Auto news: భారతీయుల టేస్టు మారుతోంది..! - automatic transmission car sales rise
close

Updated : 30/06/2021 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Auto news: భారతీయుల టేస్టు మారుతోంది..!

 క్రమంగా ఆటో ట్రాన్స్‌మిషన్‌ దిశగా వాహనాలు 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కార్ల విషయంలో భారతీయుల అభిరుచి మెల్లగా మారుతోంది. క్రమంగా ఆటో ట్రాన్స్‌మిషన్‌ వైపు వినియోగదారులు మొగ్గుతున్నారు. 2019లో భారత్‌లో అమ్ముడైన కార్లలో 17.3 శాతం ఆటో ట్రాన్స్‌మిషన్‌వే కావడం విశేషం.  2011లో వీటి వాటా కేవలం 1.4 శాతం మాత్రమే. గేర్లు మార్చే పని తప్పడంతో కేవలం రోడ్డుపై దృష్టి పెట్టవచ్చనే ఉద్దేశంతో ఈ వైపు మొగ్గుతున్నారు. అంతేకాకుండా.. ఆటోమేటిక్‌ గేర్‌ షిఫ్టింగ్‌ టెక్నాలజీ ప్రతి ఏటా మెరుగుపడుతూ వస్తోంది.  మరింత సులభంగా, సమర్థంగా పనిచేస్తోంది. గతంలో ఖరీదైన మోడళ్లు మాత్రమే ఆటోమేటిక్‌ గేర్లను ఇచ్చేవి. కానీ, ఇప్పుడు ధరలు తగ్గాయి. చిన్న కార్లు కూడా ఆటోమేటిక్‌ గేర్లను ఇస్తున్నాయి. అంతేకాదు డీజిల్‌ ఇంజిన్‌ కార్లలో కూడా ఈ వ్యవస్థలు వస్తున్నాయి. దీంతో ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన ఫీచర్‌గా ఉన్న ఈ వ్యవస్థ ఇప్పుడు సాధారణమైపోతోంది.

ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటే..?

క్లచ్‌ పెడల్‌ లేకుండా తరచూ చేతితో గేర్లు మార్చకుండా ప్రయాణించేలా ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీనిని డ్యూయల్‌ పెడల్‌ టెక్నాలజీ, సెల్ఫ్‌ షిఫ్టింగ్‌ ట్రాన్స్‌మిషన్‌ అంటారు. ఈ వ్యవస్థలో కంప్యూటర్‌ చిప్‌లు ఆటోమేటిక్‌గా వేగాన్ని బట్టి గేర్లను మార్చేస్తుంటాయి. పట్టణాల్లో బంపర్‌ టు బంపర్‌ డ్రైవింగ్‌ సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.  ఆటో ట్రాన్స్‌మిషన్‌లో విభిన్నమైన టెక్నాలజీలు ఉన్నాయి. అన్ని కంపెనీలు ఒకే టెక్నాలజీని వాడవు.  ఆటో ట్రాన్స్‌మిషన్‌ (ఏటీ),ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ), కంటిన్యూయస్లీ వేరియబుల్‌ ట్రాన్స్‌మిషన్‌ (సీవీటీ), డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ (డీసీటీ), డైరెక్ట్‌ షిఫ్ట్‌ ట్రాన్స్‌మిషన్‌ (డీఎస్‌జీ), టిప్ట్రానిక్‌ ట్రాన్స్‌మిషన్‌.. ఇలా పలు రకాలు ఉన్నాయి.

అమెరికాలో కనుమరుగు..

మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో క్రమంగా కనుమరుగవుతోంది. 2020 నాటికి అమెరికాలో విక్రయించే 327 మోడళ్ల కార్లలో కేవలం 41 మోడళ్లు మాత్రమే మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ను అందించాయి. అంటే ఇది 13 శాతానికి సమానం. అదే 2011లో మూడోవంతుకు పైగా మోడళ్లలో మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ ఉండేది.

విద్యుత్తు కార్లు వస్తే..

భవిష్యత్తులో విద్యుత్తు కార్లు వస్తే వాటికి ఇంజిన్లు ఉండవు. దీంతో మల్టీగేర్‌ అవసరం ఉండదు. టెస్లా కార్లే దీనికి ఉదాహరణ. ప్రస్తుతానికి ఈ మార్కెట్‌ భారత్‌లో తక్కువగానే ఉంది. కానీ, ప్రభుత్వం విద్యుత్తు కార్లను ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతోంది. 2030 నాటికి భారత్‌లో చాలా వరకు విద్యుత్తు కార్లు వచ్చే అవకాశం ఉంది.

‘ఆటో’ వైపు మొగ్గుతున్న వినియోగదారులు..

దేశీయ అతిపెద్ద కార్ల విక్రేత మారుతీ సుజుకీ కార్ల మోడళ్లలో  దాదాపు 30 శాతం వరకు ఆటోమేటిక్‌వి అమ్ముడుపోతున్నాయి. హ్యుందాయ్‌ 2014లో 3.9శాతం ఆటోమేటిక్‌ వాహనాలు విక్రయిస్తే.. 2019నాటికి అది 13.9శాతానికి పెరిగింది. ఇక టాటామోటార్స్‌ విక్రయాల్లో దాదాపు 14శాతం వరకు ఈ రకమైన కార్లే ఉంటున్నాయి. కియా మోటార్స్‌ కార్లలో కూడా మూడో వంతు ఇవే ఉంటున్నాయి. మన దేశంలో ముఖ్యంగా ఎంట్రీ సెగ్మెంట్ల కార్లలో కూడా ఆటోమేటిక్‌ ఫీచర్‌ తీసుకురావడం ఈ విక్రయాలు పెరగడానికి  ఒక కారణం. జూన్‌ నాటికి భారత్‌లో విక్రయించే కార్లలో 177 మోడళ్లు ఆటోమేటిక్‌వి ఉన్నాయి.

భారత్‌లో చౌకగా లభించే 5 ఆటోమేటిక్‌ కార్లు..

* క్విడ్‌: రెనో కంపెనీ తయారు చేస్తున్న క్విడ్‌ కారు టాప్‌ మోడల్‌ ధర రూ.5.48 లక్షలుగా ఉంది. ఈ కారు దాదాపు 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

* శాంత్రో: హ్యూందాయ్‌ శాంత్రో కారు ధర రూ.6.41లక్షలుగా ఉంది. 5 స్పీడ్‌ ఏఎంటీని వినియోగించారు. 20.3 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది.

* రైడ్‌-గో: డాట్సన్‌ రైడ్‌-గో టాప్‌ఎండ్‌ ధర రూ.4.95లక్షలు. 999 సీసీ ఇంజిన్‌ ఉన్న ఈ కారు 22 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

* ఎస్‌ ప్రెస్సో: మారుతీ ఎస్‌ప్రెస్సో టాప్‌ మోడల్‌ ధర రూ.5.06 లక్షలుగా ఉంది. ఇది సగటున 21.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిలో 998 సీసీ ఇంజిన్‌ అమర్చారు.

* టియాగో: టాటా టియాగో కారు టాప్‌ మోడల్‌ ధర రూ.6.95 లక్షలుగా ఉంది. 23.84 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని