close

Published : 17/01/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏవీ ఈవీ పరుగులు

పెరగని విద్యుత్తు ద్విచక్ర వాహన అమ్మకాలు
ఫేమ్‌-2 లక్ష్యానికి ఎంతో దూరం...
ఈనాడు - హైదరాబాద్‌

విద్యుత్‌ వాహనాల వాడకం సుదూర లక్ష్యంగా కనిపిస్తోంది. వీటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకువచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా.. ఇంకా గట్టి అడుగులు పడటం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వీటి విక్రయాలు పెరగాల్సింది కానీ అలా జరగలేదు. ఎందుకు? వీటికి ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి? భవిష్యత్‌ మాటేమిటి?

దేశంలో విద్యుత్తు వాహనాల వాడకాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌-2 (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌) పథకాన్ని 2019 ఏప్రిల్‌ 1న అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకం ప్రకారం మూడేళ్లలో... అంటే, మార్చి 2022 నాటికి 10 లక్షల విద్యుత్తు టూ-వీలర్ల అమ్మకాలు (ఈ- 2డబ్లూ) నమోదు చేయాలి. కానీ ఆచరణలో ఈ లక్ష్యం సాధ్యమయ్యేదిగా కనిపించటం లేదు.


ఇప్పటి వరకు స్వల్పంగానే..

ఫేమ్‌-2 పథకం కింద ఇప్పటి వరకూ 31,813 విద్యుత్తు ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించినట్లు సొసైటీ ఆఫ్‌ మానుఫ్యాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎంఈవీ) వెల్లడించింది. గత ఏడాది కొవిడ్‌-19తో దాదాపు అన్ని రకాలైన పరిశ్రమలు ఇబ్బంది పడ్డాయి. కానీ విద్యుత్తు వాహనాల పరిశ్రమ మాత్రం దీన్ని తట్టుకొని నిలిచింది. గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో 25,735 విద్యుత్తు ద్విచక్ర వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. అయినప్పటికీ ఫేమ్‌-2 కింద నిర్దేశించుకున్న అమ్మకాల లక్ష్యం ప్రస్తుత పరిస్థితుల్లో సుదూరంగా కనిపిస్తోంది. ఫేమ్‌-2 పథకంలో కొన్ని మంచి అంశాలు ఉన్నప్పటికీ ఎన్నో కఠినమైన నిబంధనల వల్ల విద్యుత్తు వాహనాల అమ్మకాలు పెరగటం లేదని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్‌ జనరల్‌ సోహిందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఫేమ్‌- 2 అర్హత నిబంధనలు పెట్రోలు వాహనాల నుంచి విద్యుత్తు వాహనాల వైపునకు వినియోగదార్లు రాకుండా నిరోధిస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీ ఉన్నప్పటికీ వాహనాల ధరలు అందుబాటులో లేవని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫేమ్‌- 2 నిబంధనలను సవరించటం ద్వారా విద్యుత్తు టూ-వీలర్ల అమ్మకాలు పెరిగేందుకు దోహదపడాలని వివరించారు.


ఇవీ అవరోధాలు..

దేశంలో విద్యుత్తు టూ-వీలర్ల అమ్మకాల తీరుతెన్నులపై రేటింగ్‌ సంస్థ ఇక్రా ఒక పరిశీలన చేసింది. ఫేమ్‌- 2 పథకం కింద సబ్సిడీ పొందటం ఎంతో కష్టంగా ఉన్నట్లు ఈ పరిశీలనలో స్పష్టమైంది. స్థానికత (లోకలైజేషన్‌) నిబంధన ప్రధాన అవరోధమని, లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీలతో తయారైన ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ వర్తించటం లేదని డీలర్లు చెప్పినట్లు ఇక్రా వివరించింది. అదే సమయంలో సబ్సిడీ వస్తుందనే విషయం వినియోగదార్లకు తెలియకపోవటం, ఛార్జింగ్‌ స్టేషన్లు తగినంతగా లేకపోవటం, మరమ్మతులు చేసే సదుపాయాలు పెరగకపోవటం...ఇతర కారణాలని తెలిపింది. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తు టూ-వీలర్ల అమ్మకాలు పెరగాల్సి ఉందని, కానీ అటువంటి పరిస్థితులు కనిపించటం లేదని ఇక్రా ఉపాధ్యక్షుడు షంషేర్‌ దివాన్‌ అభిప్రాయపడ్డారు.


ఇలా చేస్తే సరి..

టీవల కాలంలో దిల్లీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు విద్యుత్తు వాహనాల విధానాన్ని ఆవిష్కరించాయి. బ్యాటరీ లేకుండా విద్యుత్తు ద్విచక్ర వాహనాన్ని విక్రయించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల సమీప భవిష్యత్తుల్లో విద్యుత్తు వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని షంషేర్‌ దివాన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌-19 వల్ల ప్రజలు సొంత వాహనాలపై ప్రయాణించటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆఫీసులకు, సొంత పనులకు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. దీనివల్ల విద్యుత్తు వాహనాల అమ్మకాలు పెరగాలి. కానీ ప్రజల ఆదాయాలు తగ్గి కొనుగోలు శక్తి క్షీణించినందున దాని ప్రభావం అమ్మకాలపై పడుతుందని ఆయన విశ్లేషించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించటం, పెట్రోలు వాహనాలను తగ్గించే చర్యలు చేపట్టటం, విద్యుత్తు వాహనాలకు అదనపు రాయితీలు ఇవ్వటం ద్వారా విద్యుత్తు ద్విచక్ర వాహనాల అమ్మకాల లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని