ఈ లెక్కలన్నీ చెప్పాల్సిందే... - every Rupee from this year will be counted in IT
close

Updated : 16/04/2021 08:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ లెక్కలన్నీ చెప్పాల్సిందే...

పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సిందే. చట్టం అనుమతించిన మినహాయింపులు, లావాదేవీలతో పాటు అన్నీ రిటర్నులలో చూపించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిసార్లు తెలియకపోవడం లేదా పొరపాటునో వాటిని రిటర్నులలో చూపించరు. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఆర్థిక లావాదేవీని ఆదాయపు పన్ను శాఖ గమనిస్తూ ఉంటుంది. కాబట్టి, ప్రతి రూపాయికీ లెక్క చెప్పక తప్పదు.

సులభంగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఈ వెసులుబాట్లుకు తోడు ఇక నుంచి ముందే నింపి, సిద్ధం చేసిన రిటర్నుల ఫారాలను అందుబాటులోకి తీసుకురానుంది. అంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మనకు వచ్చిన వేతనంతోపాటు మూలధన రాబడి, డివిడెండ్లు, వడ్డీ ఆదాయాలూ రిటర్నుల పత్రాల్లో ముందే నింపి ఉంటాయన్నమాట. దీనివల్ల పన్ను రిటర్నులలో మరింత పారదర్శకత సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించినట్లుగానే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మార్చి 12, 2021న  దీనికి సంబంధించి సర్క్యులర్‌నూ విడుదల చేసింది. దీని ప్రకారం నిర్దేశిత సంస్థలు పన్ను చెల్లింపుదార్లకు సంబంధించి తమ వద్ద నమోదైన మూలధన రాబడి లావాదేవీలు, డివిడెండ్లు, వడ్డీ ఆదాయాలు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 285బీఏ ప్రకారం కొన్ని నిర్దేశిత ఆర్థిక లావాదేవీల (స్పెసిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్‌- ఎస్‌ఎఫ్‌టీ) తీరు, పరిమితికి మించినప్పుడు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.
కొత్త 26ఏఎస్‌..
పన్ను చెల్లింపుదారుల ఆదాయాలు, ఇతర ఆర్థిక లావాదేవీలను గమనించేందుకు ఆదాయపు పన్ను శాఖ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మార్పులు చేసిన ఫారం 26ఏఎస్‌ను అందిస్తోంది. ఇందులో అధిక విలువగల లావాదేవీల వివరాలన్నీ పొందుపరుస్తోంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులూ స్వచ్ఛందంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలు కలుగుతుందని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది.
ఏయే లావాదేవీలు..
* ఒక వ్యక్తికి సంబంధించిన పొదుపు ఖాతాలో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.10లక్షలకు మించి జమ చేసినప్పుడు బ్యాంకు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.
* కొత్తగా రూ.10లక్షలకు మించి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినా, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షలకు మించి ఉన్నా ఆ లావాదేవీలు పన్ను విభాగానికి సంస్థలు తెలియజేస్తాయి.
* బాండ్లు, డిబెంచర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో రూ.10లక్షలకు మించి లావాదేవీలు జరిగినప్పుడు సంబంధిత సంస్థలు ఆ లావాదేవీల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.
* స్థిరాస్తులలో రూ.30లక్షలకు మించి లావాదేవీ జరిగినప్పుడు ఆ వివరాలను సంబంధిత రిజిస్ట్రార్‌ ఆదాయపు పన్ను విభాగానికి వివరాలను చెబుతాయి.
* వస్తువును కొనుగోలు చేసినప్పుడు, సేవలను వినియోగించుకున్నప్పుడు రూ.2లక్షలకు మించి నగదును చెల్లిస్తే.. ఆ వివరాలను సంబంధిత విక్రయదారుడు ఎస్‌ఎఫ్‌టీ నివేదిక ఇవ్వాలి. వీటిని సెక్షన్‌ 44ఏబీ ప్రకారం ఆడిట్‌ సైతం చేసేందుకు అవకాశం ఉంది.
ఇవే కాకుండా.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలు, రిజిస్ట్రార్‌, షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల నుంచి వచ్చిన క్యాపిటల్‌ గెయిన్స్‌ను నివేదిస్తాయి. కంపెనీలు డివిడెండ్ల వివరాలను, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, పోస్టాఫీసులు వడ్డీ ఆదాయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి.
వీటన్నింటినీ క్రోడీకరించి, ఫారం 26ఏఎస్‌ సిద్ధం అవుతుంది. దీంతోపాటు.. ముందస్తుగానే పూర్తి చేసిన ఆదాయపు పన్ను రిటర్నులు ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైటులో అందుబాటులో ఉండనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే ఇలా బ్యాంకులు పొదుపు ఖాతాల మీద వచ్చిన వడ్డీని పన్ను విభాగానికి తెలియజేశాయి. దీంతో పలువురికి ‘హై వ్యాల్యూ ట్రాన్సాక్షన్‌’ల గురించి చెప్పాల్సిందిగా పేర్కొంటూ నోటీసులు వచ్చిన సంగతి విదితమే.

వీటితోపాటు..
* హోటల్‌ బిల్లు రూ.20వేలకు మించి చెల్లించినప్పుడూ
* జీవిత బీమా ప్రీమియం రూ.50,000.. ఆరోగ్య బీమా ప్రీమియం రూ.20వేలకు మించి చెల్లించిన సందర్భాల్లోనూ..
* క్రెడిట్‌ కార్డు బిల్లును రూ.లక్షకు మించి నగదు రూపంలో చెల్లించినప్పుడూ.. (ఆన్‌లైన్‌లో చెల్లించినప్పుడు రూ.10లక్షలు)
* ఒక వ్యక్తికి చెందిన కరెంటు ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షలకు మించి లావాదేవీలు జరిగినప్పుడూ.. సంబంధిత లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయా సంస్థలకు ఉంటుంది.

జాగ్రత్త తప్పదు..

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మీరు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి సంబంధించిన రికార్డులు కచ్చితంగా నిర్వహించడం మంచిది. బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న నగదుపై ఎంత వడ్డీ వస్తోంది.. డివిడెండ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి.. ఇతర ఆదాయాల సంగతేమిటి? ఇలా ప్రతీదీ వివరంగా రాసి పెట్టుకోండి. వాటికి తగిన ఆధారాలు సేకరించి పెట్టుకోండి. దీనివల్ల భవిష్యత్తులో పన్నుకు సంబంధించిన చిక్కులు రాకుండా నివారించవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని