ఇందుకా మేం పార్టీలకు విరాళాలిచ్చేది? - businesses rethink political donations after capitol incident
close

Published : 11/01/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇందుకా మేం పార్టీలకు విరాళాలిచ్చేది?

క్యాపిటల్‌ ఘటన నేపథ్యంలో వ్యాపార సంస్థల పునరాలోచన

వాషింగ్టన్‌ : అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి అక్కడ తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. ఇప్పటికే అధికార బదిలీ, ఎన్నికల ప్రక్రియ సంస్కరణలపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠతపై ప్రపంచ దేశాలు అనుమానాలు లేవనెత్తాయి. ఈ తరుణంలో అక్కడి వ్యాపార, వాణిజ్య సంస్థలు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపైనా పునఃసమీక్షించుకోవాలని నిర్ణయించాయి. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెబుతున్నాయి.

అమెరికాలో ప్రముఖ వ్యాపార సంస్థ సిటీగ్రూప్‌ మూడు నెలల పాటు రాజకీయ పార్టీలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని నిలిపివేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. చట్టాల్ని గౌరవించని అభ్యర్థులకు అండగా ఉండలేమంటూ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొంది. అలాగే అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించని 147 మంది రిపబ్లికన్లకు అందిస్తున్న విరాళాలను ఆపివేయనున్నట్లు హోటల్‌ దిగ్గజం మారియట్‌ తెలిపింది.

ఓపెన్‌సీక్రెట్‌ అనే సంస్థ సమాచారం ప్రకారం.. సిటీగ్రూప్‌నకు చెందిన ‘పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(పీఏసీ)’ 2019-2020లో మొత్తం 7,42,000 డాలర్లు రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చింది. వీటిలో 4,13,500 డాలర్లు అంటే 56 శాతం రిపబ్లికన్‌ పార్టీకి.. మిగిలినవి డెమొక్రాటిక్‌ పార్టీకి వెళ్లాయి. వైద్యపరికాల తయారీ సంస్థ బోస్టన్‌ సైంటిఫిక్‌ సైతం రాజకీయ విరాళాల్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై రాజకీయ పార్టీలకు అందించే ఆర్థిక సాయంపై పునరాలోచించుకోనున్నామని ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియ, అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని తాము కోరుకుంటున్నామని ప్రకటించింది.

‘బ్లూ క్రాస్‌ బ్లూ షీల్డ్‌ అసోసియేషన్‌’ అనే బీమా సంస్థ సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. గతవారం కాంగ్రెస్‌లో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను ధ్రువీకరించే సమయంలో బైడెన్‌కు వ్యతిరేకంగా ఓటువేసిన వారికి ఆర్థిక సాయాన్ని నిలిపివేయనున్నట్లు సంస్థ సీఈవో కిమ్ కెక్‌ ప్రకటించారు.

ఇవీ చదవండి..

ట్రంప్‌.. ఓ చెత్త అధ్యక్షుడు: ఆర్నాల్డ్‌

అడకత్తెరలో ట్రంప్‌


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని