విరబూసిన విప్రో - Wipro 4th Quarter results
close

Updated : 16/04/2021 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విరబూసిన విప్రో

దశాబ్దంలోనే అత్యుత్తమ నాలుగో త్రైమాసిక ఫలితాలు
జనవరి- మార్చిలో 27.7% పెరిగిన నికర లాభం
ఆదాయంలో 3.4 శాతం వృద్ధి
దిల్లీ

‘కాంట్రాక్టులు చేజిక్కించుకోవడం, ఆదాయం-నిర్వహణ మార్జిన్ల పరంగా వరుసగా మూడో త్రైమాసికంలోనూ మెరుగైన పనితీరు కనబర్చాం. డిసెంబరు త్రైమాసికానికి మించి బలమైన వృద్ధి నమోదుచేశాం. దశాబ్దకాలంలోనే మాకు ఇవి అత్యుత్తమ నాలుగో త్రైమాసిక ఫలితాలు. అమ్మకాల్లో వృద్ధే ఇందుకు దోహదం చేసింది. ఈ ఉత్సాహంతో మున్ముందు మరింతగా రాణిస్తాం. ఆర్డర్లు, డిమాండుపరంగా ప్రస్తుతం మాకు సానుకూల పరిస్థితులే ఉన్నాయి. రూ.9,500 కోట్లను మా వాటాదార్లకు ఇవ్వడం ద్వారా బైబ్యాక్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాం’

 - థియరీ డెలాపోర్ట్‌, సీఈఓ, ఎండీ, విప్రో

విప్రో అదరగొట్టింది. జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నికర లాభంలో 27.7 శాతం వృద్ధిని ప్రకటించింది. 2020 ఇదే త్రైమాసికంలో రూ.2,326.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఈ ఐటీ దిగ్గజం.. ఈసారి రూ.2,972 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.15,711 కోట్ల నుంచి 3.4 శాతం పెరిగి రూ.16,245.40 కోట్లు నమోదైంది. రాబోయే త్రైమాసికంలోనూ ఆదాయంలో బలమైన వృద్ధి కొనసాగుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఐటీ సేవల విభాగం జనవరి- మార్చిలో 2,152.40 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదుచేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఈ విభాగ ఆదాయం 3.9 శాతం మేర పెరిగింది. ఏప్రిల్‌- జూన్‌లో ఐటీ సేవల విభాగ ఆదాయం 2,195- 2,238 మిలియన్‌ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని, జనవరి- మార్చితో పోలిస్తే 2-4 శాతం పెరగొచ్చని కంపెనీ అంచనా వేసింది. ఫలితాలకు సంబంధించి మరికొన్ని వివరాలు ఇలా..
* గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో మొత్తం కాంట్రాక్టు విలువ (టీసీవీ) వార్షిక ప్రాతిపదికన 33 శాతం పెరిగిందని విప్రో వెల్లడించింది. ఇప్పటివరకు విప్రో చరిత్రలోనే అత్యధిక టీసీవీ ఇదేనని పేర్కొంది.
* విప్రో మొత్తం 12 పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంది. దీంతో టీసీవీ 1.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. 100 మిలియన్‌ డాలర్ల కేటగిరిలో ఒకటి, 75 మిలియన్‌ డాలర్ల విభాగంలో మూడు, 50 మి.డాలర్ల విభాగంలో మూడు కాంట్రాక్టులు లభించాయి.
* మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2020-21) నికర లాభం 11 శాతం పెరిగి రూ.10,796.40 కోట్లకు, ఆదాయం 1.5 శాతం వృద్ధితో రూ.61,943 కోట్లకు చేరింది. 2019-20లో  లాభం, ఆదాయాలు వరుసగా  రూ.9,722.30 కోట్లు; రూ.61,023.20 కోట్లుగా నమోదైంది. ఐటీ సేవల  విభాగ ఆదాయం 1.4 శాతం తగ్గి 8,136.5 మిలియన్‌ డాలర్లకు పరిమితమైంది.
* నిర్వహణ మార్జిన్లపై వేతనాల పెంపు ప్రభావం ఉంది. అయినా కూడా ఏడాది క్రితంతో పోలిస్తే 340 బేసిస్‌ పాయింట్ల మేర నిర్వహణ మార్జిన్‌ పెరిగినట్లు కంపెనీ తెలిపింది. 2021 జనవరి 1 నుంచి వర్తించేలా 80 శాతం మంది ఉద్యోగులకు వేతన పెంపు, పదోన్నతులు ప్రకటించామని తెలిపింది. మిగిలిన ఉన్నతోద్యోగులకు జూన్‌ నుంచి వేతన పెంపు అమలు చేస్తామని పేర్కొంది.
* 2021 మార్చి చివరినాటికి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1,97,712కి చేరింది. వలసల రేటు 12.1 శాతంగా ఉంది.
* జనవరిలో ప్రకటించిన రూ.1 మధ్యంతర డివిడెండునే తుది డివిడెండుగా పరిగణించాలని కంపెనీ పేర్కొంది.
* ఐటీ ఉత్పత్తుల విభాగ ఆదాయం సమీక్షా త్రైమాసికంలో రూ.210 కోట్లు గాను, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.770 కోట్లుగాను నమోదైంది. ప్రభుత్వ సంస్థల నుంచి ఆదాయం ఆదాయం జనవరి-మార్చిలో రూ.230 కోట్లు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.890 కోట్లుగా నమోదైంది.
బీఎస్‌ఈలో గురువారం విప్రో షేరు 2.95% లాభంతో రూ.431 వద్ద ముగిసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని