వాడకం తగ్గినా.. వసూళ్లు పెరిగాయ్‌!! - excise duty collection jump 48 pc this fiscal on record hike in taxes on petrol diesel
close

Published : 17/01/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాడకం తగ్గినా.. వసూళ్లు పెరిగాయ్‌!!

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ బాదుడు ఎఫెక్ట్‌

దిల్లీ: కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. జీఎస్టీ వసూళ్లు కనిష్ఠ స్థాయికి చేరాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు భారీగా పడిపోయాయి. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల వచ్చే ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే ఎక్సైజ్‌ సుంకం పెంచడమే ఇందుకు కారణం! గతేడాది సాధారణం కంటే వీటి అమ్మకాలు భారీగా తగ్గినప్పటికీ పన్ను వసూళ్లు పెరగడం విశేషం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020) ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.1,96,342 కోట్ల మేర ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఈ మొత్తం రూ.1,32,899 కోట్లుగా ఉందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కువగా వినియోగించే డీజిల్‌ వాడకం సుమారు 10 మిలియన్‌ టన్నులు తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం విశేషం. 2019 ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య 55.4 మిలియన్‌ టన్నుల డీజిల్‌ అమ్మకాలు జరగ్గా.. 2020కి వచ్చేసరికి కేవలం 44.9 మిలియన్‌ టన్నుల డీజిల్‌ మాత్రమే అమ్ముడైంది. పెట్రోల్‌ సైతం 2019లో 20.4 మిలియన్‌ టన్నులు అమ్ముడవ్వగా.. 2020లో 17.4 మిలియన్‌ టన్నులు మేర మాత్రమే విక్రయాలు జరిగినట్లు చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ (పీపీఏసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కారణం ఇదే..

2017లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అమల్లోకి తెచ్చినప్పటికీ పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులను ఈ పన్ను విధానం నుంచి మినహాయించారు. వీటిపై విధించే ఎక్సైజ్‌ పన్ను ద్వారా కేంద్రానికి, వ్యాట్‌ ద్వారా రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరడంతో గతేడాది మార్చి, మే నెలల్లో కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని రెండు సార్లు సవరించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13, డీజిల్‌పై రూ.16 వడ్డించింది.  దీంతో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.32.98కి.. డీజిల్‌పై 31.83కి చేరింది. మరోవైపు 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌కు రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉండేది. 2014 నవంబర్‌ నుంచి 2016 జనవరి మధ్య సుమారు 9 సార్లు ఎక్సైజ్‌ సుంకం పెంచడం గమనార్హం.

ఇవీ చదవండి...
56.79 లక్షల కొవిడ్‌ క్లెయిమ్‌ల పరిష్కారం
రేపటి నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో మొదలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని