కొవాగ్జిన్‌తో యూకే రకం కొవిడ్‌ కట్టడి
close

Published : 28/01/2021 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌తో యూకే రకం కొవిడ్‌ కట్టడి

భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌ వెల్లడి
‘బయోఆర్‌ఎక్స్‌ఐవీ’ లో పరిశోధనా పత్రం
ఈనాడు - హైదరాబాద్‌

చైనాలోని ఊహాన్‌లో వెలుగుచూసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన కొవిడ్‌-19 వైరస్‌తో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కొద్దికాలం క్రితం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో బయటపడిన మరో రకం కొవిడ్‌ వైరస్‌ (యూకే వేరియంట్‌) ఇంకా భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఊహాన్‌ రకం వైరస్‌తో పోల్చితే యూకే రకం వైరస్‌కు 70 శాతం అధిక వేగంతో విస్తరించే గుణం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల పలు ఐరోపా దేశాల్లో కేసుల సంఖ్య, మరణాలు పెరగడంతో పాటు ప్రజాజీవితం అల్లకల్లోలం అవుతోంది. ఇటీవల యూకే నుంచి మనదేశానికి వచ్చిన కొందరు భారతీయుల్లోనూ యూకే రకం కరోనా వైరస్‌ ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. దీనికి విరుగుడు ఏమిటా.. అని పరిశోధకులు తలలు బద్దలు కొట్టుకుంటుంటే, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఆవిష్కరించిన ‘కొవాగ్జిన్‌’ టీకా ఈ వైరస్‌ను కట్టడి చేయగలదని వెల్లడైంది. ‘కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వ్యక్తుల నుంచి తీసిన బ్లడ్‌ సీరమ్‌తో యూకే రకం వైరస్‌ను అదుపు చేయొచ్చు’ అని భారత్‌ బయోటెక్‌ బుధవారం ‘ట్వీట్‌’ చేసింది. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రం ‘లింక్‌’ కూడా అందులో ఇచ్చింది.
నిర్థారించిన ఎన్‌ఐవీ
ఆన్‌లైన్లో జీవశాస్త్రాల పరిశోధనా పత్రాలు ప్రచురించే వెబ్‌సైట్‌ అయిన ‘బయోఆర్‌ఎక్స్‌ఐవీ’ దీన్ని ప్రచురించింది. న్యూయార్క్‌కు చెందిన కోల్డ్‌ స్ప్రింగ్‌ హార్బర్‌ లేబొరేటరీ అనే లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ ఈ వెబ్‌జర్నల్‌ను నిర్వహిస్తోంది. ‘కొవాగ్జిన్‌’ టీకా ఇచ్చిన వ్యక్తుల నుంచి తీసుకున్న బ్లడ్‌ సీరమ్‌ను యూకే రకం కరోనా వైరస్‌పై పరీక్షించినప్పుడు, ఆ వైరస్‌ పూర్తిగా తటస్థీకరణ (న్యూట్రలైజేషన్‌) కు గురికావడాన్ని గుర్తించినట్లు ఈ వ్యాసంలో భారత్‌ బయోటెక్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  
ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) తో కలిసి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషన్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు ఇప్పటికే మనదేశంలో అత్యవసర వినియోగ అనుమతి లభించిన విషయం తెలిసిందే. దీనిపై జరుగుతున్న మూడో దశ క్లినికల్‌ పరీక్షలు మార్చి నాటికి పూర్తవుతాయని అంచనా. హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బీఎస్‌ఎల్‌-3 స్థాయి యూనిట్లో ‘కొవాగ్జిన్‌’ టీకా తయారవుతోంది. యూకే రకం కరోనా వైరస్‌ మీద కూడా ఇది పనిచేస్తుందని తేలడం మరింత ఆసక్తికరంగా మారింది. ‘బయోఆర్‌ఎక్స్‌ఐవీ’ లో వచ్చిన పరిశోధనా పత్రంపై స్పందిస్తూ, ‘‘యూకే రకం కరోనా వైరస్‌ను మొదటిసారిగా ‘కల్చర్‌’ చేసిన సంస్థ ఐసీఎంఆర్‌- ఎన్‌ఐవీ మాత్రమే’’- అని ఐసీఎంఆర్‌ ‘ట్వీట్‌’ చేసింది. భారతదేశంలో కనిపిస్తున్న సార్స్‌-కోవ్‌-2 వైరస్‌తో పాటు యూకే రకం వైరస్‌ మీదా ‘కొవాగ్జిన్‌’ సమర్థంగా పనిచేస్తోందని వివరించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని