ముక్కు ద్వారా ఇచ్చే టీకాపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు
close

Published : 11/02/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముక్కు ద్వారా ఇచ్చే టీకాపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు

 భారత్‌ బయోటెక్‌కు కేంద్ర ప్రభుత్వ అనుమతి

 తొలుత 75 మంది వాలంటీర్లపై
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌-19 వ్యాధి నివారణ కోసం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీ కోసం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. ఈ టీకాపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌ దాఖలు చేసిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వంలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) కు చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) ఇందుకు పచ్చజెండా ఊపింది. ‘చింపాంజీ అడెనోవైరస్‌ వెక్టార్డ్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ (బీబీవీ154) (ఇంట్రా-నాసల్‌) పై ఫేజ్‌-1 క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయి చర్చల తర్వాత అనుమతి ఇస్తున్నాం’ అని ఎస్‌ఈసీ పేర్కొంది. నిబంధనల ప్రకారం ఈ పరీక్షలను 75 మంది వాలంటీర్లపై నిర్వహించి సేఫ్టీ- ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని సేకరించాలని సూచించింది.
ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకా అభివృద్ధి చేసేందుకు అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ - సెయింట్‌ లూయిస్‌తో, గత ఏడాది సెప్టెంబరులో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు చేపట్టింది. ఒకవేళ ఈ టీకా కార్యరూపం దాల్చి అందుబాటులోకి వస్తే, దాన్ని అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలను మినహాయించి మనదేశంతో సహా మిగిలిన అన్ని దేశాల్లో విక్రయించే హక్కులు భారత్‌ బయోటెక్‌కు ఉంటాయి.

అందుబాటులోకి తేవడం సులభం:  అధిక జనాభా గల మనదేశానికి ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకా ఎంతో అనువైనదని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం విదితమే. ఇంజెక్షన్‌ ద్వారా ఇచ్చే టీకా నిల్వ, రవాణా, టీకా ఇవ్వడం, ఇంజెక్షన్లు ఉత్పత్తి చేయటం, వాడిన తర్వాత వాటిని సురక్షితంగా ధ్వంసం చేయడం వరకు ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటే, ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకా ఎంతో మేలని ఆయన వివరించారు. ఈ టీకా  విజయవంతం అయితే హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ యూనిట్లోనే తయారు చేస్తారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని