close

Published : 23/01/2021 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్‌ఐఎల్‌ లాభం రూ.13,101 కోట్లు

 రాణించిన పెట్రో రసాయనాల వ్యాపారం
అదరగొట్టిన రిలయన్స్‌ రిటైల్‌, టెలికాం
జియో వినియోగదారుపై సగటు ఆదాయం రూ.151

దిల్లీ


‘ గత త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు 2020)లో బలమైన ఆర్థిక ఫలితాలు సాధించాం. ఓ2సీ, రిటైల్‌ విభాగాలు బలంగా పుంజుకోగా, డిజిటల్‌ సేవల వ్యాపారం స్థిరమైన వృద్ధి నమోదుచేసింది. కొత్త ఇంధన, వస్తువుల వ్యాపారాన్ని పర్యావరణహితంగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓ2సీ విభాగాన్ని మరింతగా వినియోగదారులకు చేరువ చేస్తాం.

- ముకేశ్‌ అంబానీ, సీఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అంచనాలను మించి రాణించింది. నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.13,101 కోట్లకు చేరింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.11,640 కోట్లే. పెట్రో రసాయనాల వ్యాపారం మెరుగుపడటం, రిటైల్‌ విభాగం జోరు కొనసాగించడం, టెలికాం విభాగమైన జియో స్థిర వృద్ధి మెరుగైన ఫలితాలకు ఉపకరించాయి. కొవిడ్‌ సవాళ్లు ఇంకా పూర్తిగా తొలగనందున, మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,57,165 కోట్ల నుంచి రూ.1,28,450 కోట్లకు తగ్గినట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయాల్లో రిటైల్‌, టెలికాం విభాగాల వాటా 37% నుంచి 51 శాతానికి పెరిగింది. మొత్తం ఆదాయం 18.6% తగ్గి రూ.1,37,829 కోట్లకు చేరింది.
రిటైల్‌ ఆదాయం రూ.36,887 కోట్లు
మూడో త్రైమాసికంలో రిటైల్‌ వ్యాపార లాభం 11.80 శాతం పెరిగి రూ.3102 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.45,348 కోట్ల నుంచి 22.94 శాతం తగ్గి రూ.36,887 కోట్లకు పరిమితమైంది. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆంక్షలు, స్థానిక ఇబ్బందులు ఉన్నప్పటికీ  రికార్డు లాభాన్ని సాధించామని కంపెనీ తెలిపింది. చమురు రిటైలింగ్‌ వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్‌- బీపీ సంయుక్త సంస్థకు బదిలీ చేయడం, రిలయన్స్‌ మార్కెట్‌ స్టోర్లను ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలుగా మార్చడం కూడా ఆదాయంపై ప్రభావం చూపింది. తన రిటైల్‌ స్టోర్లలో కొత్తగా 50000 నియామకాలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్తగా 327 స్టోర్లను తెరవడంతో మొత్తం విక్రయశాలల సంఖ్య 12,201కి పెరిగింది.
జియో అదుర్స్‌
సమీక్షిస్తున్న త్రైమాసికంలో టెలికాం విభాగం జియో మెరిసింది. డిసెంబరు త్రైమాసికంలో 2.5 కోట్లకు పైగా కొత్త కనెక్షన్లు జత చేరడంతో మొత్తం చందాదార్ల సంఖ్య 41.08 కోట్లకు చేరుకుంది. ఈ విభాగంలో నికర లాభం 15.5 శాతం పెరిగి రూ.3,489 కోట్లకు చేరుకుంది. డిజిటల్‌, టెలికాం సేవలందించే జియో ప్లాట్‌ఫామ్స్‌ రూ.3020 కోట్ల లాభాన్ని ఆర్జించింది. జియో ఆదాయం రూ.22,858 కోట్లుగా నమోదైంది. వినియోగదారులపై సంస్థకు లభించే సగటు ఆదాయం(ఆర్పు) రూ.145 నుంచి రూ.151కి పెరిగింది.
వాటా విక్రయాలు పూర్తి
జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైనారిటీ వాటా విక్రయాల ద్వారా నిధుల సమీకరణ చేయడాన్ని పూర్తిచేసినట్లు రిలయన్స్‌ తెలిపింది. జియోలో రూ.1,52,056 కోట్లు, రిటైల్‌లో రూ.47,265 కోట్లు చొప్పున కంపెనీ సమీకరించింది. మొత్తం నగదు రూ.2,20,231 కోట్లు రావడంతో నికరంగా అదనపు నగదు నిల్వలు ఉన్న కంపెనీగా మారింది.
రుణభారం ఇలా
డిసెంబరు 31, 2020 నాటికి కంపెనీ స్థూల రుణాలు రూ.2,57,413 కోట్లకు తగ్గాయి. 2020 మార్చిలో ఇవి రూ.3,36,294 కోట్లుగా ఉన్నాయి. చేతిలోని నగదు రూ.1,75,259 కోట్ల నుంచి రూ.2,20,524 కోట్లకు పెరిగింది. దీంతో నికర రుణాలు (-)రూ.2,954 కోట్లుగా నమోదయ్యాయి.
శుక్రవారం బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 2.30% నష్టంతో రూ.2049.65 వద్ద స్థిరపడింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని