close

Published : 27/01/2021 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జయహో భారత్‌

2021లో 7.3% వృద్ధి
2020లో 9.6% క్షీణత
ఐక్యరాజ్య సమితి

ఏడాది (2021) భారత ఆర్థిక వ్యవస్థ 7.3 వృద్ధిరేటు సాధిస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అయితే కొవిడ్‌ పరిణామాల వల్ల 2020లో 9.6 శాతం క్షీణత నమోదు చేస్తుందని సంస్థ అంచనా వేసింది. శతాబ్దానికి ఒకసారి ఎదురయ్యే అత్యంత దుర్భర పరిస్థితులు కొవిడ్‌ రూపంలో ప్రపంచానికి 2020లో ఎదురయ్యాయని సంస్థ విశ్లేషించింది. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.3 శాతం క్షీణత నమోదు చేస్తుందని, 2009 సంక్షోభం కంటే ఇది రెండున్నర రెట్లు అధికమని వివరించింది. 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా 4.7 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది.


2021-22లో వృద్ధిరేటు 9.6 శాతం!
ఫిక్కీ సర్వే

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 2021-22లో బలంగా పుంజుకుంటుందని ఫిక్కీ తాజాగా నిర్వహించిన ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ సర్వేలో అంచనా వేసింది. జీడీపీ వృద్ధి 9.6 శాతానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠంగా 12.5 శాతం, కనిష్ఠంగా 7.5 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చని అంచనా వేసింది. పరిశ్రమలు, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాల్లోని ప్రముఖ ఆర్థిక వేత్తలు అభిప్రాయాలు ఈ నెలలోనే సమీకరించి, వాటి ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు ఫిక్కీ తెలిపింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ సాధ్యమైనంత ఎక్కువమందికి ఇవ్వడం, కొత్త కేసుల సంఖ్య తగ్గడం ఇందుకు దోహదం చేయొచ్చని పేర్కొంది.

2020-21లో జీడీపీ క్షీణత 8%: 2020-21లో జీడీపీ 8% క్షీణించే అవకాశం ఉందని  వెల్లడించింది. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5% నమోదుకావచ్చని తెలిపింది. పరిశ్రమలు, సేవల రంగాలు మహమ్మారి దెబ్బకు ఘోరంగా ప్రభావితమై వరుసగా 10%, 9.2% క్షీణతను నమోదు చేయవచ్చని అంచనా వేసింది.

* 2020-21 మూడో త్రైమాసికంలో జీడీపీ క్షీణత 1.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని, నాలుగో త్రైమాసికంలోనే 0.5 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఫిక్కీ అంచనా వేసింది.
* పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 2020-21లో సగటున 10.7 శాతం క్షీణత నమోదు చేయవచ్చని పేర్కొంది.
* టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ రేటు యథాతథ స్థాయిలో ఉంటుందని, వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సరాసరిన 6.5 శాతం, గరిష్ఠంగా 6.6 శాతం, కనిష్ఠంగా 5.8 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది.


రెండంకెల వృద్ధి భారత్‌లోనే
ఐఎంఎఫ్‌ అంచనా

వాషింగ్టన్‌: 2021లో భారత్‌ 11.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావడం,   ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోవడంతో ఈ ఏడాది రెండంకెల వృద్ధి రేటు నమోదు చేయనున్న ఏకైక దేశంగా భారత్‌ నిలవనుంది. ఐఎంఎఫ్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాలో భారత వృద్ధి అంచనాలను సవరించింది. కరోనా పరిస్థితుల వల్ల 2020లో భారత ఆర్థిక వ్యవస్థ క్షీణత 8 శాతంగా నమోదవుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఈ ఏడాదిలో భారత్‌ బలంగా పుంజుకుంటుందని అభిప్రాయపడింది. 2021లో చైనా 8.1 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలుస్తుందని, స్పెయిన్‌ (5.9 శాతం), ఫ్రాన్స్‌ (5.5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉంటాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. 2020లో 2.3 శాతం సానుకూల వృద్ధి నమోదుచేసిన ఏకైక దేశంగా చైనా నిలిచింది. 2022లో భారత్‌ 6.8 శాతం వృద్ధిరేటు సాధించొచ్చని, చైనా వృద్ధి 5.6 శాతంగా నమోదుకావొచ్చని అంచనా వేసింది. తాజా అంచనాలతో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా మళ్లీ భారత్‌ తన స్థానం నిలబెట్టుకోనుంది. భారత్‌ వేగంగా రికవరీ సాధిస్తోందని, 2022 చివరికి మొత్తంగా కొవిడ్‌ మునుపటి స్థాయి అయిన 9 శాతం లోపు వృద్ధిరేటుకు చేరుతుందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపినాధన్‌ తెలిపారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని