పరిపాలనపై పట్టు బిగించేందుకు ఏర్పాట్లు
ఇప్పటికే సహకార అర్బన్ బ్యాంకుల నియంత్రణకు చర్యలు
వచ్చే ఏప్రిల్ 1 నుంచి గ్రామీణ సహకార బ్యాంకులపై కూడా..
ఈనాడు, హైదరాబాద్ : సహకార బ్యాంకుల పనితీరును ప్రక్షాళన చేసేందుకు రిజర్వుబ్యాంకు(ఆర్బీఐ) కసరత్తు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం(ఏప్రిల్ 1) నుంచి కొత్త ఆదేశాలను అమల్లోకి తేనున్నట్లు సమాచారం. ఇప్పటికే గత సెప్టెంబరు ఒకటి నుంచి పట్టణాలు, నగరాల్లోని అర్బన్ సహకార బ్యాంకుల నియంత్రణ బాధ్యతను ఆర్బీఐ తీసుకుంది. రైతులకు, వ్యవసాయానికి సేవలందించే గ్రామీణ సహకార బ్యాంకులను సంస్కరించాలని నిర్ణయించింది. కేంద్రం తెచ్చిన బ్యాంకుల సంస్కరణల బిల్లు ప్రకారం సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల రిజర్వుబ్యాంకు తెలిపింది. కేంద్రం కూడా ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది.
ఎందుకీ మార్పులు...
ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రకాల సహకార బ్యాంకులు 1900 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంకుల బ్యాంకింగ్ వ్యవహారాలపై మాత్రమే రిజర్వుబ్యాంకుకు నియంత్రణ ఉంది. సహకార బ్యాంకు రిజిస్ట్రేషన్, నిర్వహణ, ఆడిట్, రుణాల రికవరీ, ఎన్నికలు, విచారణాధికారం వంటివాటిపై అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర సహకార కమిషనర్(రిజిస్ట్రార్)కు ఉన్నాయి.
* ఏదైనా సహకార బ్యాంకు కార్యకలాపాల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది. దీంతో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. దీనివల్ల వినియోగదారులకు సహకార బ్యాంకులపై నమ్మకం తగ్గుతోంది. ఉదాహరణకు ఉమ్మడి పాత ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో మూడేళ్ల క్రితం అక్రమాలు జరిగితే ఇంతవరకూ విచారణే పూర్తికాలేదు. ఉమ్మడి వరంగల్, నల్గొండ డీసీసీబీల్లో సైతం అక్రమాలు జరిగినా చర్యలకు ఏళ్లు పట్టింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకుల మేనేజ్మెంట్, పరిపాలన(అడ్మినిస్ట్రేషన్) అంశాలను పూర్తిగా ఆర్బీఐ పరిధిలోకి తెస్తేనే వినియోగదారులకు రక్షణ కల్పించగలమని కేంద్ర కొత్త చట్టం చెబుతోంది. సహకార బ్యాంకుల పరిపాలనలో పూర్తి పారదర్శకత తేవాలనేది ప్రధాన లక్ష్యం.
కొత్తగా వచ్చే మార్పులివే...
* అక్రమాలు, మరే ఇతర కారణాల వల్లగానీ ఏదైనా సహకార బ్యాంకు ఆర్థికంగా పూర్తిగా మునిగిపోతే వాటిని సమీపంలోని ఇతర బ్యాంకుల్లో విలీనం చేసి వినియోగదారులను కాపాడాలి. ఇతర వాణిజ్య బ్యాంకుల విషయంలో ఈ అధికారాలు ప్రస్తుతం ఆర్బీఐ వద్దనే ఉన్నాయి.
* కొత్త నిబంధనల ప్రకారం సహకార బ్యాంకులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొస్తే రిజర్వుబ్యాంకు నేరుగా పాలకవర్గాన్ని సస్పెండ్ చేసి విచారణ చేస్తుంది. ఈ సమాచారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతుంది.
* తాత్కాలికంగా కొత్త ఛైర్మన్‌ను కూడా రిజర్వుబ్యాంకు నియమించవచ్చు. అవసరమైతే సహకార బ్యాంకుకు ఎండీని కూడా నియమిస్తుంది.
* సహకార బ్యాంకు డైరెక్టర్‌ను ఒకసారి పదవి నుంచి తొలగిస్తే మళ్లీ బ్యాంకు పాలకవర్గంలోకి మరో నాలుగేళ్ల దాకా తీసుకోరు.
* బ్యాంకు ఎండీ పదవీకాలాన్ని ఐదేళ్లకు మించి ఇవ్వరు.
* సహకార బ్యాంకులో మూలధనాన్ని రిజర్వుబ్యాంకు అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడానికి, తగ్గించడానికి వీలుండదు.
* పాలకవర్గంలో ఉన్నవారి బంధువులకు వ్యవసాయేతర రుణాలివ్వడానికి వీలులేదు.
* ఇంతకాలం సహకార బ్యాంకుల ఆడిట్ సకాలంలో పారదర్శకంగా జరగడం లేదు. ఇక నుంచి రిజర్వుబ్యాంకు పర్యవేక్షణలో నిపుణులతో పక్కాగా ఆడిట్ చేయిస్తారు. ఏడాదికోసారి జరిగేవే కాకుండా ఎప్పుడైనా ఆరోపణలొస్తే.. అప్పటికప్పుడు ప్రత్యేక ఆడిట్ చేయించి బాధ్యులను తొలగించి చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆర్బీఐకి విశేషాధికారాలు ఉంటాయి.
ఇవీ చదవండి..
ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించిన ఎస్బీఐ
క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోండి
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?