ఉత్త‌మ మెట‌ర్నిటీ బీమా ప్లాన్స్‌ ఇవే! - best-insurance-plans-for-maternity
close

Published : 26/12/2020 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉత్త‌మ మెట‌ర్నిటీ బీమా ప్లాన్స్‌ ఇవే!

ఆరోగ్యం మ‌హాభాగ్యం అన్న విష‌యం తెలిసిందే. ఆరోగ్యంగా లేక‌పోతే ఏమీ సాధించ‌లేమ‌న్నది య‌దార్థం. కానీ రోజురోజుకి కొత్త ర‌క‌మైన వ్యాధులు ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఆరోగ్య బీమా పాల‌సీలు కొంత మేర‌కు తోడ్ప‌డ‌తాయి. ఇప్పుడు ప్ర‌తిదానికి బీమా ఉంద‌న్న విష‌యం తెలిసిందే. అది ప్ర‌మాదాక‌ర‌మైన వ్యాధి అయినా, సాధ‌ర‌ణంగా వ‌చ్చేది అయినా, వృద్ధాప్యం, క్యాన్స‌ర్ వంటి అన్నింటికీ బీమా పాల‌సీలు అందుబాటులోకి వ‌చ్చాయి. దీనికి తగిన‌ట్లుగా బీమా పాల‌సీలు ఎంచుకుంటారు. కానీ స్ర్తీ జీవితంలో అతి క్లిష్ట‌మైన ద‌శ గ‌ర్భం దాల్చ‌డం. దీనికి కూడా బీమా పాల‌సీ ఉంద‌న్న విష‌యం మీకు తెలుసా? తెలిస్తే అది ఎంత‌వ‌ర‌కు ప్ర‌యెజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని ఆలోచించారా? పెరుగుతున్న ఖర్చుల‌తో పిల్ల‌ల సంర‌క్ష‌ణ ఎంత ఖ‌ర్చుతో కూడుకున్న‌దో తెలిసిందే. మీరు ఆర్థికంగా దీనికి సిద్ధంగా ఉన్నారా? ఈ మెట‌ర్నిటీ పాల‌సీ తీసుకుంటే ఏం ప్ర‌యోజ‌నాలు ఉంటాయో, ఎంత‌వ‌ర‌కు మీకు స‌హాయ‌ప‌డుతుందో చూద్దాం.

ఆరోగ్య బీమాలో ఉండ‌గా మ‌ళ్లీ ప్ర‌త్యేకంగా ఎందుకు?

కొన్ని ఆరోగ్య బీమా పాల‌సీలు మెట‌ర్నిటీ క‌వ‌ర్‌ను కూడా అందిస్తున్నాయి. అయితే ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం ఏంటంటే ఆరోగ్య బీమా పాల‌సీల‌తో క‌లిపి తీసుకునే మెట‌ర్నిటీ క‌వ‌ర్ కంటే ప్ర‌త్యేకంగా తీసుకునే మెట‌ర్నిటీ కోసం తీసుకునే పాల‌సీలో ప్ర‌యోజ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆరోగ్య బీమా పాల‌సీలో ఉన్న‌ మెట‌ర్నిటీ ప్లాన్‌లో స‌మ‌యానికి న‌గ‌దు చేతికంద‌దు. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. కాల‌ప‌రిమితి ముగిశాక డ‌బ్బులు చేతికందుతాయి. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు న‌గ‌దు అందిపుచ్చుకోని పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల‌న అంత‌గా ఉప‌యోగం ఉండ‌ద‌నేది ఆర్థిక స‌ల‌హాదారుల మాట‌. ప్ర‌త్యేకంగా తీసుకునే మెట‌ర్నిటీ పాల‌సీలో స‌మ‌యానికి డ‌బ్బు చేతికంద‌డంతో పాటు చాలా వ‌ర‌కు ప్ర‌సవ ఖ‌ర్చుల‌ను బీమా సంస్థ భ‌రిస్తుంది.

ఎందుకు తీసుకోవాలి?

మెట‌ర్నిటీ పాల‌సీలోకి సాధార‌ణ ప్ర‌స‌వం లేదా సిజేరియన్ రెండూ వ‌స్తాయి. దేశంలో చాలా కంప‌నీలు ప్ర‌త్యేకంగా మెట‌ర్నిటీ ప్లాన్ల‌ను అందిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ్యాక్స్ బూపా, అపోలో మునిచ్‌, రాయ‌ల్ సుంద‌ర‌మ్‌, సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి. ఆరోగ్య బీమా పాల‌సీలు ఎంచుకునేట‌ప్పుడు పాల‌సీలో ఉండే నియ‌మాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. భ‌విష్య‌త్తులో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాలి. దీనికోసం మీరు బీమా కంపెనీని కూడా సంప్ర‌దిస్తే మంచిది. ఎప్పుడైనా ఆన్‌లైన్ ద్వారా పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిద‌నేది నిపుణుల సూచ‌న‌. ఇది స‌మ‌యాభావాన్ని త‌గ్గించ‌డ‌మే కాకుండా మీ డ‌బ్బు కూడా ఆదా చేస్తుంది, ఎందుకంటే ఆన్‌లైన్ లో ప్రీమియంలు తక్కువ. ఆన్‌లైన్ పాల‌సీని ఎంచుకోవ‌డం ద్వారా ఇత‌ర ప్లాన్ల‌ను పోల్చి చూసుకొని, అందులో మంచిదాన్నే ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా స‌ల‌హాలు కావాల‌నుకుంటే క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

మెట‌ర్నిటీ ప్లాన్‌లోకి వ‌చ్చేవి…

ఆస్ప‌త్రిలో చేరిన‌ప్పుడు - ప్ర‌స‌వానికి ముందు 30 రోజుల నుంచి ప్ర‌స‌వం త‌ర్వాత 60 రోజుల వ‌ర‌కు ఖ‌ర్చులు పాల‌సీ ప‌రిదిలోకి వ‌స్తాయి.

ప్ర‌సవం స‌మ‌యంలో…

మెట‌ర్నిటీ ప్లాన్‌లో సాధార‌ణ ప్ర‌సవం లేదా సిజేరియ‌న్ ఖ‌ర్చులు కూడా భ‌రిస్తుంది. ఇంకా ఏమైనా అద‌న‌పు ఖ‌ర్చులు ఉంటే అవి కూడా పాల‌సీ క‌వ‌ర్‌లోకి వ‌స్తాయి.

ఆసుపత్రి వ్య‌యాలు:

హాస్పిట‌ల్ లో చేరిన‌ప్ప‌టి నుంచి అంబులెన్స్ ఛార్జీలు, గ‌ది అద్దె, డాక్ట‌ర్ ఫీజులు, న‌ర్స్ ఛార్జీలు, మ‌త్తు ఔష‌ధాల‌కు సంబంధించిన ఛార్జీలు కంపెనీ చెల్లిస్తుంది. ఒక‌వేళ మీరు క‌న్స‌ల్టెంట్‌, ఆరోగ్య స‌ల‌హాదారు లేదా నిపుణులను సంప్ర‌దించాల్సి వ‌స్తే ఆ ఖ‌ర్చుల‌ను కూడా కంపెనీ చూసుకుంటుంది.

శిశువు కోసం:

శిశువు ఏదైనా లోపంతో కానీ,వ్యాధితో కానీ జ‌న్మిస్తే 90 రోజుల వ‌రకు శిశువు చికిత్స‌కు కావ‌ల‌సిన ఖ‌ర్చులు కంపెనీ బీమా పాల‌సీ ప‌రిధిలోకి వ‌స్తాయి.

కాబోయే త‌ల్లిదండ్రులు ఆశించే విధంగా ఉత్త‌మ ఆరోగ్య బీమా పాల‌సీలు:

దేశంలో ఉద్యోగం, వ్యాపారం చేసే మ‌హిళ‌లు రోజు రోజుకు పెరుగుతున్నారు. దీనికి అనుగుణంగా కంపెనీలు కూడా మ‌హిళా ఉద్యోగుల ప్ర‌యోజ‌నాల కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మ‌హిళా ఉద్యోగుల‌కు సంస్థ‌లు మెట‌ర్నిటీ బీమా పాల‌సీల‌ను అందిస్తున్నాయి.

మీరు ఎంచుకోదగ్గ నాలుగు మెట‌ర్నిటీ ప్లాన్స్

మ్యాక్స్ బూపా హార్ట్‌బీట్ ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ప్లాన్:

ఈ ప్లాన్ మూడు ర‌కాల క‌వ‌ర్‌ను క‌లిగి ఉంటుంది. అవి సిల్వ‌ర్, గోల్డ్, ప్లాటినం. ఈ ప్లాన్‌లో మొద‌టి సంవత్స‌రంలో ఛార్జీలు, వ్యాక్సినేష‌న్లు వంటివి వ‌స్తాయి. రెండు ప్ర‌స‌వాల వ‌ర‌కు ఈ ప్లాన్ వ‌ర్తిస్తుంది.

స్టార్ హెల్త్ వెడ్డింగ్ గిఫ్ట్ ప్రెగ్నెన్సీ క‌వ‌ర్:

ఈ ప్లాన్‌లో రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు హామీ ఉంటుంది. రెండు ప్ర‌స‌వాల వ‌ర‌కు ఈ పాల‌సీ ఉంటుంది. సాధార‌ణ లేదా ఆప‌రేష‌న్ ద్వారా జ‌రిగిన ప్ర‌స‌వాల‌కు, ప్ర‌స‌వం ముందు త‌ర్వాత అయ్యే ఖ‌ర్చులు ఈ పాల‌సీ ప‌రిధిలోకి వ‌స్తాయి.

సిగ్నా టీటీకే ప్రో-హెల్త్ ప్ల‌స్ ప్లాన్:

ఈ ప్లాన్‌లో ప్ర‌స‌వ ఖ‌ర్చులు, అప్పుడే పుట్టిన శిశువుకి వ‌చ్చే వ్యాక్సినేష‌న్ వంటి ఖ‌ర్చులు ఉంటాయి. వెయిటింగ్ పీరియ‌డ్ 48 నెల‌లు. ఈ పాల‌సీలో కాల‌ప‌రిమితి పూర్తైన త‌ర్వాత డ‌బ్బు అందించ‌బ‌డుతుంది.

రాయ‌ల్ సుంద‌రం మాస్ట‌ర్ ప్రోడ‌క్ట్‌:

ఈ పాల‌సీలో రూ.30,000 నుంచి రూ.50,000 వ‌ర‌కు క‌వ‌రేజ్ ఉంటుంది. ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టినుంచి ప్ర‌స‌వానికి ముందు, త‌ర్వాత అయ్యే ఖ‌ర్చులు, ప్ర‌స‌వ స‌మ‌యంలో ఏదైనా ఇబ్బందులు ఏర్ప‌డితే, శిశువు పుట్టిన త‌ర్వాత ఏమైనా స‌మ‌స్య‌లు ఎదురైతే కంపెనీ బీమా సంస్థ హామీ ఉంటుంది. ఈ పాల‌సీలు వెయిటింగ్ పీరియ‌డ్ 3 సంవ‌త్స‌రాలు.

చివ‌రిగా గుర్తుంచుకోవాల్సిన‌విష‌యం ఏంటంటే గ‌ర్భం దాల్చిన త‌ర్వాత మెట‌ర్నిటీ బీమా పాల‌సీని తీసుకుంటే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండదు. ఎందుకంటే కొన్ని బీమా కంపెనీలు కాల‌ప‌రిమితిలో కూడిన హామీని అందిస్తాయి. కాబ‌ట్టి ముందుగానే ప్ర‌ణాళిక ప్ర‌కారం మెట‌ర్నిటీ ప్లాన్ తీసుకుంటే చాలా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే పాల‌సీని ఎంచుకునే ముందు ఆన్‌లైన్‌లో ఒక‌టికి రెండు సార్లు ఇత‌ర పాల‌సీలతో పోల్చి మీకు ఏది ఉత్త‌మంగా అనిపిస్తే దానిని ఎంచుకోవ‌డం మంచిది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని