యాక చాలా మంది అమెరికన్లు నగరాల్లో అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లతో పోలిస్తే నగరానికి దూరంగా పెద్ద ఇళ్లపై దృష్టి సారిస్తున్నారు. ఫెడరల్‌ రిజర్వ్‌ తక్కువ వడ్డీ రేటు అమలు చేస్తుండటం, తనఖా రేట్లూ చారిత్మాత్రక కనిష్ఠాల్లో ఉండడంతో గిరాకీ రాణిస్తోంది. త్వరలోనే ఈ ధరలు తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌లో 20 నగరాల్లో అత్యధిక ధరల వృద్ధి నమోదైంది. ముఖ్యంగా షార్లెట్‌, క్లీవ్‌లాండ్‌, డల్లాస్‌, డెన్వర్‌, సియాటెల్‌లలో 30 ఏళ్ల గరిష్ఠానికి చేరాయి. గత నెలలో సగానికి పైగా ఇళ్లు అడుగుతున్న ధర కంటే ఎక్కువకు విక్రయమయ్యాయని రియాల్టీ సంస్థ రెడ్‌ఫిన్‌ అంటోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని