close

Published : 20/01/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా తొలి దశ పరీక్షలకు సిఫారసు

భారత్‌ బయోటెక్‌ దరఖాస్తుపై డీసీజీఐ నిపుణుల కమిటీ

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా’పై తొలి దశ క్లినికల్‌ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణాధికార సంస్థ (డీసీజీఐ)కు చెందిన నిపుణుల కమిటీ (సీడీఎస్‌సీఓ) సిఫారసు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తే కరోనా పోరులో గొప్ప మార్పు అవుతుందని ప్రభుత్వ అత్యున్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా (ఇంట్రానాజల్‌ వ్యాక్సిన్‌)కు సంబంధించి తొలి, రెండో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసుకోగా.. సీడీఎస్‌సీఓలోని సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ దానిని పరిశీలించి తొలి దశ పరీక్షలకు అనుమతినివ్వచ్చంటూ మంగళవారం సిఫారసు చేసింది. తొలి దశ డేటాలోని భద్రత, రోగనిరోధక శక్తిని పరిశీలించి రెండో దశ పరీక్షలకు అనుమతి ఇవ్వవచ్చని ఒక అధికారి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ ఆమోదం తెలిపితే, డీసీజీఐ అనుమతులు రావడం లాంఛనమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజెక్షన్‌ ద్వారా ఇస్తున్న రెండు డోసుల కరోనా టీకా స్థానంలో  ఇంట్రానాజల్‌ (బీబీవీ 154) టీకా తీసుకురావడానికికృషి చేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌ కృష్ణ ఎల్ల గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. నాసికా రంధ్రాల్లో, రెండు వైపులా ఒక చుక్క వ్యాక్సిన్‌ వేస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు ప్రారంభం కావచ్చు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని