పెట్రో మంటలకు కారణాలివే..! - Why Petro charges are increasing
close

Updated : 12/02/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రో మంటలకు కారణాలివే..!

దిల్లీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్‌ ధర కొత్త గరిష్ఠాలకు చేరి సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే నిత్యావసర ధరలు పెరిగి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పెట్రో మంటలకు కారణం ఏంటి? చమురు ధరలను ప్రభావితం చేస్తున్న అంశాలెంటో ఓసారి చూద్దాం..!

ధరల్ని ప్రభావితం చేస్తున్న కీలకాంశాలు...

ప్రపంచ విపణిలో చమురు ధరలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగానూ ఆ ప్రభావం ఉంటుంది. పెట్రో ధరల పెరుగుదలకు ఇదొక ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పుంజుకోవడం, ఉత్పత్తి మందగించడం, చమురు ఉత్పత్తి దేశాల్లో అస్థిరత వంటి అంశాలు అంతర్జాతీయ ముడి చమురు ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతుంటాయి. కొవిడ్‌ నుంచి క్రమంగా ప్రపంచ దేశాలు పుంజుకుంటున్నాయి. రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలు పూర్వ స్థితికి చేరుకుంటున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురుకు గిరాకీ పెరిగి ధర పెరుగుతూ వస్తోంది.

గిరాకీ పెరుగుదల..

దేశీయంగా పారిశ్రామిక రంగం పుంజుకుంటున్న కొద్దీ చమురుకు గిరాకీ పెరుగుతూ వస్తోంది. అలాగే దేశీయంగా వాహనాల సంఖ్య ఇటీవల భారీ స్థాయికి పెరగడం మరో కారణం. మరోవైపు ప్రజారవాణా ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరించకపోవడంతో ప్రైవేట్‌ వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో డిమాండ్‌ పెరిగి ఇంధనానికి గిరాకీ పుంజుకుంది.

సరఫరా-గిరాకీ మధ్య వ్యత్యాసం..

గిరాకీకి తగ్గట్లుగా చమురు సరఫరా లేనప్పుడు సహజంగానే ధరలు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయ చమురు శుద్ధి సంస్థలకు ఉత్పత్తి ఖర్చు భారంగా మారుతోంది. దీంతో గిరాకీకి తగ్గట్లుగా కొనుగోలు చేయలేకపోతున్నాయి.

పన్నులు...

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో గత ఏడాది జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రమంగా ఒక్కో దేశంలో లాక్‌డౌన్ విధిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మార్చి నాటికి పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజారవాణా పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పూర్తిగా పడిపోయాయి. దీన్ని ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం అవకాశంగా భావించింది. లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ. 19.98 నుంచి 32.98కి.. డీజిల్‌పై రూ.15.83 నుంచి 31.83కు పెంచింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నా.. ఈ సుంకాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. దీనికితోడు లాక్‌డౌన్‌తో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాలూ విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను పెంచాయి. దీంతో ప్రపంచ విపణిలో ధరలు పెరిగినప్పుడల్లా దేశంలో పెట్రో ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో లీటరో పెట్రోల్‌పై వినియోగదారుడు చెల్లిస్తున్న సొమ్ములో దాదాపు 63 శాతం పన్నులే కావడం గమనార్హం.

సామాన్యుడికే సమస్య...

చమురు ధరలు పెరుగుతున్న కొద్దీ రవాణా ఛార్జీలూ ఎగబాకుతాయి. దీంతో నిత్యావసర ధరల ఆకాశన్నంటే ప్రమాదం ఉంది. ఇది గిరాకీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇది అటు పారిశ్రామిక రంగంతో పాటు, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ సుంకం, ఇటు రాష్ట్రాలు పెంచిన వ్యాట్‌ను సవరించి సామాన్యులకు ఊరట కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

ఇవీ చదవండి...

విమాన ప్రయాణం మరింత భారం

వరుసగా నాలుగో రోజూ పెట్రో మంట!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని