ZEE: ‘జీ’ అత్యవసర బోర్డు సమావేశానికి వాటాదారుల డిమాండ్‌? - ZEE key shareholders asks to remove Punit Goeka as CEO Says reports
close

Published : 27/09/2021 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ZEE: ‘జీ’ అత్యవసర బోర్డు సమావేశానికి వాటాదారుల డిమాండ్‌?

దిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రధాన వాటాదారులైన ఇన్వెస్కో, ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా అత్యవసర బోర్డు సమావేశానికి పిలుపునిచ్చినట్లు సమాచారం. సీఈఓ పునీత్‌ గోయెంకాను ఆ పదవి నుంచి తప్పించాల్సిందేనని వారు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబరు 23న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు లేఖ రాసినట్లు ఓ ప్రధాన వాణిజ్య పత్రిక పేర్కొంది. మూడు వారాల్లోగా సమావేశం నిర్వహించకుంటే కోర్టుకు వెళ్లే యోచనలో వాటాదార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్‌ ఇండియా మధ్య ఇటీవల విలీన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు పునీత్‌ గోయెంకానే సీఈఓగా కొనసాగనున్నారు. అలాగే బోర్డులో మెజారిటీ డైరెక్టర్లను సోనీ ఎంపిక చేస్తుంది. గోయెంకాను ఆ స్థానం నుంచి తొలగించాలన్న ఒత్తిడి నుంచి ఈ ఒప్పందం ద్వారా ఉపశమనం లభిస్తుందని జీ భావించినట్లు తెలుస్తోంది. కానీ, గోయెంకా తొలగింపు విషయంలో ప్రధాన వాటాదార్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని సమాచారం. కంపెనీలో కీలక నిర్ణయాల్లో జరిగిన తప్పిదమే ఒప్పందానికి దారి తీసిందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

జీ, సోనీ మధ్య ఒప్పందం ఖరారు కావడానికి ముందే గోయెంకా సహా మరో ఇద్దరు డైరెక్టర్లను పదవుల నుంచి తొలగించాలని కోరుతూ ఇన్వెస్కో, ఓఎఫ్‌ఐ గ్లోబల్‌.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఒప్పందం విషయం ప్రకటించారు. అయితే, తాజా పరిణామాలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈరోజు షేరు ధర ఓ దశలో 1.30 శాతం ఎగబాకింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని