ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులకు ఎలా సిద్ధ‌ప‌డాలి? - financial-emergency-preparation-plan
close

Published : 27/12/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులకు ఎలా సిద్ధ‌ప‌డాలి?

మీ ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సింది అత్య‌వ‌స‌ర నిధి(ఎమ‌ర్జెన్సీ ఫండ్‌). అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల అత్య‌వ‌స‌రంగా న‌గ‌దు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఇది మీకు స‌హాయ‌ప‌డుతుంది. అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినా, పూర్తి వేత‌నం అంద‌క‌పోయినా, ఉహించ‌ని కార‌ణాల వ‌ల్ల ఆదాయం ప్ర‌భావితమ‌యినా అత్య‌వ‌స‌ర నిధి మీకు మ‌ద్ద‌తునిస్తుంది.

ఎంత మొత్తంతో అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు చేసుకోవాలి?
మీకు ఎలాంటి ఆదాయం లేక‌పోయినా క‌నీసం 3 నుంచి 6 నెల‌ల పాటు మీకు, మీ కుటుంబ ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తాన్ని అత్య‌వ‌స‌ర‌నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక‌వేళ మీరు ఉద్యోగ భ‌ద్ర‌త లేని రంగంలో ప‌నిచేస్తుంటే 12 నుంచి 24 నెల‌ల పాటు కుటుంబ ఖ‌ర్చుల‌కు స‌రిపోయే నిధిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు లిక్వీడిటీ ఫండ్ వంటి డెట్ సాధ‌నాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఫిక్సెడ్ డిపాజిట్‌ల‌తో కూడా అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

ఆరోగ్య బీమా:
ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో సంబంధం లేకుండా, పొదుపు, పెట్టుబ‌డుల ప్రారంభానికి ముందే మీకు ఆరోగ్య బీమా పాల‌సీ ఉండ‌డం అవ‌స‌రం. వైద్య ఖ‌ర్చుల‌కు అయ్యే మొత్తం మీ పొదుపును హ‌రించివేస్తుంది. అంతేకాకుండా రుణ ఉచ్చులో చిక్కుకుపోయే అవ‌కాశం ఉంటుంది. మీరు ప్రీమియం రూపంలో చెల్లించే చిన్న మొత్తం ఆరోగ్య స‌మ‌స్యల‌కు అయ్యే పెద్ద ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు, 30 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న వ్య‌క్తి రూ.7 వేల వార్షిక‌ ప్రీమియంతో రూ.10 ల‌క్ష‌ల విలువైన ఆరోగ్య బీమా క‌వ‌రేజ్‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఆరోగ్య బీమాను తీసుకునేప్పుడు హామీ మొత్తం, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, మిన‌హాయింపులు, నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు, క‌వ‌ర‌య్యే వ్యాధులు మొద‌లైన అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. టాప్‌-అప్ ప్లాన్‌, క్రిటిక‌ల్ ఇల్‌నెస్ పాల‌సీని కొనుగోలు చేయ‌డం ద్వారా ఎక్కువ క‌వ‌రేజ్‌ను పొంద‌వ‌చ్చు.

జీవిత బీమా:
ఊహించ‌ని విధంగా ప్రాణ‌న‌ష్టం జ‌రిగితే మీ కుటుంబం ఆర్థికంగా న‌ష్ట‌పోకుండా చూస్తుంది. ప్రాథ‌మిక ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేస్తే, మీరు లేని స‌మ‌యంలో మీ కుటుంబ ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ట‌ర్మ్ పాల‌సీ త‌క్కువ ప్రీమియం ఎక్కువ హామీ మొత్తాన్ని అందిస్తుంది. ట‌ర్మ్ పాల‌సీల‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయ‌డం సుల‌భం, ఖ‌ర్చు కూడా త‌క్కువగా ఉంటుంది. కేవ‌లం ప్రీమియం త‌క్కువ‌గా ఉంద‌ని పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌డం మంచిది కాదు. ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేసే ముందు హామీ మొత్తం, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో వంటివి చూసుకోవాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యం వ‌ర‌కు ట‌ర్మ్‌పాల‌సీ కాల‌వ్య‌వ‌ధి ఉండేలా చేసుకోవాలి. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 10 నుంచి 15 రెట్లు హామీ మొత్తం ఉండాలి. క్లెయిమ్ చేయాల్సి వ‌స్తే ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని స‌రైన వివ‌రాల‌ను అందించాలి. కుటుంబ స‌భ్యుల‌కు పాల‌సీ గురించి తెలియ‌జేసి, వారికి అందుబాటులో ప‌త్రాల‌ను ఉంచాలి. ఒక‌వేళ మీపై ఆధార‌ప‌డి జీవించే స‌భ్యులు లేక‌పోతే ఈ పాల‌సీ అవ‌స‌రం ఉండ‌దు.
ప్ర‌మాదాలు సంభ‌వించి న‌ప్పుడు ఆదాయ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకునేందుకు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాను తీసుకోవ‌డం మంచిది. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి శాశ్వ‌త వైక‌ల్యం ఏర్ప‌డితే, దాని కార‌ణంగా కోల్పోయే ఆదాయానికి ర‌క్ష‌ణ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఈ వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీలను ఆదాయ రక్షణ ప్రణాళికలుగా పరిగణిస్తారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని