పద్దు రోజున అజాగ్రత్త వద్దు
close

Updated : 31/01/2021 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పద్దు రోజున అజాగ్రత్త వద్దు

బడ్జెట్‌ సమయాన ఊగిసలాటలు
మదుపర్లు అప్రమత్తంగా ఉంటేనే మంచిది
బడ్జెట్‌ రేపే

స్టాక్‌ మార్కెట్‌ కదలికలు ఎలా ఉంటాయో సాధారణ రోజుల్లోనే అంతుపట్టవు.
అలాంటిది కీలక పరిణామాల రోజున.. ఇక అస్సలు చెప్పనక్కర్లేదు.
ముఖ్యంగా బడ్జెట్‌ రోజున మార్కెట్‌ కదలాడే తీరు మదుపర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు!!
ఆర్థిక మంత్రి ప్రసంగానికి ముందు ఒకలా.. ప్రసంగం సమయంలో మరోలా.. ప్రసంగం ముగిశాక ఇంకోలా..
ఏ క్షణాన ఏం జరుగుతుందోననే తికమకల మధ్య ట్రేడింగ్‌ సాగుతుంటుంది.
ఆర్థిక మంత్రి ఏ రంగానికి వరాలు ఇచ్చారు? ఏ రంగానికి కోత పెట్టారని గమనిస్తూనే.. ఆ నిర్ణయం వల్ల తమ పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలకు ప్రయోజనమా? లేదా? అనే విషయాన్ని అప్పటికప్పుడు మదుపర్లు మదింపు చేసుకోవాల్సి ఉంటుంది.
విశ్లేషకుల అభిప్రాయాలపైనా ఓ కన్నేసి ఉంచాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో మన షేరు జాతకం తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఇక సెన్సెక్స్‌, నిఫ్టీ లాంటి సూచీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్షణక్షణం సూచీల అంకెలు చకచకా మారుతుంటాయి. అప్పటివరకు లాభాల్లో ఉండి అమాంతం నష్టాలోకి జారుకుంటుంది.. భారీ పతనం నుంచి చూస్తుండగానే ఒక్క ఉదుటున లాభాల్లోకి వస్తుంటుంది.
బడ్జెట్‌ రోజు రేపే. నిన్న మొన్నటి దాకా గరిష్ఠాల వద్ద కదలాడిన సూచీలు.. గత కొద్ది సెషన్లుగా డీలా పడ్డాయి. అయినా కొన్ని షేర్లు మాత్రం అధిక విలువల వద్దే ట్రేడవుతున్నాయి. ఈ విషయాలను పక్కనపెడితే.. రేపటి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఒకవేళ మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. ఇప్పటికే బాగా పెరిగిన షేర్లు, సూచీల లాభాలు పరిమితంగానే ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రతికూల నిర్ణయం తీసుకుంటే లాభాల స్వీకరణ చోటుచేసుకుని సూచీలు భారీగా పతనమయ్యే అవకాశాలనూ కొట్టిపారేయలేమని అంటున్నారు. అందుకే ఈసారి బడ్జెట్‌ రోజున మదుపర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్‌ ఎలా కదలాడిందో ఓసారి చూద్దాం..


గత పదేళ్లలో బడ్జెట్‌ రోజున సెన్సెక్స్‌ ఏడు సార్లు నష్టాలను మూటకట్టుకోగా.. ఐదు సార్లు మాత్రమే లాభాలను నమోదుచేసింది.


నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం (మొదటి, రెండో విడతల్లో కలిపి) ఇప్పటివరకు ఎనిమిది సార్లు (మధ్యంతర బడ్జెట్‌ను కలుపుకొని) బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా..  ఐదు సందర్భాల్లో మార్కెట్‌ నష్టాలను చవిచూసింది. మూడు సార్లు మాత్రమే   లాభాలతో ముగిసింది.


మోదీ హయాంలో కిందటేడాది బడ్జెట్‌ రోజున అత్యధికంగా సెన్సెక్స్‌ 988 పాయింట్లు నష్టపోయింది. ఇక 2017 బడ్జెట్‌ రోజున అత్యధికంగా 486 పాయింట్లు లాభపడింది. ఇది 2016 నవంబరు 9న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కావడం గమనార్హం.


2016, 2018, 2019లో బడ్జెట్‌ రోజున సెన్సెక్స్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. 2016లో అటుఇటుగా 850 పాయింట్లు, 2018లో 750 పాయింట్లు, 2019లో 600 పాయింట్ల మేర ఊగిసలాడింది. బడ్జెట్‌ రోజున మార్కెట్‌ ఎంత తీవ్ర స్థాయిలో ఊగిసలాడుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.


2010, 2011లో బడ్జెట్‌ రోజున లాభాలతో ముగిసిన మార్కెట్‌.. ఆ తర్వాత రెండేళ్లు నష్టాలనే మూటకట్టుకుంది. మళ్లీ 2014 ఫిబ్రవరి 17న లాభాలతో ముగిసింది. ఇది మధ్యంతర బడ్జెట్‌. అదే ఏడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రోజున మళ్లీ నష్టాలతో ముగిసింది.


2009లో అత్యధికంగా 5.83 శాతం సెన్సెక్స్‌ పతనమైంది.2007, 2008లోనూ నష్టాలతోనే ముగిసింది.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని