30 ఏళ్ల వారికి ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉండాలి? - financial-planning-at-the-age-of-30
close

Published : 05/04/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30 ఏళ్ల వారికి ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉండాలి?

30 ఏళ్లు వ‌చ్చేనాటికి ఎన్నో మైళ్లు రాళ్ల‌ను దాటి ఉంటారు. అప్ప‌డు మీ ఆలోచ‌న‌లు స్థిమితంగా ఉంటాయి. సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు లేదా జీవితం సాఫీగా కొన‌సాగేందుకు అవ‌స‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే స‌న‌మ‌యం. మ‌రి మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి, ఏం మార్పులు చేసుకోవాలో తెలుసుకోండి.

రుణ చెల్లింపులు చేసేయండి:

ఇప్ప‌టికే మీరు విద్యా రుణం, వ్య‌క్తిగ‌త రుణం వంటివి తీసుకొని ఉంటే వాటిని తొంద‌ర‌గా చెల్లించ‌డం ప్రారంభించండి. ముఖ్యంగా వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉండే వ్య‌క్తిగ‌త రుణాల వంటివి తొంద‌ర‌గా పూర్తి చేస్తే మంచిది. ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేంద‌కు అప్పు తీసుకోవ‌డాన్ని ఆర్థిక స‌ల‌హాదారులు ఎప్పుడూ హ‌ర్షించ‌రు. కొనేంత డ‌బ్బు లేన‌ప్పుడు అప్పు చేయ‌డం కంటే కొన‌కుండా ఉండ‌టం మంచిదంటారు. ఇప్పుడున్న రుణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేస్తేనే భ‌విష్య‌త్తులో ఏదైనా అవ‌స‌ర‌మైన‌ప్పుడు తిరిగి రుణాలు ల‌భించే అవ‌కాశం ఉంటుంది.

పొదుపును మ‌రింత పెంచండి:

ఉద్యోగంలో చేరిన నాటికంటే 30 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా సంపాదిస్తారు. మ‌రి ఎక్కువ డ‌బ్బు వ‌చ్చిన‌ప్పుడు, చేయ‌వ‌ల‌సింది ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్ట‌డం కాదు. వీలైనంత ఎక్కువ‌గా పొదుపు చేయ‌డం. అప్పుడు మీ సంప‌ద‌ మ‌రింత వేగంగా పెరుగుతుంది. ఎంత త్వ‌ర‌గా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే అంత ఎక్కువ‌గా లాభం పొంద‌వ‌చ్చు. 30 లో దీర్ఘ‌కాలిక లక్ష్యాలైన ప‌ద‌వీ విర‌మ‌ణ‌, పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, ఇల్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబ‌డులు పెట్టాలి.

బీమా పాల‌సీలు తీసుకోండి:

ఇప్ప‌టికే మీరు బీమా పాల‌సీ తీసుకున్న‌ట్ల‌యితే అది ఇప్పుడు మీరు ఉన్న ప‌రిస్థికి స‌రిపోతుందో లేదో మ‌రోసారి ప‌రిశీలించండి. మీ వార్షిక ఆదాయానికి ప‌దిరెట్లు అధికంగా హామీ ఉండే బీమా పాల‌సీని ఎంచుకోవాలి. ఆరోగ్య బీమా పాల‌సీ లేక‌పోతే తీసుకోవ‌డం మంచిది. మీరు ప‌నిచేసే సంస్థ బీమా క‌వ‌ర్ ఇచ్చినా మీరు సొంతంగా మ‌రోటి కొనుగోలు చేయాలి.

పోర్ట్‌ఫోలియో త‌యారు చేసుకోండి:

త‌గిన బీమా పాల‌సీలు తీసుకున్న త‌ర్వాత, పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌పై దృష్టి సారించాలి. రిస్క్ ఎంత తీసుకుంటార‌న్న‌ది బ‌ట్టి మీకు త‌గిన దానిలో పెట్టుబ‌డులు ప్రారంభించాలి. మీకు స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డం రాక‌పోతే ఆర్థిక స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించాలి లేదా సంస్థ‌ల‌ వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవాలి.

అవ‌స‌ర‌మైన‌వే కొనుగోలు చేయండి:

డ‌బ్బు నిర్వ‌హ‌ణ అంటే ఏమీ ఖ‌ర్చు చేయ‌కుండా మొత్తం పొదుపు చేయ‌మ‌ని కాదు. అన‌వ‌స‌ర‌మైన‌వి కాకుండా ఏవి అస‌ర‌ముంటాయో వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబ‌డులు చేసేందుకు ముఖ్య‌కార‌ణం ఏంటీ భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీకు న‌చ్చిన‌ట్లు జీవించేందుకే. మ‌రి దానికోసం మీ ఖ‌ర్చుల‌ను అదుపులో పెట్టుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ప్ర‌తి సంవ‌త్స‌రం విదేశీ ప‌ర్య‌ట‌న చేయాల‌నుకుంటే స్వ‌ల్ప‌కాలిక ఫండ్ల‌లో పొదుపు చేయాలి. మీ ప‌ర్య‌ట‌న‌కు రూ.50 వేలు అవ‌స‌ర‌మ‌నుకుంటే 12 నెల‌ల‌కు రూ.4 వేలు ప‌క్క‌న పెడితే అవ‌స‌ర‌మైన నిధి జ‌మ‌వుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని