బడ్జెట్‌.. నిర్మలమ్మ ముందు సవాళ్లెన్నో.. - budget 2021-22 challenges
close

Updated : 01/02/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌.. నిర్మలమ్మ ముందు సవాళ్లెన్నో..

ఇంటర్నెట్‌డెస్క్‌: నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటికి నెలకు సరిపడా బడ్జెట్‌ వేయాలంటే వంద లెక్కలు వేస్తాం. అలాంటిది దాదాపు 130కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి బడ్జెట్‌ అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పుడు యావత్‌ భారతదేశంతో పాటు, ప్రపంచదేశాలు సైతం ఫిబ్రవరి 1వ తేదీ అయిన నేటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకూ ఆమె రెండు సార్లు పద్దుల చిట్టాను ప్రజల ముందుంచారు. ఆర్థిక మంత్రిగా ఆమె ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్‌ ఇది. గత రెండు బడ్జెట్‌లతో పోలిస్తే, ఇది ఎంతో ప్రత్యేకమైంది. కరోనా కారణంగా చితికిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు నిర్మలమ్మ ఏ విధంగా ఊపిరిలూదుతారనేది సర్వత్రా ఆసక్తికరం.

గతంలో ఏ దేశం.. ఏ ప్రభుత్వం ఎదుర్కోని వింత పరిస్థితిని ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది. దీని కారణం కరోనా వైరస్‌. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రభుత్వ ఆదాయాలతో పాటు, ప్రజల ఆదాయాలు కూడా గణనీయంగా పడిపోయాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్‌ 2021-22కు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ముందున్న సవాళ్లు ఏంటి? ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయి? జన సామాన్య బడ్జెట్‌ను ప్రవేశపెడతారా?

ఆర్థిక మంత్రి ముందున్న సవాళ్లు ఏంటి?

* కరోనా వల్ల ప్రపంచ అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలు సైతం కుదుపునకు లోనయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా అటు ప్రభుత్వ, ఇటు ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు అనువుగా ఉండేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దడం అసలైన సవాల్‌.

* ప్రజల చేతిలో నగదు మిగిలేలా చర్యలు తీర్చిదిద్దాల్సి ఉంటుంది.  ఇందుకు ఒకటి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టం ద్వారా ఉపాధి కల్పించడం.. తద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం. అదేవిధంగా మధ్యతరగతి భారతానికి ఊరట కలిగించేలా పన్నుల్లో రాయితీ ఇవ్వడం.

* పన్నుల్లో రాయితీ అంటే అందరూ అనుకునే ఆదాయపు పన్ను వర్గాలను దృష్టి పెట్టుకునే చేసే పన్ను సవరణలు మాత్రమే కాదు. వివిధ వస్తువులపై విధంచే జీఎస్‌టీని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. మధ్యతరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిలో మార్పులు చేయాలి.

* ప్రభుత్వ ఆదాయానికీ, ఖర్చులకు అంతరం బాగా పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త ఆదాయా మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్థికమంత్రి ముందున్న అతిపెద్ద సవాల్‌ ఇది.

* ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే, భారత్‌ ఎప్పుడూ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండేది. కరోనాతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ప్రస్తుతం కల్పించాల్సి ఉంది.

* దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే పరిశ్రమలు, సేవా రంగాలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయా? అని ఎదురుచూస్తున్నారంతా? కరోనా కారణంగా కుదేలైన ఈ రంగాలను పట్టాలెక్కించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందన్న ఆసక్తి నెలకొంది. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రోత్సాహాకాలు లభిస్తాయన్నది ప్రధానాంశంగా మారింది. దీంతో పాటు, ఆరేళ్ల కనిష్ఠానికి చేరుకున్న వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థిక మంత్రి ఈ కీలక రంగాల్లో ఎలాంటి సంస్కరణలు, ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తారన్నది కీలకం.

* ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ద్రవ్యోల్బణం నియంత్రించాలని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయి. ఇందుకు సంస్కరణలు తీసుకురావాలని, నిర్దిష్ట స్థాయికి మించి ద్రవ్యోల్బణం పెరగకుండా చూసే వ్యవస్థ తేవాలని కోరుతున్నారు ఆర్థిక నిపుణులు. నిత్యావసర ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయగలిగితే సామాన్యులకు మేలు చేకూరడంతో చిన్న వ్యాపారాలకు అతిపెద్ద ప్రోత్సాహం అందుతుంది.

* దేశీయ ఎగుమతుల్లో 40శాతానికి పైగా వాటా ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగానికి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చాలని అంటున్నారు చిన్న వ్యాపార వేత్తలు. ద్రవ్య లభ్యత పెంపు, రుణ సదుపాయాలకు మరింత మెరుగు పరిచి త్వరిత గతిన పెట్టుబడులకు డబ్బు సమకూరే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

* జీఎస్‌టీ వల్ల చిన్న వ్యాపారులకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకు రేట్లను సరళీకరించడంతో పాటు, పన్ను దాఖలు చేయడాన్ని మరింత సులభతరం చేయాలని అంటున్నారు.

* కరోనా కారణంగా కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దానిని గాడిన పెట్టేందుకు అనేక చర్యలు తీసుకున్నా, ఇంకా ఎన్నో సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు బడ్జెట్‌లో ఉపశమన చర్యలు అవసరంమని రియల్టర్లు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ నిర్మాణపథకాలను మరి కొంత కాలం పొడిగించడంతో పాటు, గృహ కొనుగోలు దారులకు మరిన్ని పన్ను ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

* వివిధ బ్యాంకుల్లో నిరర్దక ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో 8.5శాతం ఉన్న ఎన్‌పీఏలు మార్చి నాటికి 12.5శాతానికి, పరిస్థితులు మరింత దిగ జారితే 14శాతానికి పెరుగుతాయని ఆర్‌బీఐ అంచనా. ఈ నేపథ్యంలో బ్యాడ్‌బ్యాంకులను ఏర్పాటు చేయాలని సీఐఐ కోరింది. అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో సంస్కరణలు చేపడతారేమో చూడాలి.

* కొవిడ్‌ కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న రంగాల్లో వాహన రంగం ఒకటి.  ప్రజల ఆదాయలు లేక వాహన కోనుగోళ్లు చాలా వరకూ పడిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్న వేళ వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వాహనరంగానికి మేలు జరిగేలా దీర్ఘకాల ప్రయోజనాలను బడ్జెట్‌లో ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 28శాతం పన్ను శ్లాబు నుంచి 18శాతానికి తేవాలని కోరుతున్నారు.

* పెట్రోల్‌ ధరలు లీటరు రూ.100కు చేరుతున్న నేపథ్యంలో విద్యుత్‌ వాహనాల తయారీ పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విస్తృతంగా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దీనికి తోడు ఈ వాహనాలను కొనుగోలు చేసేవారికి రాయితీ పెంచాలని కోరుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని