Electric Autos: విద్యుత్‌ ఆటోలూ పరుగు పెడితేనే.. - even electric autos must go on
close

Published : 12/09/2021 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Electric Autos: విద్యుత్‌ ఆటోలూ పరుగు పెడితేనే..

వినియోగం పెంచేందుకు ప్రభుత్వ దృష్టి

సరకు రవాణా, చెత్త తరలింపునకూ

దిల్లీ: దేశీయ విపణిలో కొత్త విద్యుత్‌ కార్లు, ద్విచక్ర వాహన మోడళ్లు సందడి చేస్తున్నాయి. త్రిచక్ర వాహనాలు (ఆటో) కూడా విద్యుత్తువి వస్తే, వాహన కాలుష్యం మరింత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రహదారులపై 60 లక్షల త్రిచక్ర వాహనాలు తిరుగుతున్నాయి. 2030 నాటికి ఇందులో 30 శాతం వాహనాలను బ్యాటరీపై నడిచేలా చూడాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సరకు రవాణా నుంచి చెత్త తరలింపు సేవల్లో నిమగ్నమై ఉన్న త్రిచక్ర వాహనాలు విద్యుత్‌కు మారితే, నిర్వహణ ఖర్చు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కార్లతో పోలిస్తే సులభంగా బ్యాటరీలు మార్చుకునే సదుపాయం ఉండటంతో సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు.

సీఈఎస్‌ఎల్‌ రూ.3000 కోట్ల టెండర్‌

వ్యర్థాల సేకరణ, సరకు, ఆహారం, వ్యాక్సిన్‌ రవాణా, ప్రయాణికుల ఆటోలు వంటి వేర్వేరు విభాగాల్లో లక్ష విద్యుత్‌ త్రిచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి రూ.3000 కోట్ల టెండర్‌ను ఎనర్జీ ఎఫిషీయెన్సీ సర్వీసెస్‌ అనుబంధ సంస్థ కన్వెర్జన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ (సీఈఎస్‌ఎల్‌) పిలిచింది. ‘టెండర్‌ పిలవడం కంటే ముందు గిరాకీ పరిస్థితులను తెలుసుకునేందుకు కసరత్తు చేశాం. రుణదాతలు, వాహన సంస్థ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద నిధులు పొందిన రాష్ట్రాల నుంచి 85000 త్రిచక్ర వాహనాల కోసం సానుకూల స్పందన లభించింది. అదనంగా 15000 వాహనాలను కలిపి లక్ష వాహనాలకు టెండర్‌ పిలిచాం’ అని సీఈఎస్‌ఎల్‌ ఎండీ, సీఈఓ మహువా ఆచార్య పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తే మంచి ధర లభించదని, అందుకే భారీ స్థాయిలో ఆర్డర్లు పిలుస్తున్నట్లు వెల్లడించారు. అయితే 18 నెలల్లో లక్ష త్రిచక్ర వాహనాలను తయారీదార్లు అందించడం అంత సులభం కాదని, ముందస్తు బిడ్‌ కార్యక్రమంలో 20 ఓఈఎంలు పాల్గొన్నట్లు తెలిపారు.

5.5 లక్షల వాహనాలే

భారత త్రిచక్రవాహన విపణిలో ఆటో రిక్షాలదే అగ్రస్థానం. కొవిడ్‌-19 పరిణామాల వల్ల త్రిచక్రవాహన విక్రయాలు గణనీయంగా తగ్గాయి. విద్యుత్‌ త్రిచక్ర వాహనాలతో ఖర్చులు తగ్గుతాయని, అందువల్ల డ్రైవర్లు వీటికి మొగ్గుచూపొచ్చని ఆచార్య అన్నారు. చెత్త తరలింపు వాహనాలకు రాష్ట్రాలు, మున్సిపాలిటీల నుంచి గిరాకీ ఎక్కువగా ఉంది. కూరగాయలు, వ్యాక్సిన్‌లను తరలించే కూలర్లు వంటి ప్రత్యక వాహనాలకు ఇప్పుడు గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 5.5 లక్షల విద్యుత్‌ త్రిచక్ర వాహనాలు మాత్రమే రహదారులపై తిరుగుతున్నట్లు ఆచార్య అన్నారు. దేశంలో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి స్థలాభావం సమస్యగా ఉంది.  దీంతో మౌలిక సదుపాయాల కొరత ఈ రంగాన్ని వెంటాడుతోంది. ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నప్పటికీ.. 250 ఛార్జింగ్‌ స్టేషన్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. మొత్తం లక్ష్యంలో ఇది 25% కంటే తక్కువే. ప్రస్తుత ఛార్జింగ్‌ స్టేషన్లలో సామర్థ్య వినియోగం కూడా 15% మాత్రమే ఉంది. ఇది కొత్త వాటి ఏర్పాటుకు ప్రతిబంధకంగా మారుతోంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని