పండుగ బోన‌స్‌తో ఇలా చేద్దాం...! - festival bonus where toinvest and spend
close

Updated : 15/12/2020 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పండుగ బోన‌స్‌తో ఇలా చేద్దాం...!

ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌లకు ఉద్యోగుల‌ను సంతోష‌ప‌రిచేది ఏది అంటే బోన‌స్‌. ఎంత బోన‌స్‌ వ‌చ్చింది, ఎప్పుడొస్తుంది, బోన‌స్‌తో వ‌చ్చే అద‌న‌పు డ‌బ్బుతో ఏం చేయ‌బోతున్నారు లాంటి సంభాష‌ణ‌లు ఈ పండుగ సీజ‌న్‌లో స‌హోద్యోగుల మ‌ధ్య నడుస్తుంటాయి.

బోన‌స్‌తో పెట్టుబ‌డులు, అప్పుల ప‌రంగా ఏం చేయ‌వ‌చ్చో తెలుసుకుందాం. ఇక్క‌డ ఇచ్చిన వివిధ అవ‌కాశాల‌ను ప‌రిశీలించి మీకు త‌గిన వాటి గురించి నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రు.

అప్పులు తీర్చేయండి

అప్పులు తీర్చేందుకే మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వండి. ఆ త‌ర్వాతే అద‌న‌పు పెట్టుబ‌డుల గురించి ఆలోచించ‌వ‌చ్చు. క్రెడిట్ కార్డు రుణాలు ఎక్కువ వ‌డ్డీని ఆక‌ర్షిస్తుంటాయి. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థ‌లు 36శాతం వ‌డ్డీని సైతం విధిస్తుంటాయి. ఇలాంట‌ప్పుడు వీలైనంత తొంద‌ర‌గా క్రెడిట్ కార్డు బిల్లుల‌ను చెల్లించ‌డం మేలు.
ఆ త‌ర్వాత స్థానం వ్య‌క్తిగ‌త రుణాల‌ది. వీటిపై దాదాపు 12-15శాతం వ‌డ్డీ ఉంటుంది. వీలైతే ముంద‌స్తు వ్య‌క్తిగ‌త రుణాల చెల్లింపు అవ‌కాశాలుంటే ప‌రిశీలించ‌గ‌ల‌రు.

స్వ‌ల్ప కాల ల‌క్ష్యాలకు

రాబోయే కొద్ది నెల‌ల్లో అనుకోకుండా కొన్ని ఖ‌ర్చులు ఉండ‌వ‌చ్చు. పెళ్లిళ్లు, పండుగ‌లు, వేస‌వి సెల‌వులు ఆ త‌ర్వాత పిల్ల‌ల‌ను స్కూళ్ల‌లో చేర్పించేందుకు ఫీజులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఖ‌ర్చులుంటాయి. పిల్ల‌ల‌ను స్కూల్‌లో చేర్పించేందుకు ఇప్పుడు రూ.50వేల నుంచి రూ.ల‌క్ష దాకా ఖ‌ర్చువుతోంది. అదే కాలేజీ ఫీజులైతే రూ.ల‌క్ష‌ల్లోనే అవుతుంది. వాట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకొని బోన‌స్‌లో నుంచి కొంత సొమ్మును లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబ‌డిగా పెట్టుకోవ‌డం లాభ‌దాయ‌కం.

గృహరుణాన్ని ముందుగా తీర్చేయండి

గృహ‌రుణం తీసుకున్న‌వాళ్ల‌ల్లో మీరు ఒక‌రైతే ముంద‌స్తు చెల్లింపు అవ‌కాశాలేమైనా ఉంటే తీర్చేయ‌డం మంచిది. అయితే ఇలా చేసే ముందు ముంద‌స్తు రుణ చెల్లింపు లాభ‌దాయ‌క‌మా కాదో లెక్కలు వేసుకోండి. ఒక వేళ లాభ‌దాయ‌క‌మైతే తీర్చేయ‌డ‌మే మేలు. ఈ విష‌య‌మై మీ ఆర్థిక స‌ల‌హాదారును సంప్ర‌దించ‌డం మంచిది.

అత్య‌వ‌స‌ర నిధి జ‌మ‌చేసుకోండి

క‌నీసం ఆరు నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధి ఉండ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తుంటారు. నెల జీతంతో అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం భార‌మై పోయేవాళ్లు బోన‌స్ డ‌బ్బును ఇందుకు ఉప‌యోగించుకునేందుకు స‌దావ‌కాశంగా మ‌ల‌చుకోవ‌చ్చు. అత్య‌వ‌స‌ర నిధిని పొదుపు ఖాతాలో ఉంచ‌కుండా లిక్విడ్ ఫండ్స్ లేదా షార్ట్ ట‌ర్మ్ ఫండ్స్‌లో ఉంచ‌డాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చు. లిక్విడ్ ఫండ్స్‌లో కాస్త అధిక వ‌డ్డీ ల‌భిస్తుంది. రీడీమ్ చేసుకుంటే 24 గంట‌ల్లో డ‌బ్బు చేతికందుతుంది.

పిల్ల‌ల భ‌విష్య‌త్‌కు భ‌ద్ర‌త‌

మీకు 10ఏళ్ల‌లోపు పిల్ల‌లున్న‌ట్ల‌యితే సుక‌న్య స‌మృద్ధి లాంటి ప‌థ‌కాల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. ఇది వ‌ర‌కే దీంట్లో పెట్టుబ‌డి పెడుతున్న‌ట్ల‌యితే ఈ సారి బోన‌స్‌గా అందుకునే డ‌బ్బును దీంట్లో ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చు. ఇదేకాకుండా వివిధ బీమా సంస్థ‌లు, బ్యాంకులు పిల్ల‌ల కోస‌మే ప్ర‌త్యేక‌మైన ప‌థ‌కాల‌ను రూపొందిస్తున్నాయి. వాటిని ప‌రిశీలించి త‌గిన వాటిని ఎంచుకోవ‌డం వ‌ల్ల పిల్ల‌ల భ‌విష్య‌త్‌కు భ‌ద్ర‌త క‌ల్పించిన‌వార‌వుతారు.

ప‌న్ను ఆదా ప‌థ‌కాల్లో…

బోన‌స్ పైన కొన్ని సంద‌ర్భాల్లో ప‌న్ను ప‌డుతుంది. అయితే దీనిపై ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందేందుకు ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిది. సెక్ష‌న్ 80సీ ప‌రిమితిని పూర్తిగా వినియోగిస్తే ఇత‌ర ఆదాయ‌పు ప‌న్ను సెక్ష‌న్ల ద్వారా ప‌న్ను ఆదా చేసుకోండి. ఇందుకోసం ఎవ‌రైనా ట్యాక్స్ క‌న్స‌ల్టెంట్‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

నైపుణ్యాభివృద్ధికి…

బోన‌స్‌తో వ‌చ్చే డ‌బ్బుల‌ను ఇలా కూడా ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. మ‌న నైపుణ్యాల అభివృద్ధికి కొత్త కోర్సు నేర్చుకునేందుకో లేదా ల్యాప్‌టాప్ కొనేందుకో వాడ‌వ‌చ్చు. ఎప్ప‌టి నుంచో నేర్చుకోవాల‌నుకునే కోర్సు … డ‌బ్బు లేక వాయిదా వేస్తూ ఉన్న‌ట్ల‌యితే ఇదే స‌రైన స‌మ‌యం.

బంగారంలో…

ఇది పండుగ‌ల సీజ‌న్ కాబ‌ట్టి బంగారం కొనుగోళ్లు ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి. బంగారంలో పెట్టుబ‌డి కూడా ఒకందుకు మంచిదే. బంగారం ధ‌ర‌లు సాధార‌ణంగా త‌గ్గ‌వు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు బంగారు ఈటీఎఫ్‌లు, పేప‌ర్ గోల్డ్ లాంటి వివిధ ఆప్ష‌న్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు.

ఖ‌ర్చు చేయండి

బోన‌స్‌నంతా పెట్టుబ‌డుల కింద పెట్ట‌మ‌ని కాదు. ఉద్యోగం చేసి క‌ష్ట‌ప‌డి సంపాదించేది ఖ‌ర్చు చేసేదానికే క‌దా! ఏ హాలిడే ప్లాన్ కోస‌మో, లేదా ఖ‌రీదైన గృహోప‌క‌ర‌ణాల కొనుగోలుకో వెచ్చించ‌వ‌చ్చు. అయితే ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌చ్చే బోన‌స్‌తో ఇలా చేయ‌మ‌ని కాదు. మీ ఇంట్లో అవ‌స‌ర‌మైన వ‌స్తువులు లేక‌పోతే బోన‌స్ డ‌బ్బుతో వాటిని కొనుగోలు చేయ‌డ‌మే మంచిది. ఇదే సీజ‌న్‌లో రిటైల్ షాపులు, ఆన్‌లైన్ సంస్థ‌ల్లో గృహోప‌క‌ర‌ణాల‌పై మంచి మంచి ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తుంటాయి. వాటిని స‌ద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది.

ప్ర‌తి ఒక్క‌రూ అన్ని అంశాల‌ను పాటించాల‌ని కాదు. త‌మ త‌మ అవ‌స‌రాలు, అవ‌కాశాల‌ను బ‌ట్టి ప్ర‌ణాళిక వేసుకొని బోన‌స్ సొమ్మును లాభ‌దాయ‌కంగా మ‌లుచుకోగ‌ల‌రు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని