ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది.. ఫాస్టాగ్‌ తీసుకున్నారా? - from feb 15 fastag mandatory
close

Updated : 09/02/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది.. ఫాస్టాగ్‌ తీసుకున్నారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: మీకు కారు ఉందా..? మరి ఫాస్టాగ్‌ తీసుకున్నారా..? ఫిబ్రవరి 15 నుంచి జాతీయ రహదారులపై టోల్‌ చెల్లింపులకు ప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది. నిజానికి ఈ ఏడాది ఆరంభం నుంచే పూర్తిస్థాయి ఫాస్టాగ్‌ వినియోగం అమల్లోకి రావాల్సి ఉండగా.. వాహనదారుల సౌలభ్యం కోసం మరో నెలన్నర పాటు గడువు పొడిగించారు. ఈ నెల 15 నుంచి వాహనదారులంతా తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ కట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ గతంలో ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక పూర్తిగా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులే

దేశంలోని ద్విచక్రవాహనాలు మినహా అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నూతన విధానాన్ని 2017 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ సమయంలో నగదు రూపంలోనూ చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. 2017 డిసెంబర్‌ నుంచి కొత్తగా రోడ్డెక్కుతున్న ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల చట్టం 1989కి సవరణలు చేసింది. అంతకంటే ముందు విక్రయించిన వాహనాలకు 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి అని పేర్కొంటూ గత ఏడాది నవంబరులోనే కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15 వరకు గడువు పొడగించింది. 

ట్యాగ్‌ చేయాల్సిందే..

ప్రస్తుతానికి టోల్‌ గేట్లలో నగదు చెల్లింపులు చేసే వాహనాల కోసం ప్రత్యేకంగా ఓ లైన్‌ కేటాయించారు. కానీ ఫిబ్రవరి 15 నుంచి దీన్ని కూడా ఉపసంహరించనున్నారు. తప్పనిసరిగా డిజిటల్‌ చెల్లింపులు చేసే ముందుకు సాగాల్సి ఉంటుంది. వీటి ద్వారా టోల్‌గేట్ల నుంచి ప్రముఖులు ప్రయాణిస్తున్నా, పండగలైనా కిలోమీటర్ల మేర బారులు తీరే దుస్థితి తప్పుతుందని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. ఇంధనం, సమయం ఆదా అవుతాయని భరోసా ఇస్తోంది. ఆధునిక సాంకేతికతతో నిర్వహణ లోపాలు తప్పుతాయని ప్రకటించింది. కానీ ఇప్పటికీ చాలా మంది వాహనదారులు ఫాస్టాగ్‌ తీసుకోకుండానే ప్రయాణం చేస్తున్నారు. అలాంటి వారి నుంచి రెండు రెట్లు టోల్‌ వసూలు చేస్తామని కేంద్రం రవాణా శాఖ ఇప్పటికే ప్రకటించింది.

విక్రయం ఎక్కడ?

అయితే ఫాస్టాగ్‌ను ఎక్కడ పొందాలనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియట్లేదు. దేశవ్యాప్తంగా 30వేల కేంద్రాల్లో ఫాస్టాగ్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ టోల్‌ప్లాజాల వద్ద తప్పనిసరిగా ఇవి లభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్ష అమ్మకాలతో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి వాటిలో కూడా లభించేలా చర్యలు తీసుకున్నారు. ఫాస్టాగ్‌ చెల్లింపులు ఇప్పుడు ఇష్యూయర్‌ ఏజన్సీలుగా 27 బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక భారత్‌ పే పేమెంట్స్‌ సిస్టమ్‌, యూపీఐ, ఆన్‌లైన్‌ చెల్లింపులు, మై ఫాస్టాగ్‌ మొబైల్ యాప్‌, పేటీఎం, గూగుల్‌ పే తదితర పోర్టల్స్‌ ద్వారా కూడా రీఛార్జి చేసుకునే సదుపాయం కల్పించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం టోల్‌ప్లాజాల వద్ద పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ వద్ద నగదు రీఛార్జి సౌకర్యం కూడా ఉంది. 

ఇతర వివరాలు..

ఫాస్టాగ్‌ ధర ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంటోంది. ఫాస్టాగ్‌ తీసుకోవాలనుకునేవారు ఛార్జీలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా చెల్లించాలి. ఉదాహరణకు.. ఐసీఐసీఐ బ్యాంక్‌లో తీసుకుంటే.. ట్యాగ్‌ ఫీజు రూ. 99.12, సెక్యూరిటీ డిపాజిట్‌ రూ. 200, కనీస బ్యాలెన్స్‌ రూ. 200.. ఇలా రూ. 500 చెల్లించాలి. మిగతా బ్యాంకుల్లోనూ స్వల్ప తేడాలతో ధరలు ఇలాగే ఉన్నాయి. ఒకసారి ఫాస్టాగ్‌ తీసుకుంటే ఐదేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది.

ఇదీ చదవండి..

పేటీఎంతో అద్దె చెల్లిస్తే రూ. 1000 క్యాష్‌బ్యాక్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని