close

Published : 24/02/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమాచార గోప్యత ఎంతో ముఖ్యం

ప్రపంచ వ్యాప్తంగా ఒకేరకమైన నిబంధనలు ఉండాలి
 కొవిడ్‌-19 తో డిజిటల్‌ అభ్యాసం పెరిగింది

మంత్రి కేటీఆర్‌తో చర్చాగోష్ఠిలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల
ఈనాడు - హైదరాబాద్‌

సమాచార గోప్యత మానవాళి హక్కు అని, దీన్ని కాపాడుకోడానికి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలు కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఏకరీతి ప్రమాణాలు ఉండాలని మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల అన్నారు. బయోఏషియా- 2021 లో భాగంగా మంగళవారం ఆయన ఆన్‌లైన్లో మంత్రి కేటీ రామారావుతో సంభాషించారు. కొవిడ్‌-19 మహమ్మారి వల్ల సాంకేతికత వినియోగం ప్రపంచ వ్యాప్తంగా బహుముఖంగా పెరిగిన నేపథ్యంలో, సమాచార గోప్యతకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఏర్పడిందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. మనుషుల జీవితాల్లో, సమాజంలో, ఆర్థిక వ్యవస్థల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం చొచ్చుకుపోతోందని, అందువల్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే నిపుణులు, ఆవిష్కరణల దశలోనే సమాచార గోప్యత, భద్రత, నీతివంతమైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని సత్య నాదెళ్ల సూచించారు. ‘‘టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను, సాధనాలను ఎంతో బాధ్యతతో నిర్మించాలి, సమాచార గోప్యత, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఇదే ఆలోచన చేస్తున్నాం’ అన్నారాయన. సమాచార గోప్యత నిబంధనలు ప్రపంచ వ్యాప్తంగా వేరువేరుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఇటువంటి నిబంధనలు తొలిసారిగా ఐరోపాలో అమల్లోకి వచ్చాయి. తదుపరి ఇతర దేశాలు అదే బాటలో ముందుకు సాగుతున్నాయని వివరించారు.
బూట్లకూ ట్రాకింగ్‌
‘మా అబ్బాయి ఈ మధ్య కొత్త బూట్లు కొన్నాడు. ఆ బూట్లకు ‘ట్రాకింగ్‌ టెక్నాలజీ’ ఉంది. మనం ఎంత దూరం వెళ్లాం, ఎన్ని అడుగులు వేశాం... అనే సమచారం మొత్తం నమోదు చేస్తుంది. నా ఆలోచన ఏమిటంటే, ఈ సమాచారం బయటకు వెళ్లకుండా ఉంటుందా, గోప్యత మాటేమిటి’ అని మంత్రి కేటీ రామారావు వెలిబుచ్చిన సందేహానికి బదులుగా సత్య నాదెళ్ల ఈ అభిప్రాయాలు వెల్లడించారు.  

డిజిటల్‌ అనుసంధానత పెరిగింది
కొవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య మార్పు తీసుకువచ్చిందని, డిజిటల్‌ అభ్యాసం/ డిజిటల్‌ సేవలు ఎంతో వేగంగా ప్రజలకు చేరువయ్యాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. వివిధ రంగాల మధ్య ‘డిజిటల్‌ అనుసంధానత’ బాగా పెరిగిందన్నారు. ఇంటి నుంచి పనిచేయడం, సమయపాలనలో సౌలభ్యం, వీలైన సమయంలో కలవడం.. వంటి మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ మహమ్మారి తగ్గాక కూడా డిజిటల్‌ లెర్నింగ్‌, భాగస్వామ్యం.. వంటి పద్ధతులు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.
అంకుర సంస్థలూ కీలకం
ప్రస్తుత సంక్షోభ సమయంలో అంకుర సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించగలుగుతాయని, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి క్లినికల్‌ పరీక్షలు, ఔషధ పరిశోధనా కార్యకలాపాలను వేగవంతం చేయగలుగుతాయని సత్య నాదెళ్ల అన్నారు. హైదరాబాద్‌లో అయిదేళ్ల క్రితం మంత్రి కేటీఆర్‌తో కలిసి టీ-హబ్‌ను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానానికి, బయాలజీని జోడిస్తే అద్భుత ఆవిష్కరణలు వస్తాయని, ఈ విషయంలో అంకుర సంస్థలకు ఎన్నో అవకాశాలు ఉంటాయని అన్నారు. ‘సైమెట్రిక్స్‌ అనే భారతీయ కంపెనీ నా దృష్టికి వచ్చింది.. క్లినికల్‌ పరీక్షల నిర్వహణలో కొత్త ఒరవడికి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది’ అని వివరించారు. వాయిస్‌ టెక్నాలజీతో వైద్య సేవల్లో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయని, టెలీ మెడిసిన్‌ విప్లవానికి ఇది వీలుకల్పిస్తుందని వివరించారు.
ఆవిష్కరణలకు కేంద్రస్థానం టీ హబ్‌
టీ-హబ్‌ ఇప్పుడు ఎన్నో ఆవిష్కరణలకు కేంద్రస్థానంగా ఎదిగిందని మంత్రి కేటీ రామారావు  ఈ సందర్భంగా వివరించారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు వీలుచేసుకుని ఈ కేంద్రాన్ని మరోసారి సందర్శించాలని సత్య నాదెళ్లను ఆయన కోరారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని