close

Updated : 16/04/2021 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటి రుణం తీర్చేస్తే మంచిదేనా?

మా అమ్మాయి వయసు రెండేళ్లు. తన పేరుతో బీమా పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నాను. దీంతోపాటు నెలకు రూ.5,000 మదుపు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఏం చేయలి? - తిరుపతి
 మీ అమ్మాయి పేరుతో ప్రత్యేక బీమా పాలసీ తీసుకునే బదులు .. తన భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలకు రక్షణ కల్పించేందుకు మీ పేరుపై టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.5వేలలో.. రూ.2,000 సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా రూ.3,000 క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ డైవర్సిఫైడ్‌ పథకాల్లో మదుపు చేయండి. ఇలా చేయడం వల్ల మీ పెట్టుబడిపైన సగటున 10-11 శాతం రాబడి వచ్చే వీలుంది.

> నా వయసు 23 ఏళ్లు. మరో నాలుగేళ్ల తర్వాత వివాహం చేసుకుంటాను. అప్పటి వరకూ నా దగ్గర కనీసం రూ.5 లక్షలు ఉండాలని అనుకుంటున్నాను. దీనికోసం నేను ఇప్పటి నుంచి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి. నా జీతం రూ.16వేలు. నాకు టర్మ్‌ పాలసీని ఇస్తారా? - హరీశ్‌
మీకు నాలుగేళ్ల సమయమే ఉంది కాబట్టి, మీ పెట్టుబడిపైన ఎటువంటి నష్టభయం ఉండకుండా చూసుకోవాలి. మీ డబ్బు సురక్షితంగా ఉంటూ.. నాలుగేళ్లలో రూ.5లక్షలు కావాలంటే.. బ్యాంకు రికరింగ్‌ డిపాజిటే మేలు. దీనికోసం మీరు నెలకు దాదాపు రూ.9,600 జమ చేస్తే.. 5.5శాతం రాబడితో మీరు అనుకున్న మొత్తం జమ అవుతుంది. మీపైన ఆధారపడిన వారు ఉంటే.. టర్మ్‌ పాలసీ తీసుకోండి. మీ ఆదాయాన్ని బట్టి.. దాదాపు రూ.25లక్షల వరకూ టర్మ్‌ పాలసీ రావచ్చు.

> నేను నెలకు రూ.8,000 మదుపు చేద్దామనుకుంటున్నాను. కనీసం 15 ఏళ్లకు పైగానే కొనసాగిస్తాను. నా ఆదాయాన్ని బట్టి, ఏటా కొంత పెట్టుబడి పెంచుకుంటూ వెళ్తాను. నాకు కనీసం 12-14 శాతం రాబడి వచ్చేలా నా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి? - మూర్తి
సాధారణంగా పెట్టుబడిపైన మంచి రాబడి రావాలంటే.. ఏడు నుంచి పదేళ్ల సమయం ఉండాలి. మీరు 15 ఏళ్లు అంటున్నారు కాబట్టి, మీ పెట్టుబడి వృద్ధి చెందేందుకు మంచి అవకాశాలుంటాయి. మీకు 12-14 శాతం రాబడి రావాలంటే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లే ఉత్తమం. వీటిలో సగటును 13శాతం వార్షిక రాబడిని ఆశించవచ్చు. మీరు నెలకు రూ.8వేలను, 13శాతం రాబడి అంచనాతో 15 ఏళ్లపాటు మదుపు చేస్తే దాదాపు రూ.38,80,000 అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళ్లారనుకుందాం.. అప్పుడు ఈ మొత్తం సుమారు రూ.66,46,000 జమ అయ్యే అవకాశముంది.

> నేను రూ.35 లక్షల ఇంటి రుణం తీసుకున్నాను. దీనికి నెలకు రూ.31,500 వరకూ చెల్లిస్తున్నాను. ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి, అసలులో కొంత మొత్తం చెల్లించుకుంటూ వెళ్తే త్వరగా అప్పు తీరుతుంది అంటున్నారు. నిజమేనా? దానికన్నా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే లాభం ఉంటుందా? - సందీప్‌
ప్రస్తుతం గృహ రుణాలపైన వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు గృహరుణాన్ని తొందరగా తీర్చేందుకు ప్రయత్నించాలి. వడ్డీ రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. కాబట్టి, ఇంటి రుణానికి అదనంగా చెల్లించాలనుకుంటున్న మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. ఇలా ఏడేళ్లు గడిచాక.. ఫండ్లలో వచ్చిన మొత్తంతో గృహరుణాన్ని తీర్చేయండి. 

> నా దగ్గర రూ.2లక్షలు ఉన్నాయి. మరో 6-7 ఏళ్ల వరకూ ఈ డబ్బుతో నాకు పనిలేదు. మా బాబు వయసు వయసు 12 ఏళ్లు. అతను డిగ్రీ వచ్చే నాటికి ఈ డబ్బును వెనక్కి తీసుకుంటాను. మంచి రాబడితో, సురక్షితంగా ఉండాలంటే.. ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎంత అయ్యే అవకాశం ఉంది? - రవీంద్ర
మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటూ.. మంచి రాబడి రావాలంటే కష్టమే. మీకు ఆరేడేళ్ల సమయం మాత్రమే ఉంది కాబట్టి, పోస్టాఫీసులో కిసాన్‌ వికాస్‌ పత్రాల్లో పెట్టుబడి పెట్టండి. ప్రస్తుతం దీనిపై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. మీ డబ్బు పదేళ్ల నాలుగు నెలలకు రెట్టింపు అవుతుంది. రెండున్నర ఏళ్ల తర్వాత ఎప్పుడైనా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. రూ.2లక్షలను ఏడేళ్లపాటు కొనసాగిస్తే.. రూ.,319,000 వస్తాయి. 

* ఆర్థిక విషయాల్లో మీకున్న సందేహాలను siri@eenadu.net కు పంపించండి. 

- తుమ్మ బాల్‌రాజ్‌

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని