హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,938 కోట్లు
close

Published : 28/01/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,938 కోట్లు

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,938 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.1,631 కోట్లతో పోలిస్తే ఇది 18.8 శాతం ఎక్కువ. విక్రయాలు కూడా రూ.9,953 కోట్ల నుంచి 20.26 శాతం పెరిగి, రూ.11,969 కోట్లకు చేరాయి. మొత్తం వ్యయాలు రూ.7,849 కోట్ల నుంచి రూ.9,548 కోట్లకు చేరాయి. ‘మా నూతన ఆవిష్కరణలు, అమలు సమర్థత వల్ల డిసెంబరు త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మంచి వృద్ధి నమోదు చేయగలిగాం. న్యూట్రిషన్‌ విభాగం మంచి పని తీరు కనబరిచింద’ని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా వెల్లడించారు. సమీప కాలంలో గిరాకీ మెరుగుపడుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు.


13% పెరిగిన మారికో లాభం

డిసెంబరు త్రైమాసికంలో ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ మారికో రూ.312 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఆర్జించిన రూ.276 కోట్లతో పోలిస్తే ఇది 13.04 శాతం అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.1,824 కోట్ల నుంచి 16.33 శాతం పెరిగి, రూ.2,122 కోట్లకు చేరింది. ‘దేశీయంగా పరిమాణ పరంగా 15 శాతం వృద్ధి నమోదు చేశాం. వినియోగదారు విశ్వాసం మెరుగవుతోంద’ని మారికో ఎండీ సౌగతా గుప్తా వెల్లడించారు.


కెనరా బ్యాంక్‌ లాభం రూ.739 కోట్లు

డిసెంబరు త్రైమాసికంలో కెనరా బ్యాంక్‌ రూ.739.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.406.43 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.15,531.80 కోట్ల నుంచి రూ.24,490.63 కోట్లకు చేరింది. గతేడాది ఏప్రిల్‌ 1న సిండికేట్‌ బ్యాంక్‌ విలీనం జరిగినందున, ఫలితాలను పోల్చలేమంది.


మెప్పించిన బీఓబీ

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.1,159.17 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,218.87 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం మాత్రం రూ.23,134.67 కోట్ల నుంచి రూ.22,070.52 కోట్లకు తగ్గింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 10.43 శాతం నుంచి 8.48 శాతానికి తగ్గాయి.


36% తగ్గిన యాక్సిస్‌ బ్యాంక్‌ నికర లాభం

దిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,116.60 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే కాలంలో బ్యాంక్‌ నమోదు చేసిన నికర లాభం రూ.1,757 కోట్లతో పోలిస్తే ఇది 36 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.19,494.87 కోట్ల నుంచి రూ.19,274.39 కోట్లకు తగ్గింది. ఈసారి కేటాయింపులు భారీగా పెరగడంతో లాభం తగ్గిందని బ్యాంక్‌ సమాచారమిచ్చింది. ఆస్తుల నాణ్యతకొస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 5 శాతం నుంచి 3.44 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.09 శాతం నుంచి 0.74 శాతానికి పరిమితమయ్యాయి. విలువ పరంగా స్థూల నిరర్థక ఆస్తులు రూ.30,073.02 కోట్ల నుంచి రూ.21,997.90 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.12,160.28 కోట్ల నుంచి రూ.4,609.83 కోట్లకు తగ్గాయి.


 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని