close

Published : 19/01/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అదానీ గ్రూప్‌లోకి రూ.18,200 కోట్లు

అదానీ గ్రీన్‌లో 20 శాతం వాటా

 ఒప్పందం కుదుర్చుకున్న టోటల్‌ 

దిల్లీ: అదానీ గ్రూప్‌తో ఫ్రాన్స్‌కు చెందిన చమురు, ఇంధన గ్రూప్‌ టోటల్‌ 2.5 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.18,200 కోట్లు) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 20 శాతం ప్రమోటర్ల వాటాను టోటల్‌ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందంతో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కంపెనీలో టోటల్‌కు ఒక బోర్డు సీటు లభిస్తుంది. అంతే కాకుండా.. 2.35 గిగావాట్ల సౌర ఆస్తుల్లో 50 శాతం వాటా కూడా దక్కుతుందని ఇరు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన నగర గ్యాస్‌ పంపిణీ కంపెనీ అదానీగ్యాస్‌లో 37.4 శాతం వాటాను, ఒడిశాలో నిర్మిస్తున్న ధర్మా ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టులో 50 శాతం వాటా కొనుగోలుకు 2018లో టోటల్‌ ఒప్పందం చేసుకుంది. 2025 నాటికి 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సమకూర్చుకోవాలన్నది ఏజీఈఎల్‌ ప్రణాళిక కాగా, ఆ సమయానికే స్థూలంగా 35 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సమకూర్చుకోవాలన్నది టోటల్‌ యోచన కావడం గమనార్హం.
పెట్టుబడులు ఇలా: అదానీ గ్రీన్‌ ఎనర్జీ(ఏజీఈఎల్‌)లో టోటల్‌ రెన్యూవబుల్స్‌ ఎస్‌ఏఎస్‌ 25.65 కోట్ల షేర్లు లేదా 16.4 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ వాటాను ప్రమోటరు గ్రూప్‌ కంపెనీ అయిన యూనివర్సల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి సొంతం చేసుకుంది. 2020 సెప్టెంబరు నాటికి అదానీ సహా మొత్తం అందరు ప్రమోటర్ల వాటా సంస్థలో 74.92 శాతంగా ఉంది. మిగిలిన 3.6 శాతం వాటాను సైతం టోటల్‌కు ఏజీఈఎల్‌ విక్రయిస్తుందని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. అయితే ఆ వాటా విలువ కానీ, విక్రయించే సంస్థల పేర్లు కానీ తెలపలేదు. ప్రస్తుత షేరు విలువ(రూ.953.45) ప్రకారం.. 20 శాతం వాటా రూ.30,000 కోట్లకు సమానం. కానీ ఒప్పందం అంతకంటే తక్కువకు జరిగిందని.. వాటా కొనుగోలుకు 2 బిలియన్‌ డాలర్లు(రూ.14,600 కోట్లు); సౌర ఆస్తులకు 500 మిలియన్‌ డాలర్లు(రూ.3600 కోట్లు) మేర పెట్టి ఉండొచ్చంటున్నారు. అటు టోటల్‌ కానీ ఇటు అదానీ కానీ దేనికి ఎంత చెల్లించారన్నది బయటకు వెల్లడించలేదు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని